ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..! | Quantumscape CEO Jagdeep Singh: Highest-Paid Individual In The World | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!

Published Sat, Jan 4 2025 3:45 PM | Last Updated on Sat, Jan 4 2025 3:55 PM

Quantumscape CEO Jagdeep Singh: Highest-Paid Individual In The World

ప్రముఖ కంపెనీ సీఈఓ వేతనం రూ.48 కోట్లు.. ‘ఇందులో ప్రత్యేకత ఏముంది.. ప్రస్తుతం చాలామంది ఈ రేంజ్‌ వేతనాన్ని అందుకుంటున్నారు కదా’ అంటారా.. అయితే కేవలం ఈ రూ.48 కోట్లు తన ఒకరోజు సంపాదనే! వేగంగా మారుతున్న టెక్‌ ప్రపంచంలో నైపుణ్యాలు కలిగిన వారికి కంపెనీలు ఎంతైనా చెల్లిస్తాయనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. రోజు రూ.48 కోట్ల చొప్పున జగ్దీప్‌సింగ్‌ వార్షికాదాయం ఏకంగా సుమారు రూ.17,500 కోట్లు. ఇంతకీ ఆయన ఏ కంపెనీలో పని చేస్తున్నారు.. ఎందుకు అంత వేతనం అందిస్తున్నారనే అంశాలను తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ఉద్యోగిగా జగ్దీప్ సింగ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలాన్‌మస్క్‌ వంటి వ్యక్తుల వార్షిక ఆదాయం ఎక్కువే ఉంటుంది. కానీ వారికి వేతనం, షేర్లు, ఇతర అలవెన్స్‌ల రూపంలో చెల్లింపులు అధికంగా ఉంటాయి. సింగ్‌కు నేరుగా అధిక మొత్తంలో వేతనం అందిస్తున్నారు. జగ్దీప్ సింగ్ పెద్ద పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, ప్రపంచంలో పెరుగుతున్న భారతీయ ప్రతిభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ రంగాల్లో పరిశ్రమలు పెరుగుతున్న కొద్దీ ఇన్నోవేటివ్ కంపెనీల్లో లీడర్ల జీతభత్యాలు సైతం వేగంగా పెరుగుతున్నాయి. ‘క్వాంటమ్‌ స్కేప్’ కంపెనీకి సింగ్ నాయకత్వం(సీఈఓ) వహిస్తున్నారు.

టెక్నాలజీలో వస్తోన్న పురోగతి

జగ్దీప్ సింగ్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బీటెక్‌ పూర్తి చేశారు. బెర్క్‌లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి ఎంబీఏ పట్టా పొందారు. బీటెక్‌లో నేర్చుకున్న సాంకేతిక నైపుణ్యాలు, ఎంబీఏలో నేర్చుకున్న వ్యాపార మెలకువలు తాను ఎదిగేందుకు ఎంతో ఉపయోగపడ్డాయని ఆయన అన్నారు. ఆయన క్వాంటమ్ స్కేప్‌ను స్థాపించడానికి ముందు పదేళ్లకు పైగా వివిధ కంపెనీల్లో పనిచేశారు. బ్యాటరీ టెక్నాలజీలో వస్తోన్న విప్లవాత్మక పురోగతిని అర్థం చేసుకోవడానికి ఈ అనుభవం ఎంతో ఉపయోగపడిందని చెబుతున్నారు. ఈ అనుభవంతో 2010లో క్వాంటమ్‌స్కేప్‌ సంస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా నిలుస్తోంది.

ఇదీ చదవండి: ఏథర్‌ కొత్త మోడళ్లు.. ధర ఎంతంటే..

కంపెనీ ఏం చేస్తోందంటే..

క్వాంటమ్ స్కేప్ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే ఘనస్థితి(సాలిడ్‌ స్టేట్‌) బ్యాటరీలను అభివృద్ధి చేస్తోంది. సంప్రదాయ లిథియం-అయాన్ బ్యాటరీలతో పోలిస్తే ఇవి అధిక శక్తిని, వేగవంతమైన ఛార్జింగ్ సమయాన్ని, మెరుగైన భద్రతను అందిస్తున్నాయి. క్లీన్, గ్రీన్ ట్రాన్స్‌పోర్టేషన్‌ దిశగా సాగుతున్న పరిశోధనల్లో ఈ కంపెనీ టెక్నాలజీ ముందంజలో ఉంది. బిల్ గేట్స్, వోక్స్ వ్యాగన్‌ వంటి దిగ్గజాలు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు క్లీన్ ఎనర్జీ స్పేస్‌లో కూడా ఇది కీలకంగా వ్యవహరిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement