Salary allowances
-
ఈ ఏడాది ముఖేష్ అంబానీ జీతం ఎంతో తెలుసా!
బిలియనీర్ ముఖేష్ అంబానీ రెండో ఏడాది సైతం రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జీతం తీసుకోలేదని తెలుస్తోంది. కోవిడ్-19 సంక్షోభం బిజినెస్, ఎకానమీపై ప్రభావం చూపింది. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో ముఖేష్ అంబానీ తన రెమ్యునరేషన్ వదులుకున్నట్లు తెలుస్తోంది. జులై 22న రిలయన్స్ క్యూ1 వార్షిక ఫలితాల్ని విడుదల చేసింది. తాజాగా ముఖేష్ అంబానీ జీతం ఎంత తీసుకున్నారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఆర్ధిక సంవత్సరంలో ముఖేష్ అంబానీ ఎలాంటి శాలరీ తీసుకోలేదని రిలయన్స్ వెల్లడించింది. కరోనా మహమ్మారి దేశ సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక రంగంపై తీవ్ర నష్టాన్ని కలిగించింది. అందుకే ముఖేష్ అంబానీ 2020-21లో జీతం వద్దనుకున్నారని, అలాగే 2021-22లో సైతం ఎలాంటి రెమ్యునరేషన్ లేదని పేర్కొంది. దీంతో ఈ రెండేళ్లలో రిలయన్స్ సంస్థ అంబానీకి అందించే శాలరీతో పాటు అలవెన్సులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, సోషల్ సెక్యూరిటీ, రిటైరల్ ప్రయోజనాలు, కమీషన్ లేదా స్టాక్ ఆప్షన్స్‌ను కోల్పోయారు. గడిచిన ఆర్ధిక సంవత్సరాల్లో 2020,2021,2022 మార్చి వరకు ముఖేష్ అంబానీ ఎలాంటి శాలరీ తీసులేదు. కానీ 2020కి ముందు ఆయన శాలరీ భారీగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికల ప్రకారం.. ►రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ముఖేష్ అంబానీ మేనేజిరీయల్ కాంపన్సేష లెవల్స్ ఆర్డర్ ప్రకారం..2008-2009లో సుమారు రూ.15కోట్లు శాలరీ తీసుకున్నారు. ► నాటి నుంచి అంటే 2008-09 నుండి 2019-2020 వరకు ఈ 11ఏళ్ల కాలంలో ఏడాదికి జీతం రూ.15కోట్లు మాత్రమే తీసుకున్నారు. చదవండి👉ముఖేష్ అంబానీ స్కెచ్ మామూలుగా లేదుగా! ఇక ప్రత్యర్ధులకు చుక్కలే! -
పార్లమెంట్ సభ్యులకు భలే సౌకర్యాలు
సాక్షి, భువనగిరి : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతి రూపం పార్లమెంట్. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో ఏర్పాటైన తొలిసభ నాటి నుంచి నేటి వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సగౌరవంగా నిలబడింది. పార్లమెంట్‌లోని ఉభయ సభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజా జీవనానికి ఎన్నో సౌకర్యాలు కల్పించారు. అలాంటి ప్రజాప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో వసతులు కల్పించింది. కార్యాలయం ప్రతి పార్లమెంట్ సభ్యుడి పరిధి పలు జిల్లాల్లో విస్తరించి ఉంటుంది. కావున స్థానికంగా ప్రజల సౌకర్యాల కోసం ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. నియోజకవర్గంలో కార్యాలయం ఏర్పాటు చేస్తే నెలకు రూ. 45 వేలు చెల్లిస్తారు. దీంతో పాటు సమావేశాల నిర్వహణకు మరో రూ.45 వేలు ఇస్తారు. దీంతో పాటు స్టేషనరీ ఖర్చుల కోసం రూ.15 వేలు అందుతాయి. పీఏను నియమించుకుంటే రూ.30 వేల వేతనం చెల్లిస్తారు. ఎంపీల జీతభత్యాలు ఎంపీలకు రూ.50 వేలు ఉన్న వేతనాన్ని గతేడాది నుంచి రూ.లక్షకు పెంచారు. మాజీ సభ్యుడికి నెలకు రూ.25వేల పెన్షన్ అందజేస్తారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సభకు హాజరైన సభ్యుడికి రోజుకు రూ.రెండు వేలు చెల్లిస్తారు. గృహ వసతి పార్లమెంట్ సభ్యుడు ఇష్టమైన చోట నివాసం ఉండొచ్చు. ఈ అద్దె అలవెన్సులు కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. పదవీకాలం ముగిసిన ఒక నెల పాటు ఉండవచ్చు. ఇంటి సామగ్రి కొనుగోలుకు వడ్డీ లేకుండా రూ.4 లక్షల రుణం ఇస్తారు. ఇల్లు, కార్యాలయం నిర్వహణకు ప్రతి మూడు నెలలకోసారి రూ.75 వేలు చెల్లిస్తారు. ఏడాదికి 50 వేల లీటర్ల నీళ్లు, 50 వేల యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా వాడుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుంది. అతిథి మర్యాదలు ఎంపీని కలిసేందుకు వచ్చే అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉంటాయి. ఢిల్లీలోని వెస్ట్‌కోర్టు వసతి గృహం, జన్‌పథ్‌లో వసతి పొందవచ్చు. ప్రతి ఎంపీ మూడు టెలిఫోన్ కనెక్షన్లను వినియోగించుకోవచ్చు. ప్రతి ఫోన్ నుంచి 50 వేల కాల్స్ ఉచితంగా పొందవచ్చు. ఇందులో రెండు 3జీ కనెక్షన్లు ఉంటాయి. వైద్య సేవలు ప్రతి ఎంపీ వైద్య సేవల కోసం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో క్లాస్–1 చికిత్స పొందవచ్చు. ఎంపీలకు అందించే అన్ని రకాల వసతులు, నిర్వహణ ఖర్చులు ఆదాయపన్ను పరిధిలోకి తీసుకోరు. రవాణా సౌకర్యాలు పార్లమెంట్ సభ్యుడు తన విధి నిర్వహణలో ఏ ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చినా ఉచిత రవాణా సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. రోడ్డు మార్గంలో అయితే ప్రతి కిలోమీటరుకు రూ.16 చొప్పున చెల్లిస్తారు. రైలు ప్రయాణంలో ఎంపీతోపాటు అతని భార్య, లేదా భర్తతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ఏసీతో పాటు రెండో తరగతి చార్జీలు చెల్లిస్తారు. విమానంలో అయితే ఏడాదిలో 34 సార్లు ప్రయాణించే సదుపాయం పార్లమెంట్ సభ్యులకు ప్రభుత్వం కల్పిస్తుంది. -
ఈఎల్స్‌కు బదులు గౌరవ వేతనం
సాక్షి, హైదరాబాద్ : 2016–17 విద్యా సంవత్సరం వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం నిర్వహించినందుకుగాను ఉపాధ్యాయులకు గౌరవ వేతనం మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 25,109 మంది టీచర్లకు గౌరవ వేతనం కింద రూ.2.75 కోట్లను మంజూరు చేశారు. అయితే టీచర్లకు డైలీ అలవెన్స్ అయిన రూ.225లో పన్నెండో వంతు(రూ.22.40) మొత్తాన్ని రోజుకు మంజూరు చేశారని, ఇది తమను అవమానించడమేనని వివిధ ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. తాము వేసవి సెలవుల్లో పని చేసినందుకు ఎర్న్డ్ లీవ్స్ ఇవ్వాలని అడిగితే ముష్టి వేసినట్లు నామమాత్రం డబ్బు మంజూరు చేసి అవమానించారని విమర్శించాయి. వెకేషన్ డిపార్టుమెంట్ అయిన విద్యా శాఖలో పనిచేసే టీచర్లు వేసవి సెలవుల్లో పనిచేస్తే నిబంధనల ప్రకారం ఈఎల్స్ ఇవ్వాలని పీఆర్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, చెన్నకేశవరెడ్డి, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాములు, రవి, ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భుజంగరావు, సదానంద్‌గౌడ్, పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అంజిరెడ్డి, చెన్నయ్య, టీఆర్టీఎఫ్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, డీటీఎఫ్ అధ్యక్షుడు రఘుశంకర్‌రెడ్డి, టీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి రఘునందన్ పేర్కొన్నారు. ఇది ఉపాధ్యాయుల శ్రమను దోపిడీకి గురి చేయడం లాంటిదేనని విమర్శించారు. తమను దినసరి కూలీల్లా చూస్తూ ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదన్నారు. -
ఉద్యోగులకు ఉత్తమ కంపెనీ టీసీఎస్
న్యూఢిల్లీ: ఉద్యోగులకిచ్చే జీతభత్యాలతో పాటు హెచ్ఆర్కు సంబంధించి 9 అంశాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా టీసీఎస్ ఎంపికయింది. 1072 కంపెనీలను వడపోసి టీసీఎస్‌కు ‘గ్లోబల్ టాప్ ఎంప్లాయర్’ అవార్డును అందజేస్తున్నట్లు ఎంప్లాయర్స్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. ఈ జాబితాలోని సీజేఎస్సీ టెక్నిప్, డీహెచ్ఎల్, డెమైన్షన్ డేటా, సెయింట్ గోబిన్, జేటీ ఇంటర్నేషనల్, మోబినిల్, మోబిస్టర్, ఆరెంజ్, వాలియో వంటి కంపెనీలతో పోటీ పడి టీసీఎస్ ఈ అవార్డును దక్కించుకుంది. కాగా టీసీఎస్ మరింత అభివృద్ధి సాధించడానికి ఇలాంటి అవార్డులు ఎంతగానో ఉపకరిస్తాయని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అజయ్ ముఖర్జీ చెప్పారు. -
ఎవరికి పడితే వారికా?
సాక్షి, హైదరాబాద్: ఎవరికైనా జీతభత్యాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని, అయితే కేబినెట్ హోదా మాత్రం ఎవరికి పడితే వారికి ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. జీతభత్యాలు ఇవ్వడం వేరని, కేబినెట్ హోదా ఇవ్వడం వేరని తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారులు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లకు కల్పించిన కేబినెట్ హోదాను వెంటనే ఉపసంహరించుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. తగిన జీతభత్యాలు, కొన్ని సౌకర్యాలు కల్పించేందుకు కేబినెట్ హోదా ఇచ్చామని, నిబంధనల మేరకే వ్యవహరించామని తెలిపారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘సౌకర్యాలు.. జీతభత్యాలు ఏమైనా ఇవ్వండి.. మాకు సంబంధం లేదు. కానీ కేబినెట్ హోదా ఎవరికి పడితే వారికి, ఎలా పడితే అలా ఇవ్వడానికి వీల్లేదు. జీతభత్యాలు, సౌకర్యాలు వేరు. కేబినెట్ హోదా వేరు’’ అని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ చెప్పడంతో ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్ 14కు వాయిదా వేసింది.