10 వారాల కనిష్ట స్థాయి
ఆరో రోజూ నష్టాలే 50 పాయింట్ల నష్టంతో 28,112కు సెన్సెక్స్
12 పాయింట్ల నష్టంతో 8,531కు నిఫ్టీ
మార్కెట్ అప్‌డేట్
డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు మరో ఒక్క రోజు ఉన్న నేపథ్యంలో బుధవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసింది. క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, లోహ షేర్లకు నష్టాలు విస్తరించడంతో వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ స్టాక్ మార్కెట్ సూచీలు క్షీణపధంలోనే సాగాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. మొత్తం మీద బీఎస్‌ఈ సెన్సెక్స్ 50 పాయింట్లు నష్టపోయి 28,112 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది పదివారాల కనిష్ట స్థాయి.
తీవ్రమైన ఒడిదుడుకులు
రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తుండటంతో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లూ నష్టాల్లోనే ముగిశాయి. మార్చి కాంట్రాక్టులు గురువారంతో ముగుస్తుండటంతో ట్రేడర్లు త పొజిషన్లను ఏప్రిల్ సిరీస్‌కు క్యారీ ఫార్వార్డ్ చేస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ మందకొడిగా సాగిందని నిపుణులంటున్నారు. లాభాల్లోనే ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ 28,250-28,031 గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 50 పాయింట్ల నష్టంతో 28,112 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 625 పాయింట్లు(2.17 శాతం) నష్టపోయింది. ఇక నిఫ్టీ బుధవారం నాటి ట్రేడింగ్‌లో 12 పాయింట్లు నష్టపోయి 8,531 పాయింట్ల వద్ద ముగిసింది.
12.5 శాతం తగ్గిన ఇప్కా ల్యాబ్స్
విలీన ప్రక్రియ పూర్తికావడంతో సన్ ఫార్మా 1.3 శాతం, ర్యాన్‌బాక్సీ 1.6 శాతం చొప్పున లాభపడ్డాయి. ప్రతి 10 ర్యాన్‌బాక్సీ షేర్లకు 8 సన్ ఫార్మా షేర్లు లభిస్తాయి. త్వరలో ర్యాన్‌బాక్సీని స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ చేయనున్నారు. పీతంపూర్, సిల్వెసా ప్లాంట్లకు అమెరికా ఎఫ్‌డీఏ ఇంపోర్ట్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్కా ల్యాబ్స్ షేర్ 12.5 శాతం తగ్గింది. మౌలిక, లోహ, మైనింగ్, ఆయిల్, గ్యాస్ రంగాల్లోని భారత కంపెనీలు భారీ రుణ ఊబిలోకి కూరుకుపోయాయని స్టాండర్డ్ అండ్ పూర్స్ రేటింగ్స్ సర్వీసెస్ వెల్లడించడంతో ఈ రంగాల్లోని షేర్లు డీలా పడ్డాయి.
టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.4,406 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈలో రూ.16,401 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.3,57,911 కోట్లుగా నమోదైంది.
మోసాల వివరాలు వెల్లడించాలి: సెబీ
లిస్టెడ్ కంపెనీల్లో మోసాలు, ఆర్థిక అవకతవకలు, వాటి వెల్లడి గురించిన నియమని బంధనలను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కఠినతరం చేసింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలు లక్ష్యంగా ఈ చర్య తీసుకుంది. డిస్‌క్లోజర్ నిబంధనలను మరింత పటిష్టం చేసే చర్యల్లో భాగంగా సెబీ ఈ కొత్త నిబంధనలను రూపొందించింది. కొత్త నిబంధనల ప్రకారం, ఏదైనా కంపెనీలో మోసం జరిగిందని వెల్లడైనప్పుడు, ఏదైనా ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వచ్చినప్పుడు, కీలకమైన వ్యక్తులు అరెస్టయినప్పుడు. ఆ వివరాలను, వాటికి గల కారణాలను, వాటి ప్రభావాన్ని కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు తెలపాల్సి ఉంటుంది.