AP CM Jagan Mohan Reddy Directed To YSRCP Coordinator and District President For 2024 Assembly Polls - Sakshi
Sakshi News home page

పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం. అందువల్ల పార్టీనే సుప్రీం

Published Thu, Apr 28 2022 3:13 AM | Last Updated on Thu, Apr 28 2022 9:07 AM

CM Jagan directed Ministers YSRCP Coordinators and District Presidents - Sakshi

AP CM Jagan Mohan Reddy Announces Roadmap For 2024 Assembly Polls: వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకుగాను 175 ఎందుకు రాకూడదు? గతంలో కుప్పంలో మనం గెలవలేదు. కానీ కుప్పం మునిసిపాలిటీని గెలిచాం, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయం సాధించాం. అలాంటిది వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో ఎందుకు గెలవలేం? చేయాల్సిన కార్యక్రమాలను సక్రమంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే తప్పక గెలుస్తాం. మనం ఒదిగి ఉంటూ ప్రజలకు చేసిన మంచిని చెప్పాలి. మీ దీవెనలు, ఆశీర్వాదం కావాలని కోరాలి. అన్ని వేళ్లు కలిస్తేనే పిడికిలి అవుతుంది. ప్రజలకు ఇంత మంచి చేసి గొప్ప గెలుపు ఎందుకు సాధించలేం? 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ‘పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం. అందువల్ల పార్టీనే సుప్రీం. పార్టీ పరంగా నిరంతరం దృష్టి, ధ్యాస ఉండాలి. ఇదే విషయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదట్లోనే చెప్పా. ఈ మూడేళ్లలో మనం ఏం చేశామన్నది ప్రజల్లోకి వెళ్లి చెప్పే కార్యక్రమానికి ఇప్పుడు శ్రీకారం చుడుతున్నాం’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలను, జిల్లా అధ్యక్షులను నియమించామని, జిల్లాల ఇన్‌చార్జి మంత్రులను కూడా భాగస్వాములను చేశామని.. వీరందరినీ మంత్రులు గౌరవించాలని చెప్పారు. మనమంతా ఒకటే పార్టీ, ఒకటే కుటుంబం అని.. అందరూ కలసికట్టుగా పని చేయాలని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుల్ని జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్లుగా నియమించి కేబినెట్‌ హోదా కల్పిస్తున్నామని, త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల అవుతాయని తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. వచ్చే రెండేళ్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారికి మార్గ నిర్దేశం చేస్తూ మాట్లాడారు. జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో–ఆర్డినేటర్లు తమ కన్నా ఎక్కువ అనే భావనతో మంత్రులు ఉండాలని, ఎవరికైనా పార్టీనే సుప్రీం అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. మే నెల నుంచి పూర్తిగా గేర్‌ మారుస్తున్నామని, దీనికి అందరూ సన్నద్ధం కావాలన్నారు. ఈ సమావేశంలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

ప్రజలకు అందరూ అందుబాటులో ఉండాల్సిందే
► రెండేళ్లలో మనం ఎన్నికలకు వెళ్తున్నాం. మంత్రి పదవుల్లో ఉన్నవారు కూడా మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా తప్పనిసరిగా గడపగడపకూ కార్యక్రమం నిర్వహించాలి. మంత్రి అయినప్పటికీ ఎక్కువగా అందుబాటులో ఉంటున్నారనే భావన ప్రజలకు కలగాలి. ప్రతి మంత్రీ దీన్ని గుర్తు పెట్టుకోవాలి. 
► మంత్రి అయ్యాక మాకు ఇంకా ఎక్కువగా అందుబాటులోకి వచ్చారనే పాజిటివ్‌ టాక్‌ మీకు ప్లస్‌ అవుతుంది. మంత్రులంతా కచ్చితంగా జిల్లా అధ్యక్షులతో, రీజినల్‌ కో ఆర్డినేటర్లతో పూర్తిగా అనుసంధానం కావాలి. మంత్రులుగా ఉన్నవారు తామే నాలుగు అడుగులు వెనక్కి వేసి మిగిలిన వారిని కలుపుకుని వెళ్లాలి. దీనివల్ల వారి పెద్దరికం పెరుగుతుంది. 
► జిల్లా అధ్యక్షులు, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలుగా బాధ్యతలు తీసుకుంటున్న వారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. పార్టీని గెలిపించుకున్న తర్వాత జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారు మంత్రులుగా వస్తారు. రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ పార్టీ బాధ్యతలు తీసుకుంటారు. ఇలా మార్పులు చేర్పులు జరుగుతాయి. 
► సంక్షేమ పథకాల ద్వారా మూడేళ్లలో నేరుగా నగదు బదిలీతో లబ్ధిదారులకు రూ.1.37 లక్షల కోట్లు అందజేశాం. వచ్చే రెండేళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఇస్తాం. తద్వారా సంక్షేమ పథకాల ద్వారా  ఐదేళ్లలో దాదాపు రూ.2.50 లక్షల కోట్లు అందించినట్లు అవుతుంది.  
► వచ్చే ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయం సాధించడమే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పని చేయాలి. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్నాం.

రెప్పపాటులో రెండేళ్లు పూర్తవుతాయి..
► మనం అధికారంలోకి వచ్చి మూడేళ్లైంది. కళ్లు మూసుకుని తెరిచేలోగానే మిగిలిన రెండేళ్లు కూడా పూర్తవుతాయి. మనం వేగంగా అడుగులు ముందుకేయాల్సిన సమయం ఆసన్నమైందని అందరూ స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మనం అధికారంలో కొనసాగాలి అంటే.. అడుగులు కరెక్ట్‌గా వేయాలి. కిందటసారి వచ్చిన దానికన్నా మెరుగైన ఫలితాలు వచ్చే కార్యక్రమం చేయాలి.
► హోప్‌ అన్నది.. రియల్టీకన్నా.. చాలా బలమైనదని సాధారణంగా వింటాం. కానీ మొట్టమొదటిసారిగా రియాల్టీ కూడా చాలా బలమైనదని మనం నిరూపించాం. మేనిఫెస్టోలోని హామీలలో 95 శాతం మనం ఇప్పటికే నెరవేర్చాం. మొదటి మూడేళ్లు మేనిఫెస్టో అమలుపై దృష్టిపెట్టాం. 
► రేపు లేదు అన్న ధోరణిలో వేగంగా మేనిఫెస్టోను అమలు చేస్తూ అడుగులు ముందుకేశాం. అందులో చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేశాం. గతంలో మాటలకే పరిమితమైన సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించాం. డీబీటీ (నేరుగా నగదు బదిలీ) విధానాన్ని రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అమలు చేశాం. ఇంత బలమైన ఫెర్ఫార్మెన్స్‌ చూపించి ఎన్నికలకు వెళ్లడం అన్నది చాలా అరుదుగా జరిగే సంఘటన. 
 
మే నుంచి గడపగడపకూ.. 
► మే రెండో వారం నుంచి పార్టీ కార్యక్రమాలు ముమ్మరం అవుతాయి. ప్రతి ఎమ్మెల్యే గడపగడపకూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రతి ఎమ్మెల్యే నెలకు పది సచివాలయాలను సందర్శించి ఒక్కొక్క సచివాలయం పరిధిలో 2 రోజులు పర్యటించాలి. ఆ రెండు రోజులు ఎమ్మెల్యేలు ఏం చేయాలనేది జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు పర్యవేక్షించాలి. 
► గడపగడపకూ కార్యక్రమం తొలిదఫా పూర్తి కావడానికి దాదాపు 8–9 నెలలు పడుతుంది. అవినీతి, వివక్ష లేకుండా డీబీటీ ద్వారా బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తున్నాం. వలంటీర్లు చక్కగా పనిచేస్తున్నారు. గడపగడపకూ కార్యక్రమాన్ని చేస్తే ఎమ్మెల్యేలకు మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి ఇంటికీ ఏం మేలు జరిగిందనేది మీ దగ్గర సమాచారం ఉంటుంది. 
► అక్కచెల్లెమ్మల పేరుమీద మీకు లెటర్స్‌ ఇస్తాం. ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వం చేసిన మంచిని అందులో  వివరిస్తాం. ఆ ఇంట్లో అమ్మఒడి, ఆసరా, చేయూత, పింఛన్, ఇళ్ల పట్టాలు.. ఇలా ఎప్పుడు ఏ పథకం ఇచ్చామన్నది అందులో తెలియచేస్తాం. ప్రతి ఇంటికీ వెళ్లి దేవుడి దయతో ఈ మంచి చేయగలిగామని ప్రతి ఎమ్మెల్యే చెప్పాలి. రానున్న రెండేళ్లూ ఇలాంటి మంచి చేస్తామని చెప్పాలి.
► మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ప్రతి కుటుంబం ఆశీస్సులు పొందాలి. మూడేళ్లలో చేసిన మంచిని గుర్తు చేస్తాం. దాంతోపాటు మేనిఫెస్టోలో మనం ఇచ్చిన హామీలు, ఏవి అమలు చేశాం, ఏ స్థాయిలో అమలు చేశామన్న వివరాలతో.. నాడు–నేడు కింద గత సర్కారు ఏం చేసిందీ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది.. అనే అంశాలపై మూడు కరపత్రాలు ఇస్తాం. వీటిని ప్రతి ఇంటికీ ఇచ్చి వాటి మీద వారే టిక్కులు పెట్టొచ్చు. ఈ సమావేశంలో ఉన్నవారికి ఇవన్నీ అదనపు బాధ్యతలు. మీ గ్రాఫ్‌ను పెంచుకోవడమే కాదు.. మీ ఎమ్మెల్యేల గ్రాఫ్‌నూ పెంచుకోవాలి. మీరు సమర్థులని భావిస్తున్నా కాబ్టటి మీకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నా.

బూత్‌ కమిటీల్లో 50 శాతం మహిళలు..
► సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించినప్పుడు గడపగడపకూ పర్యటించడమే కాకుండా క్యాడర్‌ను ఏకం చేయాలి. సచివాలయంలో రెండు రోజుల పర్యటన కాగానే బూత్‌ కమిటీలను ఏర్పాటు చేయాలి. బూత్‌ కమిటీలకు శిక్షణ అత్యంత ముఖ్యం. కమిటీల్లో 50 శాతం మహిళలు ఉండాలి. కనీసం 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండేలా చూడాలి. 
► ఆ గ్రామంలో ఉన్న ప్రతి కమ్యూనిటీకి ప్రాతినిధ్యం కల్పించాలి. ఎవరినీ విస్మరించవద్దు. బూత్‌ కమిటీలో కనీసం 10 మంది ఉండాలి. అవసరం మేరకు  పెంచుకోవాలి. 90 శాతం పథకాలను సద్వినియోగం కావాలనే ఉద్దేశంతో మహిళలకే ఇస్తున్నాం. ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నాం. కుటుంబాలు బాగుండాలనే మనం వారికి ప్రాధాన్యం ఇస్తున్నాం. 

దుష్ట చతుష్టయంపై యుద్ధం 
► మన యుద్ధం ఒక్క చంద్రబాబుతోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ–5 లాంటి చెడిపోయిన వ్యవస్థలతో కూడా యుద్ధం చేస్తున్నాం. వాళ్ల అజెండా వేరు. మనం దిగిపోయి చంద్రబాబు అధికారంలోకి రావాలన్నది వారి అజెండా. దీన్ని కౌంటర్‌ చేయాలంటే ప్రజలకు నిజాలేమిటో చెప్పాలి. స్థిరంగా ఇది కొనసాగాలి. ఎల్లో మీడియా తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. 
► రాబోయే రోజుల్లో ఎల్లో మీడియా ప్రతి ఎమ్మెల్యేనూ లక్ష్యంగా చేసుకుంటుంది. కట్టుకథలు అల్లి విష ప్రచారం చేస్తారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5.. వీరంతా దుష్టచతుష్టయం.  తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తారు. అది జరగకముందే గ్రామాల్లోని మన క్యాడర్‌కు సరైన సమాచారాన్ని చేరవేయాలి. తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. 
► ఈ రోజు నుంచీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టే తీరును పెంచుకోవాలి. ప్రాంతీయ సమన్వయకర్తలు, మంత్రులు, జిల్లా అధ్యక్షులు అందరూ ప్రజలకు సుపరిచితులే. ఎల్లో మీడియా ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు తప్పనిసరిగా మనమంతా ఖండించాలి. సోషల్‌ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలి. గ్రామ స్థాయిలో కూడా మనకు సోషల్‌మీడియా వారియర్స్‌ ఉండాలి. గడపగడపకూ పూర్తయ్యే సరికి ప్రతి గ్రామంలో సోషల్‌ మీడియా వారియర్స్‌ ఉండాలి. ఇందులో క్యాడర్‌ కూడా ఇన్వాల్వ్‌ కావాలి.

ప్లీనరీలోగా సంస్థాగత నిర్మాణం 
► జూలై 8న పార్టీ ప్లీనరీని నిర్వహిస్తున్నాం. ఈలోగా జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలి. 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, 50 శాతం మహిళలకు జిల్లా కమిటీల్లో స్థానం కల్పించాలి. ఎమ్మెల్యేల వద్ద నుంచి మండల కమిటీ అధ్యక్షుల జాబితా తీసుకోవాలి. గ్రామ కమిటీల అధ్యక్షులను కూడా తీసుకోవాలి. తర్వాత రీజనల్‌ సమన్వయ కర్తలు, జిల్లా అధ్యక్షులు వారి సహాయంతో మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తారు.
► పార్టీ పరంగా చేపట్టే కార్యక్రమాల గురించి నిరంతర అనుసంధానం కోసమే ఈ ఏర్పాటు. కమిటీల ఏర్పాటులో తప్పులు, అలసత్వం లేకుండా చూసుకోవాలి. ఎమ్మెల్యేలను బలపరచడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. క్రియాశీలంగా కమిటీలు పనిచేయడానికే ఈ విధానం. ప్లీనరీ నాటికి కమిటీల ఏర్పాటు కావాలి. గడపగడపకూ పూర్తయ్యే నాటికి అంటే 8 నెలల పూర్తయ్యే సరికి బూత్‌ కమిటీలు ఏర్పాటు కావాలి.

మరింత సమర్థంగా సచివాలయాలు 
► సచివాలయాల విధులపరంగా తీసుకోవాల్సిన మార్పులు చేర్పులపై ఎమ్మెల్యేలు సలహాలు ఇవ్వాలి. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల సచివాలయాల సమర్థత మరింత పెరుగుతుంది. గ్రామాలకు వెళ్లినప్పుడు ఇప్పటికే నాడు–నేడు తొలిదశ కింద పనులు పూర్తి చేసుకున్న వాటిని ప్రారంభించి మిగిలిన స్కూళ్లలో రెండోదశ పనులకు శంకుస్థాపన చేయాలి.
► మూడేళ్లలో పెద్ద వ్యవస్థను సృష్టించాం. కార్పొరేషన్లు, ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ ఛైర్మన్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు.. ఇలా ప్రతి ఎన్నికలోనూ గెలిచి పెద్ద వ్యవస్థను సృష్టించుకున్నాం. వీరందర్నీ క్రియాశీలం చేయాలి. ఇది జిల్లా అధ్యక్షుల బాధ్యత. 
► వీరందరి సేవలనూ మనం ఉపయోగించుకోవాలి. దీనిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. జరిగిన మంచి గురించి ఎక్కువ మంది మాట్లాడేలా చేయగలగాలి. మనం చేసిన మంచి ప్రచారంలో ఉండాలి. దీని వల్ల పార్టీకి సానుకూల పవనాలు వీస్తాయి. వివిధ పార్టీ విభాగాలను చైతన్యం చేయాలి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement