వారికి 'కేబినెట్ హోదా' తగదు!
హైదరాబాద్ :ప్రభుత్వ సలహాదారులు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లకు కేబినెట్ హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ గురువారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. వీరికి కల్పించిన కేబినెట్ హోదాను వెంటనే ఉపసంహరించుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మంత్రిమండలితో సంబంధం లేని వ్యక్తులకు కేబినెట్ హోదా ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని సుఖేందర్‌రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
కేబినెట్ హోదాను ఎవరికి పడితే వారికి పాలకుల ఇష్టానుసారం ఇవ్వడానికి వీల్లేదని ఎంపీ గుత్తా తెలిపారు. కేబినెట్ హోదా కలిగిన వ్యక్తులకు పలు సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని, దాంతో ఖజానాపై భారం పడుతుందని వివరించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, సలహాదారులు, ప్రత్యేక ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లకు కల్పించిన కేబినెట్ హోదాను ఉపసంహరించుకునే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించే అవకాశం ఉంది.