సాక్షి, హైదరాబాద్: ఎవరికైనా జీతభత్యాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని, అయితే కేబినెట్ హోదా మాత్రం ఎవరికి పడితే వారికి ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. జీతభత్యాలు ఇవ్వడం వేరని, కేబినెట్ హోదా ఇవ్వడం వేరని తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ సలహాదారులు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లకు కల్పించిన కేబినెట్ హోదాను వెంటనే ఉపసంహరించుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా మరోసారి విచారించింది.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. తగిన జీతభత్యాలు, కొన్ని సౌకర్యాలు కల్పించేందుకు కేబినెట్ హోదా ఇచ్చామని, నిబంధనల మేరకే వ్యవహరించామని తెలిపారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘సౌకర్యాలు.. జీతభత్యాలు ఏమైనా ఇవ్వండి.. మాకు సంబంధం లేదు. కానీ కేబినెట్ హోదా ఎవరికి పడితే వారికి, ఎలా పడితే అలా ఇవ్వడానికి వీల్లేదు. జీతభత్యాలు, సౌకర్యాలు వేరు. కేబినెట్ హోదా వేరు’’ అని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ చెప్పడంతో ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్ 14కు వాయిదా వేసింది.
ఎవరికి పడితే వారికా?
Published Tue, Sep 1 2015 1:39 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement