Retail Investor
-
షేర్లంటే మాకెంతో ఇష్టం!
♦ రిటైల్ ఇన్వెస్టర్లలో 85 శాతం మంది మొగ్గు ♦ ఆ తర్వాతే మ్యూచువల్ ఫండ్స్ వైపు చూపు ♦ కరెక్షన్ కోసం చూస్తున్న 65 శాతం మంది ♦ డెరివేటివ్స్, డే ట్రేడింగ్‌లో రిస్క్ ఎక్కువ ♦ జియోజిత్ సర్వేలో ఇన్వెస్టర్ల వెల్లడి ముంబై: రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది తొలి చాయిస్ షేర్లే. ఇతర పెట్టుబడి సాధనాల కంటే షేర్లకే వారు తొలి ప్రాధాన్యమిస్తున్నట్లు బ్రోకింగ్ సంస్థ జియోజిత్ సెక్యూరిటీస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మిగులు నగదు ఉన్నప్పుడే తాము స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతుంటామని ఎక్కువమంది స్పష్టం చేశారు. ఇన్వెస్టర్ల అవగాహన కోసం సెబీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఫలితాలివ్వటం మొదలెట్టాయని, దలాల్ స్ట్రీట్‌ను ఇవి చక్కని పనితీరుగల మార్కెట్‌గా మార్చాయని సర్వే ప్రశంసించింది. నిఫ్టీ, సెన్సెక్స్ ఈ ఏడాది 18 శాతానికి పైగా పెరిగిన విషయాన్ని గుర్తు చేసింది. సెన్సెక్స్ ఇటీవల 30,000 మార్కును దాటడంతో కోచికి చెందిన జియోజిత్ సెక్యూరిటీస్ ఆన్లైన్ వేదికగా 3 లక్షల మంది ఇన్వెస్టర్లతో సర్వే నిర్వహించింది. కాగా సర్వేలో పాల్గొన్న వారిలో 62 శాతం మంది తమ మిగులు ఆదాయంలో 20 శాతం వరకు ఈక్విటీలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. నిజానికి దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో నేరుగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాభాలను ఆర్జించినట్టు చూపే గణాంకాలు అందుబాటులో లేవు. ఎందుకంటే వీరు మార్కెట్ల బూమ్‌లో ఉన్నపుడు ప్రవేశించడం, కరెక్షన్కు గురవగానే నష్టాలతో బయటకు వెళ్లిపోవడం జరుగుతుంటుంది. సర్వేలో వెల్లడైన అంశాలివీ... ⇔ నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాం: 83.45 శాతం ⇔ మిగులు నిధులున్నపుడే స్టాక్ మార్కెట్లో పెడతాం: 59.25 శాతం ⇔ నెలనెలా ఇన్వెస్ట్ చేస్తాం: 20 శాతం ⇔ కొంత మొత్తాన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాం: 57.21 శాతం ⇔ నేరుగా ఈక్విటీల్లో పెడితేనే మంచి రాబడులొస్తాయి: 65.5 శాతం ⇔ ఈక్విటీల్లో రిస్కుంటుంది కనక మ్యూచువల్ ఫండ్లే నయం: 24 శాతం ⇔ డెరివేటివ్స్ అంటే అధిక రిస్కుంటుంది. కాబట్టి దాన్లో పెట్టం: 20 శాతం ⇔ కాస్తంత రిస్క్ ఉన్నా డెరివేటివ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాం: 4.76 శాతం ⇔ డే ట్రేడింగ్ అంటే చాలా రిస్కుంటుంది. కాబట్టి మేం దూరంగా ఉంటాం: 62% ⇔ లాభం వెనక నష్టం కూడా ఉంటుంది. అయినా డే ట్రేడింగ్ చేస్తాం: 14.55% ⇔ మార్కెట్లలో కరెక్షన్ వస్తే దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేస్తాం. వేచి చూస్తున్నాం: 65% -
నేటి నుంచి ఎంఓఐఎల్ వాటా విక్రయం
• ఒక్కో షేర్ ఆఫర్ ధర రూ.365 • రిటైల్ ఇన్వెస్టర్లకు 5% డిస్కౌంట్ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మాంగనీస్ కంపెనీ, ఎంఓఐఎల్‌లో 10 శాతం వాటా(1.33 కోట్ల షేర్లు)ను ప్రభుత్వం నేటి(మంగళవారం) నుంచి రెండు రోజుల పాటు విక్రయించనున్నది. మొదటి రోజు సంస్థాగత ఇన్వెస్టర్లకు, రెండో రోజు(రేపు–బుధవారం–జనవరి 25) రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో షేర్లను విక్రయిస్తారు. రూ. 10 ముఖవిలువగల ఒక్కో షేర్‌కు ఫ్లోర్ ధరను రూ.365గా(సోమవారం ముగింపు ధర రూ.383లో 5% డిస్కౌంట్ ఇది)ప్రభుత్వం నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ ఫ్లోర్ధరలో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ వాటా విక్రయం వల్ల ప్రభుత్వానికి రూ.480 కోట్ల నిధులు లభిస్తాయని అంచనా. గతంలో మాంగనీస్ ఓర్ ఇండియాగా వ్యవహరించిన ఎంఓఐఎల్‌లో ప్రభుత్వానికి ప్రస్తుతం 75.58% వాటా ఉంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం ఎంఓఐఎల్ షేర్ల బై బ్యాక్ ద్వారా రూ.794 కోట్లు సమీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటా విక్రయం, షేర్ల బైబ్యాక్, సీపీఎస్ఈ ఈటీఎఫ్ ద్వారా రూ.30,000 కోట్లు సమీకరించింది. -
ఇక రిటైల్ ఇన్వెస్టర్లు ప్రభుత్వ బాండ్లు కొనొచ్చు..
జీ-సెక్యూరిటీస్ మార్కెట్ అందుబాటులోకి ముంబై: గవర్నమెంట్ సెక్యూరిటీస్ (జీ-సెక్యూరిటీస్) మార్కెట్ ఆగస్టు 16 నుంచీ రిటైల్ ఇన్వెస్టర్లకూ అందుబాటులోకి రానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. బ్యాంకులు, ప్రైమరీ డీలర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లకు మాత్రమే ప్రస్తుతం జీ-సెక్యూరిటీస్ మార్కెట్ అందుబాటులో ఉంది. ఆగస్టు 16 నుంచీ ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ డీమ్యాట్ అకౌంట్ హోల్డర్లు తమతమ డిపాజిటరీ పార్టిసిపెంట్ (డీపీ)కి సంబంధించి ఎన్డీఎస్-ఓఎం ప్లాట్‌ఫామ్‌పై ప్రభుత్వ సెక్యూరిటీస్‌ను ట్రేడ్ చేసుకోవచ్చని ఆర్బీఐ ప్రకటన పేర్కొంది. డీమ్యాట్ అకౌంట్ దారుడు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ట్రేడింగ్ చేయడానికి వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సూచించినట్లూ వివరించింది. -
షేర్ల కంటే ఫండ్సే ముద్దు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్ నూతన గరిష్ట స్థాయికి చేరడంతో ఇప్పుడిప్పుడే రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడులపై దృష్టిసారిస్తున్నారు. కాని గతంలో లాగా నేరుగా షేర్లను కొనుగోలు చేయడం కాకుండా మ్యూచువల్ ఫండ్ మార్గాన్ని ఎంచుకోవడం విశేషం. అందులోనూ ఒకేసారిగా కాకుండా కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేసే సిస్టమాటిక్ విధానాన్ని (సిప్)ఎంచుకుంటున్నారు. గతేడాది నుంచి మార్కెట్ పెరుగుతున్నా గత రెండు నెలల నుంచే రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని, మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్ ఆంఫీ గణాంకాలు చూస్తే అర్థమవుతోంది. గత రెండు నెలల నుంచి సగటున కొత్తగా రెండు లక్షలకు పైగా సిప్ ఖాతాలు ప్రారంభమవుతున్నాయని, ఇంత పెద్ద మొత్తంలో రిటైల్ ఇన్వెస్టర్లు ముందుకు రావడం ఇదే మొదటిసారని ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.శరత్ శర్మ చెప్పారు. గతంలోలాగా అధిక రిస్క్ ఉండే మిడ్‌క్యాప్, సెక్టోరియల్ ఫండ్స్‌లో కాకుండా డైవర్సిఫైడ్ ఈక్విటీ పథకాల్లోనే ఎక్కువ శాతం ఇన్వెస్ట్ చేస్తుండటం గమనించదగ్గ విషయమన్నారు. ఈ సారి రిటైల్ ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారని, గత బుల్ ర్యాలీలో రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే, తాజా ర్యాలీలో మ్యూచువల్ ఫండ్ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు జెన్‌మనీ జాయింట్ ఎండీ సతీష్ కంతేటి తెలిపారు. స్టాక్ మార్కెట్‌పై చిన్న మదుపరులకు అవగాహన పెరిగిందనడానికి ఇది సంకేతంగా భావించవచ్చన్నారు. గత 3 నెలల్లో నికరంగా రూ.15,000 కోట్లు కేవలం ఈక్విటీ(ఆర్బిట్రైజేషన్ ఫండ్స్ కాకుండా) ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్లు శరత్ శర్మ తెలి పారు. గత 8 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఒక్క ఆగస్టు నెల లోనే అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు కలిసి స్టాక్ మార్కెట్లో రూ.5,847 కోట్ల నికర కొనుగోళ్లు జరపడం విశేషం. పెరుగుతున్న ఎన్‌ఎఫ్‌వోలు.. రిటైల్ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరగడంతో మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాలను ప్రవేశపెట్టడంపై దృష్టిసారిస్తున్నాయి. గడిచిన ఏడు నెలల్లో 33కిపైగా ఈక్విటీ ఫండ్స్ న్యూ ఫండ్ ఆఫర్ ద్వారా రూ.3,580 కోట్ల నిధులను సమీకరించాయి. ఈ మధ్యనే ముగిసిన ఎన్ఎఫ్వోకి వచ్చిన యూటీఐ ఫోకస్డ్ ఫండ్ అంచనాలను మించి రూ. 770 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం రెండు ఈక్విటీ పథకాలు ఎన్‌ఎఫ్‌వోలు నడుస్తుండగా, రానున్న కాలంలో మరిన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టడానికి మ్యూచువల్ ఫండ్ సంస్థలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ట్యాక్స్ ఫండ్ జోరు... గతేడాదితో పోలిస్తే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్(ఈఎల్ఎస్ఎస్) అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదవుతోంది. 2013, జూలై నెలలో ట్యాక్స్ ఫండ్స్ అమ్మకాలు రూ.134 కోట్లుగా ఉంటే ఈ ఏడాది ఈ మొత్తం రూ. 472 కోట్లకు పెరగడం విశేషం. అంటే 252 శాతం మేర వృద్ధి నమోదైంది. స్టాక్ మార్కెట్ జోరుకు తోడు గత బడ్జెట్లో సెక్షన్ 80సీ పరిమితిని లక్ష నుంచి లక్షన్నరకు పెంచడంతో మదుపుదారులు అధిక మొత్తం ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌పై ఇన్వెస్టర్లు అమితాసక్తి చూపిస్తున్నారని, డిసెంబర్ నుంచి ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉందని యూటీఐ ట్యాక్స్ ఫండ్ మేనేజర్ లలిత్ నంబియార్ పేర్కొన్నారు.