ఇప్పటినుంచే పన్ను ఆదా! | Up next, PAN card to be issued in 48 hours flat! | Sakshi
Sakshi News home page

ఇప్పటినుంచే పన్ను ఆదా!

Published Sun, Apr 26 2015 1:29 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

ఇప్పటినుంచే పన్ను ఆదా! - Sakshi

ఇప్పటినుంచే పన్ను ఆదా!

కొత్త ఆర్థిక సంవత్సరం మొదలై నెల కావస్తోంది. ఒకటి రెండు నెలలు ఊరుకున్నా... ఆ తరవాత నుంచి యాజమాన్యాలు ఉద్యోగుల జీతాల్లోంచి పన్ను కోతలు మొదలుపెట్టేస్తాయి. అప్పటిదాకా మనకేంటిలే అని ఊరుకున్న వారంతా అప్పటి నుంచి ప్లానింగ్ మొదలుపెడతారు. చివర్లో కోతలు ఎక్కువయ్యేసరికి పరుగులు పెట్టి అప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తాం. అలా కాకుండా ఏడాది మొదటి నుంచే ప్లానింగ్ మొదలుపెడితే...! అలా చేస్తే పన్ను ప్రయోజనాలన్నీ పొందొచ్చు.

పన్ను బెడదను తప్పించుకోనూ వచ్చు. ఇవన్నీ ఒకెత్తయితే ఈ ఏడాది పన్ను చట్టంలో పలు మార్పులు కూడా చోటుచేసుకున్నాయి. మినహాయింపులూ మారాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని... ఏం చేస్తే బాగుంటుందో... ఎక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలో చెప్పేదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం..

- సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం

 
ఆఖరి వరకు ఆగితే ఆదాయ పన్నుతో ఇబ్బందే
ముందు నుంచీ మొదలుపెడితే గరిష్ట ప్రయోజనాలు
ఈ ఏడాది ఆదాయ పన్ను చట్టంలో పలు మార్పులు

 
ఆకర్షణీయంగా ఎన్‌పీఎస్...
ఈ సారి బేసిక్ లిమిట్, పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పూ లేదు. కాకపోతే పన్ను మినహాయింపుల్లో కీలకమైన సెక్షన్ 80సీకి అదనంగా మరో సెక్షన్ వచ్చి చేరింది. అదే 80సీ(డి). ఈ సెక్షన్ కింద మరో రూ.50,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ 80సీ(డి) పరిధిలోకి వచ్చే న్యూ పెన్షన్ సిస్టమ్‌లో (ఎన్‌పీఎస్) ఇన్వెస్ట్ చేసే మొత్తంపై గరిష్టంగా రూ.50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. గతేడాది వరకు ఎన్‌పీఎస్ కూడా సెక్షన్ 80సీలోనే ఉండేది.

ఇప్పుడు దీన్ని ప్రత్యేక సెక్షన్‌గా విడదీశారు. అంటే సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.50 లక్షలకు అదనంగా మరో రూ.50,000 అంటే మొత్తం రూ. 2,00,000 వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చన్న మాట. దీని వల్ల 30% పన్ను శ్లాబులో ఉండేవారికి అదనంగా రూ. 15,000 వరకు పన్ను భారం తగ్గుతుంది. 20 శాతం పన్ను పరిధిలోకి వచ్చే వారికి రూ.10,000, 10% శ్లాబులో ఉన్న వారికి రూ.5,000 పన్ను తగ్గుతుంది. అందుకని ఈ ఏడాది నుంచి ప్రతి ఒక్కరి ట్యాక్స్ ప్లానింగ్‌లో ఉండాల్సిన పథకాల్లో ఎన్‌పీఎస్ వచ్చి చేరింది.
 
మరింత ఆరోగ్య ధీమా...
ఈ ఏడాది జరిగిన మరో ముఖ్యమైన మార్పు సెక్షన్ 80డీ పరిమితులు పెంచడం. ఈ సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియంపై లభించే పన్ను మినహాయింపు పరిధిని పెంచారు. 60 ఏళ్ళలోపు వారికి ఇప్పటి వరకు రూ.15,000 వరకు మాత్రమే మినహాయింపు లభించేది. ఇప్పుడు దీన్ని రూ.25,000 చేశారు.  అదే సీనియర్ సిటిజన్స్ అయితే రూ.30,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ముందస్తు వైద్య పరీక్షలకు చేసే వ్యయంపై గరిష్టంగా రూ.5,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

అయితే ఈ మొత్తం రూ.25,000 పరిధిలోకే వస్తుంది. భార్యభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులపై చేసే వైద్య పరీక్షల్ని దీనికోసం వినియోగించుకోవచ్చు. ఇదికాక తల్లిదండ్రులకు చెల్లించే వైద్య బీమా ప్రీమియంపై కూడా మినహాయింపులు పొందవచ్చు. తల్లిదండ్రులు 60 ఏళ్ళ లోపు వారైతే రూ.25,000, అదే సీనియర్ సిటిజన్స్ అయితే రూ.30,000 అదనంగా పొందవచ్చు. అంటే ఈ సెక్షన్‌తో గరిష్టంగా రూ. 60,000 వరకు ప్రయోజనం పొందవచ్చు.
 
రెట్టింపైన రవాణాభత్యం..
హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి జీతంలో రవాణా భత్యం ఉంటుంది. ప్రతి నెలా జీతంలో కన్వేయెన్స్ అలవెన్స్ కింద రూ.800 లభిస్తాయి. ఇది పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ ఇన్‌కమ్. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.1,600కు పెంచడం జరిగింది. దీని ప్రకారం మీ జీత భత్యాల్లో మార్పులు చేయడం ద్వారా అదనంగా ఏడాదికి రూ. 9,600 వరకు పన్ను భారం తగ్గించుకోవచ్చు.
 
ట్యాక్స్ ఫ్రీ బాండ్స్..
ఈ ఏడాది ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా అప్పుడే ఎన్‌హెచ్‌ఏఐ, రైల్వే, ఆర్‌ఈసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై ఎలాంటి పన్ను మినహాయింపులు లభించవు. అయితే వీటిపై లభించే వడ్డీని ఆదాయంగా పరిగణించరు. ఆ మేరకు పన్ను భారం తగ్గుతుంది. ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఇవి అనువుగా ఉంటాయి. తగిన స్థిర ఆదాయానికి నిపుణులు వీటిని సూచిస్తున్నారు.
 
సుకన్య... సమృద్ధి
ఆడబిడ్డల కోసం ప్రధాని కిందటి ఏడాది కొత్త డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ‘సుకన్య సమృద్ధి’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకంపై అత్యధిక వడ్డీతో పాటు, పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఈ ఏడాది 9.2 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నారు. 10 ఏళ్ళ లోపు అమ్మాయిల పేరు మీద మాత్రమే ఈ పథకాన్ని తీసుకోగలరు. అమ్మాయి వయస్సు 21 ఏళ్లు లేదా వివాహ తేది ఏది ముందైతే అది మెచ్యూరిటీగా పరిగణిస్తారు. ఈ పథకంలో ఇన్వెస్ట్‌మెంట్‌పై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. వడ్డీరేట్లు తగ్గుతున్న సమయంలో ఇది చక్కటి రిటర్న్స్ ఇస్తుంది.
 
తొలిసారి షేర్లు కొంటున్నారా..
తొలిసారి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారు కూడా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఇందుకోసం 80సీసీజీ రూపంలో రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం అందుబాటులో ఉంది. ఇది కేవలం తొలిసారిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికే వర్తిస్తుంది. ఈ పథకం కింద  గరిష్టంగా ఇన్వెస్ట్ చేసే రూ.50,000లో  సగభాగం అంటే రూ.25,000 పన్ను ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. ఇలా వరుసగా మూడేళ్ళు చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఈ మినహాయింపు పొందవచ్చు. వార్షికాదాయం పన్నెండు లక్షలు దాటిన వారికి ఇది వర్తించదు.
 
మరిన్ని మార్గాలు...
మరిన్ని పన్ను ప్రణాళికల మార్గాలను చూస్తే... ఎప్పటిలాగా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు లభించే బీమా, ఐదేళ్ళ బ్యాంకు డిపాజిట్లు, పోస్టాఫీసు పథకాలు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్‌స్కీం (ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్), పీపీఎఫ్, హౌసింగ్ లోన్, ట్యూషన్ ఫీజులు తదితర అంశాలు ఉండనే ఉన్నాయి. వీటన్నింటిని చక్కగా వినియోగించుకోవడం ద్వారా గరిష్టంగా పన్ను ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది.. ఎలాంటి ఆలశ్యం లేకుండా పన్ను మినహాయింపు పొందడంపై ప్రణాళికలు రూపొందించుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement