నేటి నుంచి ఎంఓఐఎల్ వాటా విక్రయం
• ఒక్కో షేర్ ఆఫర్ ధర రూ.365
• రిటైల్ ఇన్వెస్టర్లకు 5% డిస్కౌంట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మాంగనీస్ కంపెనీ, ఎంఓఐఎల్‌లో 10 శాతం వాటా(1.33 కోట్ల షేర్లు)ను ప్రభుత్వం నేటి(మంగళవారం) నుంచి రెండు రోజుల పాటు విక్రయించనున్నది. మొదటి రోజు సంస్థాగత ఇన్వెస్టర్లకు, రెండో రోజు(రేపు–బుధవారం–జనవరి 25) రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో షేర్లను విక్రయిస్తారు. రూ. 10 ముఖవిలువగల ఒక్కో షేర్‌కు ఫ్లోర్ ధరను రూ.365గా(సోమవారం ముగింపు ధర రూ.383లో 5% డిస్కౌంట్ ఇది)ప్రభుత్వం నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ ఫ్లోర్‌ధరలో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ వాటా విక్రయం వల్ల ప్రభుత్వానికి రూ.480 కోట్ల నిధులు లభిస్తాయని అంచనా. గతంలో మాంగనీస్ ఓర్ ఇండియాగా వ్యవహరించిన ఎంఓఐఎల్‌లో ప్రభుత్వానికి ప్రస్తుతం 75.58% వాటా ఉంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం ఎంఓఐఎల్ షేర్ల బై బ్యాక్ ద్వారా రూ.794 కోట్లు సమీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటా విక్రయం, షేర్ల బైబ్యాక్, సీపీఎస్‌ఈ ఈటీఎఫ్ ద్వారా రూ.30,000 కోట్లు సమీకరించింది.