ఆర్థికంగా వెలిగిపోదాం! | ELSS Sip For Tax Savings in Fiscal Year | Sakshi
Sakshi News home page

ఆర్థికంగా వెలిగిపోదాం!

Published Mon, Apr 22 2019 9:04 AM | Last Updated on Mon, Apr 22 2019 9:04 AM

ELSS Sip For Tax Savings in Fiscal Year - Sakshi

నూతన ఆర్థిక సంవత్సరం 2019–20లోకి ప్రవేశించి మూడు వారాలు గడిచిపోయింది. ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ, వ్యయాలకు తోడు పన్ను బాధ్యతలు ఎదురవుతుంటాయి. ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఓ ప్రణాళిక రూపొందించుకుని దానిని ఆచరణలో పెడితే ఒడిదుడుకులు లేకుండా సాఫీగా జీవనం కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను ఏడాదికి ఒకసారి అయినా తప్పకుండా సమీక్షించాలని, అందుకు ఏప్రిల్‌ మాసం సరైనదిగా నిపుణుల అభిప్రాయం. ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి తమ పెట్టుబడులకు సంబంధించి అనుసరించ తగిన మార్గాలపై నిపుణుల సూచనలు ఇలా ఉన్నాయి.

ఈఎల్‌ఎస్‌ఎస్‌లో సిప్‌
ఏప్రిల్‌ నుంచే పన్ను ఆదాకు ఉపయోగపడే ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పథకాల్లో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా ప్రతీ నెలా పెట్టుబడుల ప్రణాళికను ఆరంభించాలి. దీంతో ఆర్థిక సంవత్సరం చివర్లో పన్ను ఆదా పెట్టుబడుల గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి రాదని తమన్నావర్మ అనే ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ సూచించారు. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఉండే రిస్క్‌లే ఈఎల్‌ఎస్‌ఎస్‌కు వర్తిస్తాయి. కనుక ప్రతీ నెలా క్రమం తప్పకుండా సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఆటుపోట్లను అధిగమించి మెరుగైన రాబడులను అందుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ స్వల్పకాలిక పనితీరు చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఒక్కసారి ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మూడేళ్లు లాకిన్‌ అయినట్టే. అయితే, ఇది మెరుగైన రాబడులకు వీలు కల్పిస్తుంది.

వాలంటరీ పీఎఫ్‌ (వీపీఎఫ్‌)
ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌) పథకం పరిధిలో ఉన్న వారికి అందు బాటులో ఉన్న చక్కని సాధనం వీపీఎఫ్‌. ఈపీఎఫ్‌కు అనుబంధంగా సభ్యులు చేసే స్వచ్ఛంద కంట్రిబ్యూషన్‌. ఈపీఎఫ్‌కు వర్తించే పన్ను మినహాయింపులు వీపీఎఫ్‌కూ వర్తిస్తాయి. సెక్షన్‌ 80సీ కింద 1.5 లక్షల వరకు పెట్టబడులకు వీపీఎఫ్‌ చందాలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. అలాగే, రాబడులు, ఉపసంహరణలపైనా పన్ను ఉండదు. కనుక మూడు రకాల పన్ను ఆదా ప్రయోజనాలు వీపీఎఫ్‌తో పొందొచ్చు. ఈపీఎఫ్‌ చందాలకు అమలయ్యే వడ్డీ రేటే వీపీఎఫ్‌కూ చెల్లుబాటు అవుతుంది. పీపీఎఫ్‌లోనూ ఇదే మాదిరి పన్ను ఆదా ప్రయోజనాలున్నప్పటికీ ఈపీఎఫ్‌తో పోలిస్తే వడ్డీ రేటు తక్కువ. డెట్‌లో పెట్టుబడులకు వీపీఎఫ్‌ మెరుగైన మార్గం. వేతనం బ్యాంకు ఖాతాలో జమ కావడానికి ముందే వీపీఎఫ్‌ చందాను ఉద్యోగ సంస్థ మినహాయించడం చెల్లింపుల కోణంలో సానుకూలం.

ఇంక్రిమెంట్‌ కూడా...  
ఏటా ఏప్రిల్‌లో ఇంక్రిమెంట్లు పడుతుంటాయి. అంటే ఆదాయం పెరిగినట్టే. పెరిగిన వేతనానికి తగ్గట్టే పెట్టుబడుల మొత్తాన్ని పెంచుకోవాలని నిపుణుల సూచన. చాలా మంది ఎప్పటి మాదిరే మ్యూచువల్‌ ఫండ్స్‌ సిప్‌ కొనసాగిస్తుంటారని, పెరిగిన వేతనం మేరకు పెట్టుబడులను పెంచుకునే వారు తక్కువేనంటున్నారు. కనుక ఈ విధమైన పొరపాట్లకు తావివ్వకుండా ఏప్రిల్‌ నుంచే సిప్‌ మొత్తాలను పెంచుకోవాలని సూచిస్తున్నారు. పెరిగిన ఇంక్రిమెంట్‌లో కనీసం 20 శాతాన్ని అయినా పెట్టుబడుల వైపు మళ్లించాలన్నది  సూచన.

రిటైర్మెంట్‌ కోసం ఎన్‌పీఎస్‌
నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌)కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. దేశంలో ఎవరైనా సరే ఈ పథకంలో చేరి 60 ఏళ్ల వరకు చందాలు చెల్లిస్తూ వెళ్లొచ్చు. విశ్రాంత జీవన అవసరాల కోసం ఉద్దేశించినది ఈ పథకం. గడువు తీరిన తర్వాత 60% మొత్తాన్ని  పన్ను లేకుండా వెనక్కి తీసేసుకోవచ్చు. మిగిలిన 40%తో పెన్షన్‌ యాన్యుటీ ప్లాన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మొత్తంపై అప్పటి రేటు ప్రకారం పెన్షన్‌ అందుతుంది. ఈ పథకంలో గరిష్టంగా ఈక్విటీలకు 75% కేటాయింపులు చేసు కోవచ్చు. ఇప్పటికీ ఎన్‌పీఎస్‌ ఖాతా తెరవని వారు, ప్రారం భించేందుకు ఏప్రిల్‌ అనువైనది. నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయం ఉండి, కేవైసీ నిబంధనలను ఇప్పటికే పూర్తి చేసిన వారు ఆన్‌లైన్‌లోనే ఎన్‌పీఎస్‌ ఖాతాను తెరవొచ్చు. ఎన్‌పీఎస్‌ పోర్టల్‌కు వెళ్లి అక్కడి సూచనలను అనుసరించండి.

పెట్టుబడులకూ ఓ లెక్క...
ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక మొత్తాన్ని ఏప్రిల్‌ నెలలోనే అమలు చేసేయాలని, లేదా మార్చిలో చేయాలనుకోవడం కూడా సరికాదు. ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది కనుక, ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ రానుంది. అందులో ఏవైనా మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆ మార్పులకు అనుగుణంగా ప్రణాళికను కూడా మార్చుకోవాల్సి రావచ్చు. కనుక ఒకేసారి పెట్టుబడులకు దూరంగా ఉండాలి. క్రమానుగత పెట్టుబడులే ఉత్తమం. ఏడాది పొడవునా పెట్టుబడులను కొనసాగించడం వల్ల మార్పు, చేర్పులకు అవకాశం ఉంటుందని పీక్‌ ఆల్ఫా ఇన్వెస్ట్‌మెంట్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ ప్రియా సుందర్‌ పేర్కొన్నారు. దీనివల్ల మరింత ప్రయోజనం ఉండే పన్ను ఆదా పథకాలను ఎంచుకునేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు.

టీడీఎస్‌...
బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పోస్టాఫీసు డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఏడాదిలో రూ.10,000 మించితే టీడీఎస్‌ను గతంలో అమలు చేసే వారు. దీన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి రూ.40,000కు పెంచారు. అదే 60 ఏళ్లు దాటిన వారికి 50,000 వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ ఉండదు. ఒకవేళ వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో 40,000–50,000 మించినట్టయితే, అదే సమయంలో పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ.2.5 లక్షలు మించని వారు టీడీఎస్‌ లేకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం ఫామ్‌ 15హెచ్‌/15జీ ఇవ్వాలి.

పన్నుల్లో మార్పులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) సంబంధించిన మధ్యంతర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పన్ను పరంగా కొన్ని మార్పులు చేసింది. నూతన ఆర్థిక సంవత్సరం
మొదలైంది కనుక మరోసారి వీటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అవసరం.

రూ.5 లక్షలకు పన్ను లేదు
రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారు ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కనీస మినహాయింపు రూ.2.5 లక్షల ఆదాయానికి ఆదాయపన్ను లేదన్న విషయం తెలిసినదే. దీనికి అదనంగా మరో రూ.2.5 లక్షల ఆదాయం ఉన్న వారు 5 శాతం పన్ను రేటు ప్రకారం రూ.12,500ను చెల్లించాల్సి ఉండేది. అయితే, సెక్షన్‌ 87 కింద 12,500 వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్‌ చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. కనుక రూ.2.5 లక్షలపైన ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించేంత ఆదాయం లేకపోయినప్పటికీ రిటర్నులు సమర్పించడం తప్పనిసరి.

ప్రామాణిక మినహాయింపు
ప్రామాణిక మినహాయింపు (స్టాండర్డ్‌ డిడక్షన్‌) రూ.40,000 నుంచి రూ.50,000కు పెరిగింది. 2018లో ఈ స్టాండర్డ్‌ డిడక్షన్‌ను కేంద్రం తిరిగి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అదే సమయంలో ట్రాన్స్‌పోర్ట్, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌పై మినహాయింపులను ఎత్తివేసింది. 

నోషనల్‌ రెంట్‌పై అద్దెలేదు
పన్ను చెల్లింపుదారుల పేరిట రెండో ఇల్లు ఉండి, దానిపై అద్దె ఆదాయం ఏదీ లేకపోయినా నోషనల్‌ రెంట్‌ (ఊహాజనిత) పేరుతో పన్ను వేసే వారు. అయితే, 2019–20 నుంచి ఈ తరహా నోషనల్‌ ఆదాయంపై పన్ను లేదు.

టీడీఎస్‌ పరిమితి పెంపు
వడ్డీ ఆదాయం ఏటా రూ.10,000 దాటితే మూలం వద్దే పన్ను కోత (టీడీఎస్‌)ను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, పోస్టాఫీసు అమలు చేసేవి. కాకపోతే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రూ.40,000 వరకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ అమలు చేయరు. అంతకుమించితేనే అమలు చేస్తారు. 60 ఏళ్లు దాటిన వారికి ఇది రూ.50,000గా అమలవుతుంది. 

ఇంటిపై క్యాపిటల్‌ గెయిన్స్‌
ఇల్లు అమ్మగా వచ్చిన మూలధన లాభంపై పన్ను చెల్లించడానికి బదులు ఆ మొత్తంతో మరో ఇల్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఇకపై ఒక ఇంటి విక్రయంపై వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభంతో (ఎల్‌టీసీజీ) రెండు ఇళ్లు కొనుగోలు చేసినా గానీ పన్ను చెల్లించక్కర్లేదు. గతంలో ఇది ఒక్క ఇంటికే పరిమితమైంది. కాకపోతే ఎల్‌టీసీజీ రూ.2 కోట్లకు మించకుండా ఉంటేనే ఈ ప్రయోజనం వర్తిస్తుంది.

అత్యవసర నిధి
ప్రతీ కుటుంబానికీ అత్యవసర నిధి ఎంతో అవసరం. కనీసం 4–6 నెలల కుటుంబ అవసరాలకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధి కింద  సమకూర్చి పెట్టుకోవాలని నిపుణుల సూచన. ఒకవేళ అత్యవసర నిధి ఇప్పటికీ సమకూర్చుకోని వారు ఆలస్యం చేయకుండా వెంటనే లిక్విడ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను ఆరంభించుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement