ఒడిదుడుకుల వారం..
డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు ప్రభావం
వచ్చే నెల 5న ఆర్‌బీఐ పాలసీ సమీక్ష
రేట్ల కోతపై అంచనాలు
న్యూఢిల్లీ: మార్చి డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు వారమైనందున ఈ వారం స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు తప్పవని నిపుణులంటున్నారు. హోలి, గుడ్ ప్రైడే కారణంగా గత వారంలో గురు, శుక్రవారాలు స్టాక్ మార్కెట్‌కు సెలవు. ఈ దీర్ఘకాల సెలవుల అనంతరం ప్రారంభం కానున్న ఈ వారం స్టాక్ మార్కెట్‌పై అంతర్జాతీయ సంకేతాలు, ముడి చమురు ధరల గమనం, రూపాయి కదలికలు తదితర అంశాలు కూడా ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. ఈ నెల విక్రయాల గణాంకాలను ఈ శుక్రవారం(ఏప్రిల్ 1న) వాహన కంపెనీలు వెల్లడించనున్నందున ఆ కంపెనీ షేర్లు వెలుగులోకి రావచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి వారం కూడా ఇదే. మరోవైపు మార్చి డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ వారంలో గురువారం నాడు(మార్చి 31న) ముగియనున్నందున ట్రేడర్లు తమ పొజిషన్లను రోల్ ఓవర్ చేయనున్న నేపధ్యంలో స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు గురవుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు.
రేట్ల కోత కీలకం..
వచ్చే నెల 5న జరగనున్న ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష.. సమీప కాలంలో స్టాక్ మార్కెట్‌కు కీలకం కానున్నదని సింఘానియా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్‌ల పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు... స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. ఆర్‌బీఐ ద్రవ్య సమీక్షపైననే తర్వాతి దశ స్టాక్ మార్కెట్ ర్యాలీ ఆధారపడి ఉందని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్)వినోద్ నాయర్ చెప్పారు. ఈ సమీక్షలో సానుకూల నిర్ణయం వెలువడితే స్టాక్ మార్కెట్ మరింత దూసుకుపోతుందని పేర్కొన్నారు.
పరిమితశ్రేణిలో ట్రేడింగ్..
ఈ వారంలో స్టాక్ మార్కెట్ పరిమితశ్రేణిలో ట్రేడవుతుందని జైఫిన్ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర నేవ్‌గి చెప్పారు. వచ్చే నెల రెండో వారం నుంచి ప్రారంభమయ్యే కంపెనీల ఆర్థిక ఫలితాల కోసం మార్కెట్ ఆసక్తిగా ఎదురు చూస్తోందని వివరించారు. చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీరేట్లను తగ్గించినందున ఆర్‌బీఐ కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందన్న అంచనాలు సర్వత్రా నెలకొన్నాయని పేర్కొన్నారు. సుదీర్ఘ సెలవుల అనంతరం మార్కెట్ ప్రారంభమవుతోందని, తాజాగా పొజిషన్లు తీసుకోవడం ద్వారా ట్రేడర్లు.. స్టాక్ మార్కెట్ పెరిగితే లాభపడతారని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (మిడ్‌క్యాప్స్ రీసెర్చ్) రవి షెనాయ్ చెప్పారు. డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా మార్కెట్ మరింత బలహీనపడవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్(రీసెర్చ్) వైభవ్ అగర్వాల్ చెప్పారు. ఆర్‌బీఐ రేట్ల కోత, కంపెనీల ఆర్థిక ఫలితాలపై అంచనాలు మార్కెట్ పెరగడానికి దోహద పడవచ్చని పేర్కొన్నారు. ఒడిదుడుకులున్నప్పటికీ, స్టాక్ సూచీలు తమ జోరును కొనసాగిస్తాయని యెస్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ నిటాషా శంకర్ చెప్పారు. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచే అవకాశాలున్నాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(టెక్నికల్ రీసెర్చ్) ఆనంద్ జేమ్స్ చెప్పారు. ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై తీవ్రంగానే ఉంటుందని వివరించారు. భారత్‌తో సహా అన్ని వర్ధమాన దేశాలకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు కీలకం కానున్నదని వివరించారు. మూడు రోజులే ట్రేడింగ్ జరిగిన గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 385 పాయింట్లు (1.54 శాతం)లాభపడి 25,338 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 112 పాయింట్లు(1.47 శాతం) లాభపడి 7,717 పాయింట్ల వద్ద ముగిశాయి.
విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు
విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు క్యాపిటల్ మార్కెట్లో రూ.16,500 కోట్లు (250 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టారు. ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. డిపాజిటరీల గణాంకాల ప్రకారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)ఈ నెల 23 వరకూ ఈక్విటీ మార్కెట్లో రూ.15,660 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.816 కోట్లు పెట్టుబడుటు పెట్టారు. అంతకు ముందటి నాలుగు నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.41,661 కోట్ల పెట్టుబడులు స్టాక్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు.