షేర్ల కంటే ఫండ్సే ముద్దు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్ నూతన గరిష్ట స్థాయికి చేరడంతో ఇప్పుడిప్పుడే రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడులపై దృష్టిసారిస్తున్నారు. కాని గతంలో లాగా నేరుగా షేర్లను కొనుగోలు చేయడం కాకుండా మ్యూచువల్ ఫండ్ మార్గాన్ని ఎంచుకోవడం విశేషం. అందులోనూ ఒకేసారిగా కాకుండా కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేసే సిస్టమాటిక్ విధానాన్ని (సిప్)ఎంచుకుంటున్నారు.
గతేడాది నుంచి మార్కెట్ పెరుగుతున్నా గత రెండు నెలల నుంచే రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని, మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్ ఆంఫీ గణాంకాలు చూస్తే అర్థమవుతోంది. గత రెండు నెలల నుంచి సగటున కొత్తగా రెండు లక్షలకు పైగా సిప్ ఖాతాలు ప్రారంభమవుతున్నాయని, ఇంత పెద్ద మొత్తంలో రిటైల్ ఇన్వెస్టర్లు ముందుకు రావడం ఇదే మొదటిసారని ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.శరత్ శర్మ చెప్పారు.
గతంలోలాగా అధిక రిస్క్ ఉండే మిడ్‌క్యాప్, సెక్టోరియల్ ఫండ్స్‌లో కాకుండా డైవర్సిఫైడ్ ఈక్విటీ పథకాల్లోనే ఎక్కువ శాతం ఇన్వెస్ట్ చేస్తుండటం గమనించదగ్గ విషయమన్నారు. ఈ సారి రిటైల్ ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారని, గత బుల్ ర్యాలీలో రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే, తాజా ర్యాలీలో మ్యూచువల్ ఫండ్ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు జెన్‌మనీ జాయింట్ ఎండీ సతీష్ కంతేటి తెలిపారు.
స్టాక్ మార్కెట్‌పై చిన్న మదుపరులకు అవగాహన పెరిగిందనడానికి ఇది సంకేతంగా భావించవచ్చన్నారు. గత 3 నెలల్లో నికరంగా రూ.15,000 కోట్లు కేవలం ఈక్విటీ(ఆర్బిట్రైజేషన్ ఫండ్స్ కాకుండా) ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్లు శరత్ శర్మ తెలి పారు. గత 8 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఒక్క ఆగస్టు నెల లోనే అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు కలిసి స్టాక్ మార్కెట్లో రూ.5,847 కోట్ల నికర కొనుగోళ్లు జరపడం విశేషం.
పెరుగుతున్న ఎన్‌ఎఫ్‌వోలు..
రిటైల్ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరగడంతో మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాలను ప్రవేశపెట్టడంపై దృష్టిసారిస్తున్నాయి. గడిచిన ఏడు నెలల్లో 33కిపైగా ఈక్విటీ ఫండ్స్ న్యూ ఫండ్ ఆఫర్ ద్వారా రూ.3,580 కోట్ల నిధులను సమీకరించాయి. ఈ మధ్యనే ముగిసిన ఎన్‌ఎఫ్‌వోకి వచ్చిన యూటీఐ ఫోకస్డ్ ఫండ్ అంచనాలను మించి రూ. 770 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం రెండు ఈక్విటీ పథకాలు ఎన్‌ఎఫ్‌వోలు నడుస్తుండగా, రానున్న కాలంలో మరిన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టడానికి మ్యూచువల్ ఫండ్ సంస్థలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
ట్యాక్స్ ఫండ్ జోరు...
గతేడాదితో పోలిస్తే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్(ఈఎల్‌ఎస్‌ఎస్) అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదవుతోంది. 2013, జూలై నెలలో ట్యాక్స్ ఫండ్స్ అమ్మకాలు రూ.134 కోట్లుగా ఉంటే ఈ ఏడాది ఈ మొత్తం రూ. 472 కోట్లకు పెరగడం విశేషం. అంటే 252 శాతం మేర వృద్ధి నమోదైంది. స్టాక్ మార్కెట్ జోరుకు తోడు గత బడ్జెట్‌లో సెక్షన్ 80సీ పరిమితిని లక్ష నుంచి లక్షన్నరకు పెంచడంతో మదుపుదారులు అధిక మొత్తం ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌పై ఇన్వెస్టర్లు అమితాసక్తి చూపిస్తున్నారని, డిసెంబర్ నుంచి ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉందని యూటీఐ ట్యాక్స్ ఫండ్ మేనేజర్ లలిత్ నంబియార్ పేర్కొన్నారు.