ఆదాయపు పన్ను మినహాయింపునకు ఆఖరి అవకాశాలు! | Income Tax Exemption Last chance ! | Sakshi
Sakshi News home page

ఆదాయపు పన్ను మినహాయింపునకు ఆఖరి అవకాశాలు!

Published Sun, Feb 22 2015 2:44 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

ఆదాయపు పన్ను మినహాయింపునకు ఆఖరి అవకాశాలు! - Sakshi

ఆదాయపు పన్ను మినహాయింపునకు ఆఖరి అవకాశాలు!

మార్చి వచ్చేస్తోంది. వచ్చేనెల 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. నిజానికి ఆదాయపు పన్ను కాస్త తగ్గించుకోవాలన్నా... దానికి తగ్గట్టు ఆదా చెయ్యాలన్నా ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే చెయ్యాలి. నెలజీతంపై ఆధారపడిన ఉద్యోగులైనా, నికర ఆదాయంపై ఆధారపడే వృత్తి నిపుణులైనా అప్పటికప్పుడు డబ్బులు తేవాలంటే కష్టం కనక ఏడాది ఆరంభం నుంచే ప్లానింగ్ చేయాలి. ఏ నిపుణుడు చేసే సూచనైనా ఇదే.

‘సాక్షి’ ప్రాఫిట్ పేజీని రెగ్యులర్‌గా చూసేవారికి సెక్షన్ 80సీ కింద ఈ ఏడాది రూ.1.5 లక్షల వరకు మినహాయింపు చూపించవచ్చన్న విషయంతో పాటు ఏ సెక్షన్ కింద ఎంత పన్ను మినహాయింపు లభిస్తుందనేది కూడా సవివరంగా తెలుసు. అయితే కొందరు మాత్రం ‘తరవాత చూద్దాంలే’ అనే వైఖరితో ఏడాది చివరిదాకా ఎలాంటి ప్లానింగూ చెయ్యరు. మరి అలాంటి వాళ్ల సంగతేంటి? వాళ్లకు ఆఖరి క్షణంలో పన్ను భారం తగ్గించుకునే మార్గాలేమైనా ఉన్నాయా? ఉంటే ఆ మార్గాలేంటి? ఇదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం...
 

ఒకేసారి మొత్తం ఇన్వెస్ట్ చేయొచ్చు
వడ్డీ కూడా 8.5 నుంచి 9.2 శాతం వరకూ గిట్టుబాటు
ఈఎల్‌ఎస్‌ఎస్ మినహా అన్నిటికీ రిస్క్ తక్కువే
మార్కెట్లు బాగున్నపుడు ఈఎల్‌ఎస్‌ఎస్‌పై అధిక రాబడి

 
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
కేంద్ర ప్రభుత్వ మద్దతున్న ఈ పథకాన్ని 1968లో ప్రవేశపెట్టారు. ఏ వయసు వారైనా దగ్గర్లోని బ్యాంకులో గానీ, పోస్టాఫీసులో గానీ ఖాతా తెరవవచ్చు. అయితే ఒక వ్యక్తికి ఒక ఖాతా మాత్రమే ఉండాలి. గరిష్టంగా ఒక ఏడాదిలో రూ.1.5 లక్షలకు మించి డిపాజిట్ చెయ్యకూడదు. ఇలా చేసిన మొత్తంపై పన్ను మినహాయింపూ ఉండదు. వడ్డీ కూడా రాదు. ఏటా మార్చి 31నాటికి ఉండే మొత్తంపై వడ్డీ లెక్కించి చెల్లిస్తారు. 15 ఏళ్ల వ్యవధి తరవాత కూడా కొనసాగించాలనుకుంటే ఐదేళ్ల చొప్పున పెంచుకోవచ్చు. దీనిపై రుణాలు తీసుకోవచ్చు. ఆరేళ్ల తరవాత కొంత మొత్తాన్ని విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. అయితే ప్రతి ఏటా డిపాజిట్ చేయటం తప్పనిసరి. ఏ ఏడాదైనా కనీస మొత్తం డిపాజిట్ చెయ్యని పక్షంలో ఖాతాను డీ-యాక్టివేట్ చేస్తారు. మళ్లీ యాక్టివేట్ చేయాలనుకుంటే ఏడాదికి రూ.50 చొప్పున పెనాల్టీ చెల్లించాలి. మామూలు పీఎఫ్ లేనివారికి రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో నిధిని అందుకోవటానికి ఇది బాగా పనికొస్తుంది.
 
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్
కేంద్ర ప్రభుత్వ మద్దతున్న ఈ సేవింగ్స్ సర్టిఫికెట్లను దగ్గర్లోని ఏ పోస్టాఫీసులోనైనా కొనుగోలు చేయొచ్చు. ఐదేళ్లు, పదేళ్ల వ్యవధికి లభిస్తాయి. మనం కొనేటపుడే ఆ సర్టిఫికెట్ తాలూకు మెచ్యూరిటీ విలువ దానిపై ఉంటుంది. ఉదాహరణకు సర్టిఫికెట్ విలువ రూ.1000 ఉందనుకుంటే దానికన్నా తక్కువ మొత్తానికే (వ్యవధిని బట్టి) దాన్ని విక్రయిస్తారు. మెచ్యూరిటీ గడువు తీరాక రూ.1000 చెల్లిస్తారన్న మాట. దీనిపై కూడా రుణాలు లభిస్తాయి. స్వాతంత్య్రం వచ్చాక దేశ నిర్మాణానికి నిధులు అవసరం గనక 1950లలో కేంద్ర ప్రభుత్వం వీటిని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.

నిజానికి ఐదేళ్లు గానీ, పదేళ్లుగానీ వరసగా ఈ సర్టిఫికెట్లు కొనుగోలు చేస్తూ వెళ్లినవారు ఆ వ్యవధి తరవాత... ఆ వచ్చే సొమ్మునే మళ్లీ రీ-ఇన్వెస్ట్ చేస్తూ ఆదాయపు పన్ను మినహాయింపుల్ని పూర్తిగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు రూ.లక్ష చొప్పున వరసగా ఐదేళ్లు ఇన్వెస్ట్ చేసినవారు... ఆరో ఏడాది నుంచి వచ్చే మెచ్యూరిటీ సొమ్మునే తిరిగి సర్టిఫికెట్లపై పెట్టుబడిగా పెట్టొచ్చన్న మాట. అలా చేస్తే కొత్తగా పన్ను ఆదా కోసం వేరే డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన పని ఉండదు. పెపైచ్చు మెచ్యూర్ అయినప్పుడల్లా చేతికీ కొంత సొమ్ము వస్తుంది.
 
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్
కేంద్రం 2004లో ఆరంభించిన ఈ పథకాన్ని దగ్గర్లోని పోస్టాఫీసులో గానీ, జాతీయ బ్యాంకుల్లో గానీ ఆరంభించవచ్చు. 60 ఏళ్లు దాటిన వారెవరైనా ఈ పథకానికి అర్హులే. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసినవారు 55 ఏళ్లకే దీన్ని ఆరంభించవచ్చు. రక్షణ రంగ ఉద్యోగులు మాత్రం వయసుతో నిమిత్తం లేకుండా ఆరంభించే అవకాశం ఉంది. దీనికి ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉన్నా... స్వల్ప పెనాల్టీతో ఏడాది తరవాత క్లోజ్ చేసే అవకాశం ఉంది. గతేడాది ఏప్రిల్ 1 నుంచి దీనిపై వడ్డీ రేటును సవరించారు.
 
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు
ఏ షెడ్యూల్డ్ బ్యాంకులోనైనా... ఎక్కడైనా ఐదేళ్ల కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తే పన్ను రాయితీ వర్తిస్తుంది. ప్రస్తుతం వివిధ బ్యాంకులు 8.5 శాతం నుంచి 9 శాతం దాకా వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంకును బట్టి ఈ వడ్డీ మారుతుంది. ఈ వడ్డీ మూడు నెలలకోసారి కాంపౌండింగ్ అవుతుంది. ఈ లెక్కన ఉదాహరణకు రూ.లక్ష గనక డిపాజిట్ చేస్తే 8.5% వడ్డీ రేటుతో ఐదేళ్ల తరవాత రూ.1.52 లక్షలవుతుంది. అదే 8.75 వడ్డీ శాతం దగ్గరైతే మరో రూ.1.54 లక్షలవుతుంది. 9 శాతమైతే మరో 2వేలు అదనంగా వస్తుంది. అయితే ఐదేళ్ల కాలానికి 8.4 వడ్డీ శాతంతో పోస్టాఫీసు ఆఫర్ చేస్తున్న టైమ్ డిపాజిట్ పథకం కూడా ఈ కోవలోకే వస్తుంది. వీటిని గడువు తీరకముందే ప్రీక్లోజర్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ అలా చేస్తే పన్ను ప్రయోజనాలను, కొంత వడ్డీని కోల్పోవాల్సి వస్తుంది.
 
ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్

మ్యూచ్‌వల్ ఫండ్లు ఆఫర్ చేసే ఈ పథకాలన్నీ ఓపెన్ ఎండెడ్‌వే. అంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ పథకంలో చేరొచ్చన్న మాట. వీటిలో మనం పెట్టే పెట్టుబడుల్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు గనక మనకు వచ్చే రాబడులు కూడా మార్కెట్లు బావుంటేనే బాగుంటాయి. ఇవి కూడా డైవర్సిఫైడ్ ఫండ్ల లాంటివే. అంటే ఏదో ఒక రంగానికో, ఒక ఇండెక్స్‌కో పరిమితం కాకుండా ఫండ్ మేనేజర్ సూచించిన స్టాక్స్‌లో పెట్టుబడి పెడతారన్న మాట. ఈ పథకంలో ఎంత పెట్టుబడి పెట్టినా గరిష్టంగా రూ.లక్ష వరకే పన్ను మినహాయింపు లభిస్తుంది. పెపైచ్చు వీటిపై రుణాలు రావు.

మూడేళ్లకు ముందు ఎగ్జిట్ కావటం కూడా కుదరదు. ఈఎల్‌ఎస్‌ఎస్‌లో పెట్టుబడి పెట్టేవారు ఎలాంటి ఫండ్లను ఎంచుకోవాలనే విషయమై నిపుణులు కొన్ని సూచనలు చేస్తుంటారు. అవి...
ఏజెంట్ దేన్లో చెబితే దాన్లో ఇన్వెస్ట్ చేయకుండా ట్రాక్ రికార్డు బాగున్న ఫండ్లను చూసుకోవాలి. వాటి మూడేళ్ల ట్రాక్ రికార్డును చూసి... టాప్-3 ఫండ్లలో నచ్చినదాన్ని ఎంచుకుంటే మంచిది. అయితే గతంలో ఉన్న పనితీరు భవిష్యత్తులోనూ ఉంటుందనే గ్యారంటీ ఏమీ లేదండోయ్!! అయినా సరే ఇదే ఉత్తమ మార్గం.
మూడేళ్ల కన్నా తక్కువ ట్రాక్ రికార్డు ఉన్న ఫండ్ల జోలికి వెళ్లకపోవటమే బెటర్.
రూ.300 కోట్ల కన్నా తక్కువ ఆస్తులున్న ఫండ్లను కూడా వదిలిపెట్టడమే మంచిది. ఆయా ఫండ్ల ఫ్యాక్ట్ షీట్ చూస్తే దాని ఆస్తులెంత ఉన్నాయనేది తెలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement