
ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8 శాతానికి పైగా కొనసాగించే ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఇది గత సంవత్సరానికి ప్రకటించిన 8.25% రేటుకు దగ్గరగా ఉండనుంది. ఫిబ్రవరి 28న ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌ఓ ఆదాయ, వ్యయాలను పరిగణనలోకి తీసుకుని రిటైర్మెంట్ ఫండ్ బాడీ గణాంకాలను లెక్కలోకి తీసుకోనున్నారు. వీటన్నింటినీ లెక్కించి వడ్డీ రేటును నిర్ణయించడానికి ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ, ఈపీఎఫ్‌ఓ అకౌంట్స్ కమిటీ త్వరలో సమావేశం కానున్నాయని ఓ అధికారి తెలిపారు. సంబంధిత కమిటీలు వివరాలను రూపొందిస్తున్నాయని, గత సంవత్సరాలతో సమానంగా ఉండే వడ్డీ రేటును ప్రతిపాదించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ పెట్టుబడులపై అధిక రాబడులు, సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరిగినట్లు చెప్పారు. అదే సమయంలో క్లెయిమ్ సెటిల్‌మెంట్లు అధికమయ్యాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నేడు పార్లమెంట్‌లో కొత్త ఆదాయపన్ను బిల్లు
2023-24లో రూ.1.82 లక్షల కోట్ల విలువైన 4.45 కోట్ల క్లెయిమ్లను పరిష్కరించగా, 2024-25లో రూ.2.05 లక్షల కోట్ల విలువైన 5.8 కోట్ల క్లెయిమ్లను ఈపీఎఫ్ఓ ప్రాసెస్ చేసిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈపీఎఫ్‌ఓకు 6.5 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 2023-24 సంవత్సరానికి రూ.1,07,000 కోట్ల ఆదాయంపై 8.25 శాతం వడ్డీని ఇచ్చింది. 2022-23లో రూ.11.02 లక్షల కోట్ల అసలు ఆదాయంపై 8.15 శాతం వడ్డీ రేటుపై రూ.91,151.66 కోట్ల ఆదాయం అందించింది. వడ్డీ రేటుకు సంబంధించిన తుది ప్రతిపాదనను ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఆమోదం కోసం సమర్పిస్తారు. ఒకసారి ఆమోదం పొందితే అధికారికంగా నోటిఫై చేసి చందాదారుల ఖాతాల్లో జమ చేయడానికి ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి అవసరం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment