ఎన్ఎండీసీ, ఎంఓఐఎల్ షేర్ల బై బ్యాక్
త్వరలో నోటిఫికేషన్ విలువ రూ.10,000 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మైనింగ్ దిగ్గజ కంపెనీలు ఎన్‌ఎండీసీ, ఎంఓఐఎల్‌లు 25 శాతం వాటా షేర్లను బై బ్యాక్ చేయనున్నాయి. ఈ రెండు సంస్థలు కలసి రూ.10,000 కోట్ల విలువైన షేర్లను బై బ్యాక్ చేస్తాయని అంచనాలున్నాయి. ఈ రెండు కంపెనీల్లో ప్రభుత్వ వాటా 80 శాతంగా ఉండటంతో ఈ బై బ్యాక్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.6,500 కోట్లు సమకూరుతాయని అంచనా. ఎన్‌ఎండీసీ, ఎంఓఐఎల్ కంపెనీలు ఆయా కంపెనీల పెయిడప్ క్యాపిటల్(చెల్లించిన మూలధనం)లో 25 శాతం షేర్లను బై బ్యాక్ చేస్తాయని, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదలవుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.56,500 కోట్లు సమీకరించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్(దీపం-గతంలో డిజిన్వెస్ట్‌మెంట విభాగం) లక్ష్యంగా పెట్టుకుంది. కాగా బై బ్యాక్ వార్తల నేపథ్యంలో ఎన్‌ఎండీసీ షేర్ 1.6 శాతం లాభపడి రూ.92 వద్ద, ఎంఓఐఎల్ షేర్ 1.4 శాతం లాభపడి రూ.243 వద్ద ముగిశాయి.