‘క్యాబినెట్ హోదా’కు మార్గదర్శకాలేమిటి?
- చట్ట నిబంధనలు ఏం చెబుతున్నాయి
- పూర్తి వివరాలను మా ముందుంచండి
- పిటిషనర్‌కు హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
- ఈ కేసులో సహకరించాలని ఏజీని కోరిన ధర్మాసనం
- తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: వ్యక్తులకు క్యాబినెట్ హోదా ఇవ్వడానికి ఉన్న మార్గదర్శకాలు ఏమిటి? ఈ విషయంలో చట్ట నిబంధనలు ఏం చెబుతున్నాయి? క్యాబినెట్ హోదా ఇవ్వడానికి వ్యక్తులకు ఉండాల్సిన అర్హతలు ఏమిటి? తదితర వివరాలను తమ ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఈ విషయంలో కోర్టుకు సహకరించాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని కోరింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
పలువురు సలహాదారులకు, కార్పొరేషన్ల చైర్మన్లకు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులకు క్యాబినెట్ హోదా ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని అధికరణ 164(1ఎ) ప్రకారం ముఖ్యమంత్రితో సహా మొత్తం మంత్రులు 15 శాతానికి మించి ఉండకూడదన్నారు. కావాల్సిన వారికి ఇష్టమొచ్చినట్లు క్యాబినెట్ హోదా ఇవ్వడానికి వీల్లేదని వివరించారు. గతంలో ఇదే విధంగా పార్లమెంటరీ కార్యదర్శులను నియమించినప్పుడు, ఆ నియామకాలను ఇదే హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టిందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, క్యాబినెట్ హోదా ఉన్న వారు మంత్రిమండలి సమావేశాల్లో పాల్గొంటారా? అంటూ ప్రశ్నించింది. వారు ఆ సమావేశాల్లో పాల్గొనరని, అయితే మంత్రులతో సమానంగా, వారికి జీతభత్యాలు, పలు సౌకర్యాలు ఉంటాయని రవిచందర్ వివరించారు. గతంలో కూడా ఇదే అంశంపై పిల్ దాఖలైందని, పిల్ దాఖలు చేసిన వ్యక్తి తరువాత అధికార పార్టీలో చేరిపోయారని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, అందుకే ఇటువంటి వ్యాజ్యాలను ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు బదులు ప్రైవేటు ప్రయోజన వ్యాజ్యాలుగా భావించాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. రాజ్యాంగం నిర్దేశించిన దానికి మించి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.