
విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి కూడా కీలకమే...
ఇన్వెస్టర్ల బలహీన సెంటిమెంట్ కొనసాగవచ్చు...
తీవ్ర ఒడిదుడుకులకు ఆస్కారం...
ఈ వారం మార్కెట్ గమనంపై నిపుణుల అభిప్రాయం
న్యూఢిల్లీ: భారీ పతన బాటలో కొనసాగుతున్న దేశీ మార్కెట్లలో ఒడిదుడుకులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల మోతకు తోడు కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాల పరంపర... ఇన్వెస్టర్లలో బలహీన సెంటి‘మంట’కు ఆజ్యం పోస్తోంది. ఈ వారంలో కూడా యూఎస్ టారిఫ్ సంబంధిత పరిణామాలు, ప్రపంచ మార్కెట్ల ట్రెండ్, ఎఫ్‌పీఐల ట్రేడింగ్ కార్యకలాపాలే మార్కెట్ల గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు.
బలహీనంగానే...
‘ట్రంప్ టారిఫ్ పాలసీతో పాటు గత వారంలో విడుదలైన నిరుద్యోగ గణాంకాలు (అయిదు నెలల గరిష్టం) మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయి. సమీప కాలంలో మార్కెట్లో బలహీన ధోరణి కొనసాగవచ్చు. ప్రపంచ వాణిజ్య విధానాల్లో అస్థిరతలు సద్దుమణిగి, వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీల లాభాల్లో రికవరీ కనిపిస్తేనే మార్కెట్ మళ్లీ గాడిలో పడతాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా బలహీన సెంటిమెంట్‌కు తోడు దేశీయంగా కీలక అంశాలు (ట్రిగ్గర్లు) ఏవీ లేనందున మన మార్కెట్లలో నష్టాలు కొనసాగే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ (వెల్త్ మేనేజ్‌మెంట్) సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. వాణిజ్య యుద్ధ భయాలతో మార్కెట్లు వణుకుతున్నాయని, ఎఫ్‌పీల అమ్మకాల జోరు దీనికి మరింత ఆజ్యం పోస్తోందని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు.
గణాంకాల ఎఫెక్ట్...
గత వారాంతంలో విడుదలైన జీడీపీ గణాంకాల ప్రభావం సోమవారం మార్కెట్‌పై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3)లో జీడీపీ వృద్ధి రేటు 6.2 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. గతేడాది క్యూ3తో పోలిస్తే భారీగా తగ్గినప్పటికీ.. క్యూ2తో పోలిస్తే (5.6 శాతం) సీక్వెన్షియల్‌గా కాస్త పుంజుకోవడం విశేషం.
అమెరికా టారిఫ్ వార్ ఆందోళనల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఫిబ్రవరి జీఎస్‌టీ వసూళ్లు 9.1 శాతం ఎగబాకి రూ.1.84 లక్షల కోట్లకు చేరడం ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశలు రేకెత్తిస్తోంది. ఈ వారంలో విడుదల కానున్న హెచ్‌ఎస్‌బీసీ తయారీ, సేవల రంగ పీఎంఐ డేటాపై కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు.
ఫిబ్ర‘వర్రీ’...
గత కొన్ని నెలలుగా నేల చూపులు చూస్తున్న మన మార్కెట్లకు ఫిబ్రవరిలో మరింత షాక్ తగిలింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 1,384 పాయింట్లు (5.88 శాతం) పతనం కాగా, బీఎస్‌ఈ సెన్సెక్స్ 4,302 (5.55%) పాయింట్లు కోల్పోయింది. సెపె్టంబర్ 27న సెన్సెక్స్ రికార్డ్ గరిష్టాన్ని (85,978) తాకి, అక్కడి నుంచి రివర్స్ గేర్‌లోనే వెళ్తోంది. ఇప్పటిదాకా 12,780 పాయింట్లు (14.86 శాతం) కుప్పకూలింది. ఇక నిఫ్టీ కూడా అప్పటి గరిష్టం (26,277) నుంచి 4,153 పాయింట్లు (15.8 శాతం) దిగజారింది. కాగా, ఒక్క గత వారంలోనే సెన్సెక్స్ 2.8 శాతం, నిఫ్టీ 2.94 శాతం క్షీణించడం గమనార్హం.
రూ. 34,574 కోట్లు వెనక్కి...
విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనం మరింత జోరందుకుంది. ఫిబ్రవరి నెలలో దేశీ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు రూ.34,574 కోట్లు వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది తొలి రెండు నెలల్లో మొత్తం అమ్మకాలు రూ.1.12 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రధానంగా ట్రేడ్ వార్ ఆందోళనలతో పాటు కంపెనీల లాభాలపై ఆందోళనలు దీనికి కారణంగా నిలుస్తున్నాయి. ‘భారత్ మార్కెట్లో ఈక్విటీ వేల్యుయేషన్లు చాలా అధికంగా ఉండటం, కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలపై ఆందోళనల ప్రభావంతో ఎఫ్‌పీఐల తిరోగమనం కొనసాగుతోంది’ అని వాటర్‌ఫీల్డ్ అడ్వయిజర్స్ సీనియర్ డైరెక్టర్ విపుల్ భోవర్ పేర్కొన్నారు.
టాప్–10 కంపెనీల్లో రూ.3 లక్షల కోట్లు హుష్
గత వారంలో ప్రధాన సూచీలు దాదాపు 3 శాతం కుప్పకూలడంతో దేశీ స్టాక్ మార్కెట్లో టాప్–10 కంపెనీల మార్కెట్ విలువ రూ.3,09,245 కోట్లు ఆవిరైంది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ అత్యధికంగా రూ.1,09,211 కోట్లు క్షీణించి రూ.12,60,505 కోట్లకు పడిపోయింది. దీంతో టాప్–10లో 2వ స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రెండో ర్యాంకును అందుకుంది. దీని మార్కెట్ క్యాప్ రూ.30,258 కోట్లు జంప్ చేసి, 13,24,411 కోట్లకు ఎగబాకింది. ఇక ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.52,697 కోట్లు తగ్గి, రూ.7,01,002 కోట్లకు చేరింది. భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ కూడా 39,230 కోట్లు నష్టపోయి రూ.8,94,993 కోట్లకు దిగొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment