MOIL
-
ఎంఓఐఎల్ వాటా విక్రయం... హిట్
కేంద్ర ఖజానాకు రూ.480 కోట్లు న్యూఢిల్లీ: ఎంఓఐఎల్ వాటా విక్రయానికి రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో రిటైల్ ఇన్వెస్టర్లకు 26.63 లక్షల షేర్లు కేటాయించగా, 1.42 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. వీరికి కేటాయించిన వాటా 5.3 రెట్లు సబ్‌స్క్రైబయ్యింది. వాటా విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.480 కోట్లు లభిస్తాయి. ఎంఓఐఎల్‌లో 10 శాతం వాటా(1.33 కోట్ల షేర్ల)ను రూ.365 ఫ్లోర్ ధరకు ప్రభుత్వం ఆఫర్ చేసింది. మంగళవారం సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 1.51 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయ్యింది. ఇతర కంపెనీల ఆఫర్ ఫర్‌సేల్‌తో పోల్చితే ఎంఓఐఎల్కు మంచి స్పందన లభించిందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వాటా విక్రయం నేపథ్యంలో బీఎస్ఈలో ఎంఓఐఎల్ షేర్ 1 శాతం లాభపడి రూ.372 వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం ఎంఓఐఎల్ షేర్ల బైబ్యాక్ ద్వారా రూ.794 కోట్లు సమీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓఎఫ్ఎస్ విధానంలో వాటా విక్రయంచిన నాలుగో సంస్థ ఎంఓఐఎల్. ఇంతకు ముందు ఎన్బీసీసీ, హిందుస్తాన్ కాపర్, ఎన్‌హెచ్‌పీసీల్లో వాటాలను విక్రయించింది. -
నేటి నుంచి ఎంఓఐఎల్ వాటా విక్రయం
• ఒక్కో షేర్ ఆఫర్ ధర రూ.365 • రిటైల్ ఇన్వెస్టర్లకు 5% డిస్కౌంట్ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మాంగనీస్ కంపెనీ, ఎంఓఐఎల్‌లో 10 శాతం వాటా(1.33 కోట్ల షేర్లు)ను ప్రభుత్వం నేటి(మంగళవారం) నుంచి రెండు రోజుల పాటు విక్రయించనున్నది. మొదటి రోజు సంస్థాగత ఇన్వెస్టర్లకు, రెండో రోజు(రేపు–బుధవారం–జనవరి 25) రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో షేర్లను విక్రయిస్తారు. రూ. 10 ముఖవిలువగల ఒక్కో షేర్‌కు ఫ్లోర్ ధరను రూ.365గా(సోమవారం ముగింపు ధర రూ.383లో 5% డిస్కౌంట్ ఇది)ప్రభుత్వం నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ ఫ్లోర్ధరలో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ వాటా విక్రయం వల్ల ప్రభుత్వానికి రూ.480 కోట్ల నిధులు లభిస్తాయని అంచనా. గతంలో మాంగనీస్ ఓర్ ఇండియాగా వ్యవహరించిన ఎంఓఐఎల్‌లో ప్రభుత్వానికి ప్రస్తుతం 75.58% వాటా ఉంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం ఎంఓఐఎల్ షేర్ల బై బ్యాక్ ద్వారా రూ.794 కోట్లు సమీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటా విక్రయం, షేర్ల బైబ్యాక్, సీపీఎస్ఈ ఈటీఎఫ్ ద్వారా రూ.30,000 కోట్లు సమీకరించింది. -
ఎన్ఎండీసీ, ఎంఓఐఎల్ షేర్ల బై బ్యాక్
త్వరలో నోటిఫికేషన్ విలువ రూ.10,000 కోట్లు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మైనింగ్ దిగ్గజ కంపెనీలు ఎన్ఎండీసీ, ఎంఓఐఎల్‌లు 25 శాతం వాటా షేర్లను బై బ్యాక్ చేయనున్నాయి. ఈ రెండు సంస్థలు కలసి రూ.10,000 కోట్ల విలువైన షేర్లను బై బ్యాక్ చేస్తాయని అంచనాలున్నాయి. ఈ రెండు కంపెనీల్లో ప్రభుత్వ వాటా 80 శాతంగా ఉండటంతో ఈ బై బ్యాక్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.6,500 కోట్లు సమకూరుతాయని అంచనా. ఎన్ఎండీసీ, ఎంఓఐఎల్ కంపెనీలు ఆయా కంపెనీల పెయిడప్ క్యాపిటల్(చెల్లించిన మూలధనం)లో 25 శాతం షేర్లను బై బ్యాక్ చేస్తాయని, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదలవుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.56,500 కోట్లు సమీకరించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్(దీపం-గతంలో డిజిన్వెస్ట్మెంట విభాగం) లక్ష్యంగా పెట్టుకుంది. కాగా బై బ్యాక్ వార్తల నేపథ్యంలో ఎన్ఎండీసీ షేర్ 1.6 శాతం లాభపడి రూ.92 వద్ద, ఎంఓఐఎల్ షేర్ 1.4 శాతం లాభపడి రూ.243 వద్ద ముగిశాయి.