ఈ ఏడాది ఆదాయపు పన్ను గడువు ముగియటానికి ఇంకా 20 రోజులే మిగిలి ఉంది. అంటే మార్చి 31 రావటానికి నిండా మూడు వారాలు కూడా లేదు. పన్ను భారం ఎక్కువవుతోందనుకునే వారు చివర్లో మినహాయింపుల కోసం కొన్ని పెట్టుబడులు పెట్టడం మామూలే. ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా... వారు చివరి క్షణాల్లోనే ఏదో ఒక పథకంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సరే!! ఎవరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా... అది సెక్షన్ 80సీ పరిధిలోకి వచ్చేదైతేనే పన్ను మినహాయింపు లభిస్తుందనేది మనకు తెలియంది కాదు.
బ్యాంకులు జారీ చేసే ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు పీపీఎఫ్ డెట్ విభాగంలోనివి. ఈక్విటీ వైపు చూస్తే ముందు కనిపించేది ఈఎల్‌ఎస్‌ఎస్‌లే. మ్యూచువల్ ఫండ్స్ అందించే రిటైర్మెంట్ సేవింగ్ ఫండ్స్‌లో పెట్టుబడులు సైతం òసెక్షన్ 80సీ కింద ప్రయోజనానికి అర్హత కలిగినవే. పన్ను ఆదాతో పాటు రిటైర్మెంట్ అవసరాల కోసం నిధి సమకూర్చుకునేందుకు ఇవి ఉపకరిస్తాయి. విశ్రాంత జీవనంలో ఇబ్బందులు పడకూడదని భావించే వారు ఏ వయసు వారైనా... ఈ పథకాల వైపు చూస్తే మంచిది.
రిటైర్మెంట్ ఫండ్స్.. ఒక్కొక్కరికి ఒకటి
ఈ ఫండ్స్ సాధారణంగా రిటైర్మెంట్ ప్రణాళిక కోసం ఉద్దేశించినవి. వీటిలో వార్షికంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెడితే అవి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులోకి వస్తాయి. అంతకు మించి పెట్టుబడి పెట్టినా మినహాయింపు లభించేది రూ.1.5 లక్షలకే అని గుర్తుంచుకోవాలి.
హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఈక్విటీ, హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్ సేవింగ్స్ హైబ్రిడ్ ఈక్విటీ, హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్ సేవింగ్స్ హైబ్రిడ్ డెట్, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్ వెల్త్ క్రియేషన్, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్ ఇన్‌కమ్ జనరేషన్, ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ప్లాన్ ఇవన్నీ రిటైర్మెంట్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు, పన్ను మినహాయింపునుకు అర్హత కలిగిన పథకాలే. ఇన్వెస్టర్ల వయసు, రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా పథకాలను ఎంచుకోవాలి.
యువ ఇన్వెస్టర్లయితే..
హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ఈక్విటీ, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్ వెల్త్ క్రిచేషన్ పథకాలు కాస్తంత దూకుడుగా పెట్టుబడులు పెడుతుంటాయి. అంటే అధిక రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులను ఇచ్చే తరహాలో పనిచేస్తాయి. సేకరించిన నిధుల్లో 85 శాతానికిపైగా ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. రిటైర్మెంట్‌కు సుదీర్ఘ సమయం కలిగిన యువ ఇన్వెస్టర్లకు ఈ పథకాలు అనువుగా ఉంటాయి.
రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉంటే...
ఇక హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్ సేవింగ్స్ హైబ్రిడ్ డెట్, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్ ఇన్‌కమ్ జనరేషన్ పథకాలు ఆచితూచి వ్యవహరిస్తాయి. అంటే, పెట్టుబడుల విలువను కాపాడేందుకు తక్కువ రిస్క్ ఉండే సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అధిక రిస్క్ ఉండే ఈక్విటీల్లో కేవలం 20– 25 శాతాన్నే ఇన్వెస్ట్ చేస్తాయి. రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్న వారికి ఇవి అనువైనవి. రిస్క్ వద్దనుకునే మధ్య వయస్కులూ వీటిని ఎంచుకోవచ్చు.
మధ్యస్థంగా రిస్క్ భరించగలిగితే...
హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ అయితే ఈక్విటీల్లో 65–70 శాతం ఇన్వెస్ట్ చేస్తాయి. ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్ ప్లాన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ప్లాన్ పథకాలు ఈక్విటీలకు 40 శాతం కేటాయింపులు చేస్తుంటాయి. మిగిలిన నిధుల్ని బాండ్లలో పెడతాయి. మధ్యస్థంగా రిస్క్ భరించే వారు వీటిని పరిశీలించొచ్చు.
ఫ్రాంక్లిన్, యూటీఐ.... సుదీర్ఘ చరిత్ర
ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్ ప్లాన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ప్లాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఏడాది, మూడేళ్లు, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో ఈ పథకాలు చక్కని పనితీరు చూపించాయి. గత పది సంవత్సరాల కాలంలో వార్షికంగా 8.7 నుంచి 9.4 శాతం వరకు రాబడులిచ్చాయి.
రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ పథకాలకు సుదీర్ఘ చరిత్ర లేదు. ఈ మధ్యే ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ ప్రారంభం నుంచి చూస్తే చెప్పుకోతగ్గ రాబడులనే ఇచ్చాయి. మార్కెట్లు బుల్ ర్యాలీలో ఉండడంతో గడిచిన ఏడాది కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ఈక్విటీ, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్ వెల్త్ క్రియేషన్ 34 శాతం చొప్పున లాభపడ్డాయి.
లాకిన్ పీరియడ్... మూడు లేదా ఐదేళ్లు!
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ పథకాల (ఈఎల్‌ఎస్‌ఎస్) మాదిరే రిటైర్మెంట్ ఫండ్స్‌లోనూ మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అయితే ఇది పథకాలను బట్టి మారిపోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన రిటైర్మెంట్ ఫండ్స్‌కు లాకిన్ పీరియడ్ ఐదేళ్లు.
ప్రాంక్లిన్ ఇండియా పెన్షన్ ప్లాన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ప్లాన్‌లో మూడు ఆర్థిక సంవత్సరాలు లాకిన్ పీరియడ్‌గా అమల్లో ఉంది. సెబీ ఇటీవల మ్యూచువల్ ఫండ్ పథకాల వర్గీకరణలో మార్పులు చేయడంతో ఈ పథకాల్లోనూ లాకిన్ పీరియడ్ ఐదేళ్లకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. రిటైర్మెంట్ ఫండ్స్ అన్నవి దీర్ఘకాలిక లక్ష్యానికి ఉద్దేశించినవి. ఇందుకు సంబంధించిన ప్రయోజనాలు నెరవేరడానికి ఇవి దోహదపడతాయి.
మధ్యలో ఉపసంహరిస్తే ఎగ్జిట్ లోడ్...
మధ్యలో కీలకమైన అవసరాలు ఏర్పడితే ఈ ఫండ్స్ నుంచి పెట్టుబడుల్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. కానీ, ముందుగా పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవటాన్ని తగ్గించేందుకు కంపెనీలు ఎగ్జిట్ లోడ్ విధిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఫండ్స్ లాకిన్ పీరియడ్ ముగిసి, 60 ఏళ్లు రాకముందే పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే విలువలో ఒక శాతాన్ని ఎగ్జిట్ లోడ్‌గా వసూలు చేస్తున్నాయి. ఇక పన్ను అంశాలనూ చూడాలి.
ఈక్వీటీ తరహా పథకాలను (అంటే మొత్తం నిధుల్లో 65 శాతం కంటే ఎక్కువ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేవి) ఏడాది తర్వాత విక్రయిస్తే వాటిపై 10 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పడుతుంది. అదే డెట్ పథకాల్లో అయితే మూడేళ్ల తర్వాత విక్రయిస్తే 20 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
రిటైర్మెంట్ ఫండ్స్‌లో లాకిన్ పీరియడ్ ఐదేళ్లు ఉంది కనుక డెట్ ఫండ్స్‌ను ఆ తర్వాత విక్రయిస్తే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి మిగిలిన లాభంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాలు ప్రధానంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేవి. అదే, రిటైర్మెంట్ ఫండ్స్ అయితే డెట్‌లో ఇన్వెస్ట్ చేసేవీ ఉంటాయి. రిటైర్మెంట్ ఫండ్స్‌ను ఎన్‌పీఎస్, ఇతర పథకాలతో కలసి పెట్టుబడులకు పరిశీలించొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment