కేబినెట్ హోదాలు రాజ్యాంగ విరుద్ధం
* హైకోర్టులో ఎంపీ గుత్తా పిల్
* సలహాదారులు, ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లకు ఆ హోదా ఉపసంహరించాలని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారులు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లకు కేబినెట్ హోదా కల్పించడం సరికాదని.. వెంటనే ఆ హోదాలను ఉపసంహరించుకునేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఇందులో ప్రభుత్వ సీఎస్‌తో పాటు సాధారణ పరిపాలన, యువజన సర్వీసులు, సాంస్కృతిక, సాంఘిక సంక్షేమశాఖల ముఖ్య కార్యదర్శులను, సలహాదారులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. వీరితోపాటు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు ఎస్.వేణుగోపాలచారి, రామచంద్రుడు తేజావత్, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు, ఎస్సీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పిడమర్తి రవి, తెలంగాణ ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సాంస్కృతిక సారథి చైర్మన్ బాలకిషన్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణలను కూడా ప్రతివాదులుగా చేర్చారు. మంత్రిమండలితో సంబంధం లేని వ్యక్తులకు కేబినెట్ హోదా ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని గుత్తా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఖజానాకు భారం..
కేబినెట్ హోదా కలిగిన వ్యక్తులకు పే స్కేల్, ఉచిత గృహ వసతి, వైద్య సదుపాయాలు, సెక్రటేరియల్ స్టాఫ్, వాహనభత్యం, టెలిఫోన్, పన్ను మినహాయిపులు, ఎస్కార్ట్ తదితర సౌకర్యాలు ఉంటాయని, ఇవన్నీ రాష్ట్ర ఖజానాపై భారం మోపుతాయని గుత్తా తన పిటిషన్‌లో వివరించారు. కేబినెట్ అన్న పదం కేవలం మంత్రులకు మాత్రమే వర్తిస్తుందని, రాజ్యాంగంలోని అధికరణ 164(1) ప్రకారం మొత్తం సభ్యుల్లో కేబినెట్ మంత్రుల సంఖ్య 15 శాతానికి మించకూడదని పేర్కొన్నారు.
ప్రభుత్వం తమకు నచ్చిన వ్యక్తులకు కేబినెట్ హోదా కల్పించవచ్చని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని.. సలహాదారులు, ప్రత్యేక ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లకు కల్పించిన కేబినెట్ హోదాను ఉపసంహరించుకునే ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించే అవకాశం ఉంది.