
సాక్షి, హైదరాబాద్ : 2016–17 విద్యా సంవత్సరం వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం నిర్వహించినందుకుగాను ఉపాధ్యాయులకు గౌరవ వేతనం మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 25,109 మంది టీచర్లకు గౌరవ వేతనం కింద రూ.2.75 కోట్లను మంజూరు చేశారు. అయితే టీచర్లకు డైలీ అలవెన్స్ అయిన రూ.225లో పన్నెండో వంతు(రూ.22.40) మొత్తాన్ని రోజుకు మంజూరు చేశారని, ఇది తమను అవమానించడమేనని వివిధ ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. తాము వేసవి సెలవుల్లో పని చేసినందుకు ఎర్న్‌డ్ లీవ్స్ ఇవ్వాలని అడిగితే ముష్టి వేసినట్లు నామమాత్రం డబ్బు మంజూరు చేసి అవమానించారని విమర్శించాయి.
వెకేషన్ డిపార్టుమెంట్ అయిన విద్యా శాఖలో పనిచేసే టీచర్లు వేసవి సెలవుల్లో పనిచేస్తే నిబంధనల ప్రకారం ఈఎల్స్ ఇవ్వాలని పీఆర్‌టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, చెన్నకేశవరెడ్డి, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాములు, రవి, ఎస్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భుజంగరావు, సదానంద్‌గౌడ్, పీఆర్‌టీయూ తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అంజిరెడ్డి, చెన్నయ్య, టీఆర్‌టీఎఫ్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, డీటీఎఫ్ అధ్యక్షుడు రఘుశంకర్‌రెడ్డి, టీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి రఘునందన్ పేర్కొన్నారు. ఇది ఉపాధ్యాయుల శ్రమను దోపిడీకి గురి చేయడం లాంటిదేనని విమర్శించారు. తమను దినసరి కూలీల్లా చూస్తూ ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment