Tax saving funds
-
ఇప్పటినుంచే పన్ను ఆదా!
కొత్త ఆర్థిక సంవత్సరం మొదలై నెల కావస్తోంది. ఒకటి రెండు నెలలు ఊరుకున్నా... ఆ తరవాత నుంచి యాజమాన్యాలు ఉద్యోగుల జీతాల్లోంచి పన్ను కోతలు మొదలుపెట్టేస్తాయి. అప్పటిదాకా మనకేంటిలే అని ఊరుకున్న వారంతా అప్పటి నుంచి ప్లానింగ్ మొదలుపెడతారు. చివర్లో కోతలు ఎక్కువయ్యేసరికి పరుగులు పెట్టి అప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తాం. అలా కాకుండా ఏడాది మొదటి నుంచే ప్లానింగ్ మొదలుపెడితే...! అలా చేస్తే పన్ను ప్రయోజనాలన్నీ పొందొచ్చు. పన్ను బెడదను తప్పించుకోనూ వచ్చు. ఇవన్నీ ఒకెత్తయితే ఈ ఏడాది పన్ను చట్టంలో పలు మార్పులు కూడా చోటుచేసుకున్నాయి. మినహాయింపులూ మారాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని... ఏం చేస్తే బాగుంటుందో... ఎక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలో చెప్పేదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం.. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం ⇒ ఆఖరి వరకు ఆగితే ఆదాయ పన్నుతో ఇబ్బందే ⇒ ముందు నుంచీ మొదలుపెడితే గరిష్ట ప్రయోజనాలు ⇒ ఈ ఏడాది ఆదాయ పన్ను చట్టంలో పలు మార్పులు ఆకర్షణీయంగా ఎన్పీఎస్... ఈ సారి బేసిక్ లిమిట్, పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పూ లేదు. కాకపోతే పన్ను మినహాయింపుల్లో కీలకమైన సెక్షన్ 80సీకి అదనంగా మరో సెక్షన్ వచ్చి చేరింది. అదే 80సీ(డి). ఈ సెక్షన్ కింద మరో రూ.50,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ 80సీ(డి) పరిధిలోకి వచ్చే న్యూ పెన్షన్ సిస్టమ్‌లో (ఎన్పీఎస్) ఇన్వెస్ట్ చేసే మొత్తంపై గరిష్టంగా రూ.50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. గతేడాది వరకు ఎన్పీఎస్ కూడా సెక్షన్ 80సీలోనే ఉండేది. ఇప్పుడు దీన్ని ప్రత్యేక సెక్షన్‌గా విడదీశారు. అంటే సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.50 లక్షలకు అదనంగా మరో రూ.50,000 అంటే మొత్తం రూ. 2,00,000 వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చన్న మాట. దీని వల్ల 30% పన్ను శ్లాబులో ఉండేవారికి అదనంగా రూ. 15,000 వరకు పన్ను భారం తగ్గుతుంది. 20 శాతం పన్ను పరిధిలోకి వచ్చే వారికి రూ.10,000, 10% శ్లాబులో ఉన్న వారికి రూ.5,000 పన్ను తగ్గుతుంది. అందుకని ఈ ఏడాది నుంచి ప్రతి ఒక్కరి ట్యాక్స్ ప్లానింగ్‌లో ఉండాల్సిన పథకాల్లో ఎన్పీఎస్ వచ్చి చేరింది. మరింత ఆరోగ్య ధీమా... ఈ ఏడాది జరిగిన మరో ముఖ్యమైన మార్పు సెక్షన్ 80డీ పరిమితులు పెంచడం. ఈ సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియంపై లభించే పన్ను మినహాయింపు పరిధిని పెంచారు. 60 ఏళ్ళలోపు వారికి ఇప్పటి వరకు రూ.15,000 వరకు మాత్రమే మినహాయింపు లభించేది. ఇప్పుడు దీన్ని రూ.25,000 చేశారు. అదే సీనియర్ సిటిజన్స్ అయితే రూ.30,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ముందస్తు వైద్య పరీక్షలకు చేసే వ్యయంపై గరిష్టంగా రూ.5,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఈ మొత్తం రూ.25,000 పరిధిలోకే వస్తుంది. భార్యభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులపై చేసే వైద్య పరీక్షల్ని దీనికోసం వినియోగించుకోవచ్చు. ఇదికాక తల్లిదండ్రులకు చెల్లించే వైద్య బీమా ప్రీమియంపై కూడా మినహాయింపులు పొందవచ్చు. తల్లిదండ్రులు 60 ఏళ్ళ లోపు వారైతే రూ.25,000, అదే సీనియర్ సిటిజన్స్ అయితే రూ.30,000 అదనంగా పొందవచ్చు. అంటే ఈ సెక్షన్‌తో గరిష్టంగా రూ. 60,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. రెట్టింపైన రవాణాభత్యం.. హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి జీతంలో రవాణా భత్యం ఉంటుంది. ప్రతి నెలా జీతంలో కన్వేయెన్స్ అలవెన్స్ కింద రూ.800 లభిస్తాయి. ఇది పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.1,600కు పెంచడం జరిగింది. దీని ప్రకారం మీ జీత భత్యాల్లో మార్పులు చేయడం ద్వారా అదనంగా ఏడాదికి రూ. 9,600 వరకు పన్ను భారం తగ్గించుకోవచ్చు. ట్యాక్స్ ఫ్రీ బాండ్స్.. ఈ ఏడాది ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా అప్పుడే ఎన్హెచ్ఏఐ, రైల్వే, ఆర్ఈసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై ఎలాంటి పన్ను మినహాయింపులు లభించవు. అయితే వీటిపై లభించే వడ్డీని ఆదాయంగా పరిగణించరు. ఆ మేరకు పన్ను భారం తగ్గుతుంది. ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఇవి అనువుగా ఉంటాయి. తగిన స్థిర ఆదాయానికి నిపుణులు వీటిని సూచిస్తున్నారు. సుకన్య... సమృద్ధి ఆడబిడ్డల కోసం ప్రధాని కిందటి ఏడాది కొత్త డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ‘సుకన్య సమృద్ధి’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకంపై అత్యధిక వడ్డీతో పాటు, పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఈ ఏడాది 9.2 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నారు. 10 ఏళ్ళ లోపు అమ్మాయిల పేరు మీద మాత్రమే ఈ పథకాన్ని తీసుకోగలరు. అమ్మాయి వయస్సు 21 ఏళ్లు లేదా వివాహ తేది ఏది ముందైతే అది మెచ్యూరిటీగా పరిగణిస్తారు. ఈ పథకంలో ఇన్వెస్ట్‌మెంట్‌పై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. వడ్డీరేట్లు తగ్గుతున్న సమయంలో ఇది చక్కటి రిటర్న్స్ ఇస్తుంది. తొలిసారి షేర్లు కొంటున్నారా.. తొలిసారి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారు కూడా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఇందుకోసం 80సీసీజీ రూపంలో రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం అందుబాటులో ఉంది. ఇది కేవలం తొలిసారిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికే వర్తిస్తుంది. ఈ పథకం కింద గరిష్టంగా ఇన్వెస్ట్ చేసే రూ.50,000లో సగభాగం అంటే రూ.25,000 పన్ను ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. ఇలా వరుసగా మూడేళ్ళు చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఈ మినహాయింపు పొందవచ్చు. వార్షికాదాయం పన్నెండు లక్షలు దాటిన వారికి ఇది వర్తించదు. మరిన్ని మార్గాలు... మరిన్ని పన్ను ప్రణాళికల మార్గాలను చూస్తే... ఎప్పటిలాగా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు లభించే బీమా, ఐదేళ్ళ బ్యాంకు డిపాజిట్లు, పోస్టాఫీసు పథకాలు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్స్కీం (ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్), పీపీఎఫ్, హౌసింగ్ లోన్, ట్యూషన్ ఫీజులు తదితర అంశాలు ఉండనే ఉన్నాయి. వీటన్నింటిని చక్కగా వినియోగించుకోవడం ద్వారా గరిష్టంగా పన్ను ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది.. ఎలాంటి ఆలశ్యం లేకుండా పన్ను మినహాయింపు పొందడంపై ప్రణాళికలు రూపొందించుకోవాలి. -
మార్కెట్‌ను మించిన ట్యాక్స్ ఫండ్స్
గతేడాది కాలంగా స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. ఇదే సమయంలో ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ప్రధాన సూచీలను మించి లాభాలను అందిస్తున్నాయి. గతేడాది కాలంలో నిఫ్టీ 39% లాభాలను అందిస్తే ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ 69% నుంచి గరిష్టంగా 110% వరకు లాభాలను అందించాయి. ఈ గణాంకాలకు తోడు గత బడ్జెట్లో ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పొందే పన్ను లాభాల పరిమితిని లక్ష రూపాయల నుంచి రూ.1.5 లక్షలకు పెంచడంతో ఈ పథకాల్లో మదుపు చేయడానికి ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారు. ఇతర ట్యాక్స్ సేవింగ్ పథకాలతో పోలిస్తే పలు ప్రయోజనాలు ఉండటం కూడా ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి కారణంగా చెప్పుకోవచ్చు. బహుళ ప్రయోజనాలు కలిగిన ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌లో ఉండే లాభనష్టాలను ఇప్పుడొకసారి పరిశీలిద్దాం.. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే లాభనష్టాలను అందిస్తుండటంతో వీటిని ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) లేదా ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అని పిలుస్తారు. ఇవి ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ప్రధానంగా లార్జ్, మిడ్‌క్యాప్ షేర్లలో పెట్టుబడి చేయడం ద్వారా వీటిపై వచ్చే లాభనష్టాలను ఇన్వెస్టర్లకు అందిస్తాయి. ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మూడు సంవత్సరాల వరకు వైదొలిగే అవకాశం లేకపోవడంతో దీర్ఘకాలంలో మంచి లాభాలను అందించే అవకాశం ఉన్న షేర్లను ఎంపిక చేసుకొని ఇన్వెస్ట్ చేసే సౌలభ్యం ఫండ్ మేనేజర్లకు లభిస్తుంది. ఈ కారణంగానే ఇండెక్స్‌లు కంటే ఎక్కువ లాభాలను ఈ స్కీమ్స్ అందించగలిగాయి. ఫండ్ మేనేజర్లు లార్జ్‌క్యాప్స్‌తో పాటు మిడ్‌క్యాప్ షేర్లలో కూడా ఇన్వెస్ట్ చేయడం ఈ లాభాలకు ప్రధాన కారణం. అయితే ఈ ఏడాది ఇంత లాభాలు వచ్చాయి కాబట్టి వచ్చే ఏడాది కూడా ఇదే విధమైన లాభాలు వస్తాయన్న హామీ ఏమీ ఉండదు. వీటి రాబడులు పూర్తిగా స్టాక్ మార్కెట్ కదలికలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి కచ్చితమైన రాబడిని ఆశించలేం. లాభనష్టాలు రెండింటికీ ఆస్కారం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఉండే సహజసిద్ధమైన ఒడిదుడుకులను తట్టుకొని నిల బడితే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి లాభాలను పొందవచ్చని దీర్ఘకాలంగా వీటి పనితీరు వెల్లడిస్తున్నది. అంతే ఒకేసారి వద్దు ఇప్పుడు దాదాపు అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు ట్యాక్స్ సేవింగ్ స్కీంలను అందిస్తున్నాయి. వీటిని నేరుగా ఆయా ఫండ్ హౌస్‌లకు దరఖాస్తుచేయడం లేదా మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ల ద్వారా కాని ఇన్వెస్ట్ చేయవచ్చు. నేరుగా ఇన్వెస్ట్ చేస్తే ఏజెంట్ కమీషన్లు ఉండవు కాబట్టి మరికొంత అదనపు రాబడిని పొందవచ్చు. నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికోసం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ సంస్థలు డెరైక్ట్ ప్లాన్ పేరుతో ప్రత్యేకంగా ఎన్ఏవీని అందిస్తున్నాయి. వీటిల్లో ఒకేసారిగా కాని లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నందున ఈక్విటీ ఫండ్స్‌లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది పన్ను ప్రయోజనాలను పొందే విధంగా ఇన్వెస్ట్ చేయడానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది కాబట్టి, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఆరు సమాన భాగాలుగా విభజించి ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయమని సూచిస్తున్నారు. కాని ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇలా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ప్రతి నెలా ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని కొత్త పెట్టుబడి కింద భావించి అక్కడ నుంచి వైదొలగడానికి మూడు సంవత్సరాలు వేచి చూడాలి. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం లాభనష్టాలు మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యల్ప కాలపరిమితి ఉన్న అన్ని రకాల ట్యాక్స్ సేవింగ్స్ పత్రాల (ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టల్ సేవింగ్స్, బీమా, పీపీఎఫ్ తదితరాలు)తో పోలిస్తే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ముందు వరుసలో నిలబడతాయి. స్థిరాదాయాన్ని ఇచ్చే బ్యాంకు డిపాజిట్లలో కనీసం ఐదేళ్లు వేచి ఉండాల్సి ఉంటే, బీమా, పీపీఎఫ్ వంటి వాటిల్లో కనీసం 10 నుంచి 15 ఏళ్లు ఆగాల్సి ఉంటుంది. వీటిలో కాకుండా ఈక్విటీ లింక్డ్ టాక్స్ సేవింగ్స్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేసినా, రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పథకాల్లో ఉన్న ప్రధానమైన లోపం ఏమిటంటే రాబడిపై హామీ లేకపోగా నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ నష్టాలు వచ్చినప్పుడు భయపడి వైదొలగకుండా వేచి చూస్తే నష్టాలను భర్తీ చేసుకోవచ్చంటున్నారు మార్కెట్ నిపుణులు. -
షేర్ల కంటే ఫండ్సే ముద్దు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్ నూతన గరిష్ట స్థాయికి చేరడంతో ఇప్పుడిప్పుడే రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడులపై దృష్టిసారిస్తున్నారు. కాని గతంలో లాగా నేరుగా షేర్లను కొనుగోలు చేయడం కాకుండా మ్యూచువల్ ఫండ్ మార్గాన్ని ఎంచుకోవడం విశేషం. అందులోనూ ఒకేసారిగా కాకుండా కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేసే సిస్టమాటిక్ విధానాన్ని (సిప్)ఎంచుకుంటున్నారు. గతేడాది నుంచి మార్కెట్ పెరుగుతున్నా గత రెండు నెలల నుంచే రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని, మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్ ఆంఫీ గణాంకాలు చూస్తే అర్థమవుతోంది. గత రెండు నెలల నుంచి సగటున కొత్తగా రెండు లక్షలకు పైగా సిప్ ఖాతాలు ప్రారంభమవుతున్నాయని, ఇంత పెద్ద మొత్తంలో రిటైల్ ఇన్వెస్టర్లు ముందుకు రావడం ఇదే మొదటిసారని ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.శరత్ శర్మ చెప్పారు. గతంలోలాగా అధిక రిస్క్ ఉండే మిడ్‌క్యాప్, సెక్టోరియల్ ఫండ్స్‌లో కాకుండా డైవర్సిఫైడ్ ఈక్విటీ పథకాల్లోనే ఎక్కువ శాతం ఇన్వెస్ట్ చేస్తుండటం గమనించదగ్గ విషయమన్నారు. ఈ సారి రిటైల్ ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారని, గత బుల్ ర్యాలీలో రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే, తాజా ర్యాలీలో మ్యూచువల్ ఫండ్ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు జెన్‌మనీ జాయింట్ ఎండీ సతీష్ కంతేటి తెలిపారు. స్టాక్ మార్కెట్‌పై చిన్న మదుపరులకు అవగాహన పెరిగిందనడానికి ఇది సంకేతంగా భావించవచ్చన్నారు. గత 3 నెలల్లో నికరంగా రూ.15,000 కోట్లు కేవలం ఈక్విటీ(ఆర్బిట్రైజేషన్ ఫండ్స్ కాకుండా) ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్లు శరత్ శర్మ తెలి పారు. గత 8 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఒక్క ఆగస్టు నెల లోనే అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు కలిసి స్టాక్ మార్కెట్లో రూ.5,847 కోట్ల నికర కొనుగోళ్లు జరపడం విశేషం. పెరుగుతున్న ఎన్‌ఎఫ్‌వోలు.. రిటైల్ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరగడంతో మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాలను ప్రవేశపెట్టడంపై దృష్టిసారిస్తున్నాయి. గడిచిన ఏడు నెలల్లో 33కిపైగా ఈక్విటీ ఫండ్స్ న్యూ ఫండ్ ఆఫర్ ద్వారా రూ.3,580 కోట్ల నిధులను సమీకరించాయి. ఈ మధ్యనే ముగిసిన ఎన్ఎఫ్వోకి వచ్చిన యూటీఐ ఫోకస్డ్ ఫండ్ అంచనాలను మించి రూ. 770 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం రెండు ఈక్విటీ పథకాలు ఎన్‌ఎఫ్‌వోలు నడుస్తుండగా, రానున్న కాలంలో మరిన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టడానికి మ్యూచువల్ ఫండ్ సంస్థలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ట్యాక్స్ ఫండ్ జోరు... గతేడాదితో పోలిస్తే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్(ఈఎల్ఎస్ఎస్) అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదవుతోంది. 2013, జూలై నెలలో ట్యాక్స్ ఫండ్స్ అమ్మకాలు రూ.134 కోట్లుగా ఉంటే ఈ ఏడాది ఈ మొత్తం రూ. 472 కోట్లకు పెరగడం విశేషం. అంటే 252 శాతం మేర వృద్ధి నమోదైంది. స్టాక్ మార్కెట్ జోరుకు తోడు గత బడ్జెట్లో సెక్షన్ 80సీ పరిమితిని లక్ష నుంచి లక్షన్నరకు పెంచడంతో మదుపుదారులు అధిక మొత్తం ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌పై ఇన్వెస్టర్లు అమితాసక్తి చూపిస్తున్నారని, డిసెంబర్ నుంచి ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉందని యూటీఐ ట్యాక్స్ ఫండ్ మేనేజర్ లలిత్ నంబియార్ పేర్కొన్నారు.