మార్కెట్‌ను మించిన ట్యాక్స్ ఫండ్స్ | Market beyond the tax funds | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ను మించిన ట్యాక్స్ ఫండ్స్

Published Sun, Sep 14 2014 12:49 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

మార్కెట్‌ను మించిన ట్యాక్స్ ఫండ్స్ - Sakshi

మార్కెట్‌ను మించిన ట్యాక్స్ ఫండ్స్

గతేడాది కాలంగా స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. ఇదే సమయంలో ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ప్రధాన సూచీలను మించి లాభాలను అందిస్తున్నాయి. గతేడాది కాలంలో నిఫ్టీ 39% లాభాలను అందిస్తే ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ 69% నుంచి గరిష్టంగా 110% వరకు లాభాలను అందించాయి.

ఈ గణాంకాలకు తోడు గత బడ్జెట్‌లో ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పొందే పన్ను లాభాల పరిమితిని లక్ష రూపాయల నుంచి రూ.1.5 లక్షలకు పెంచడంతో ఈ పథకాల్లో మదుపు చేయడానికి ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారు. ఇతర ట్యాక్స్ సేవింగ్ పథకాలతో పోలిస్తే పలు ప్రయోజనాలు ఉండటం కూడా ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి కారణంగా చెప్పుకోవచ్చు. బహుళ ప్రయోజనాలు కలిగిన ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌లో ఉండే లాభనష్టాలను ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..

 
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే లాభనష్టాలను అందిస్తుండటంతో వీటిని ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ఈఎల్‌ఎస్‌ఎస్) లేదా ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అని పిలుస్తారు. ఇవి ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ప్రధానంగా లార్జ్, మిడ్‌క్యాప్ షేర్లలో పెట్టుబడి చేయడం ద్వారా వీటిపై వచ్చే లాభనష్టాలను ఇన్వెస్టర్లకు అందిస్తాయి. ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మూడు సంవత్సరాల వరకు వైదొలిగే అవకాశం లేకపోవడంతో దీర్ఘకాలంలో మంచి లాభాలను అందించే అవకాశం ఉన్న షేర్లను ఎంపిక చేసుకొని ఇన్వెస్ట్ చేసే సౌలభ్యం ఫండ్ మేనేజర్లకు లభిస్తుంది. ఈ కారణంగానే ఇండెక్స్‌లు కంటే ఎక్కువ లాభాలను ఈ స్కీమ్స్ అందించగలిగాయి.
 
ఫండ్ మేనేజర్లు లార్జ్‌క్యాప్స్‌తో పాటు మిడ్‌క్యాప్ షేర్లలో కూడా ఇన్వెస్ట్ చేయడం ఈ లాభాలకు ప్రధాన కారణం. అయితే ఈ ఏడాది ఇంత లాభాలు వచ్చాయి కాబట్టి వచ్చే ఏడాది కూడా ఇదే విధమైన లాభాలు వస్తాయన్న హామీ ఏమీ ఉండదు. వీటి రాబడులు పూర్తిగా స్టాక్ మార్కెట్ కదలికలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి కచ్చితమైన రాబడిని ఆశించలేం. లాభనష్టాలు రెండింటికీ ఆస్కారం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఉండే సహజసిద్ధమైన ఒడిదుడుకులను తట్టుకొని నిల బడితే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి లాభాలను పొందవచ్చని దీర్ఘకాలంగా వీటి పనితీరు వెల్లడిస్తున్నది.
 
అంతే ఒకేసారి వద్దు
ఇప్పుడు దాదాపు అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు ట్యాక్స్ సేవింగ్ స్కీంలను అందిస్తున్నాయి. వీటిని నేరుగా ఆయా ఫండ్ హౌస్‌లకు దరఖాస్తుచేయడం  లేదా మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ల ద్వారా కాని ఇన్వెస్ట్ చేయవచ్చు. నేరుగా ఇన్వెస్ట్ చేస్తే ఏజెంట్ కమీషన్లు ఉండవు కాబట్టి మరికొంత అదనపు రాబడిని పొందవచ్చు. నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికోసం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ సంస్థలు డెరైక్ట్ ప్లాన్ పేరుతో ప్రత్యేకంగా ఎన్‌ఏవీని అందిస్తున్నాయి.  వీటిల్లో ఒకేసారిగా కాని లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ విధానంలో ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్ చేయొచ్చు.
 
ప్రస్తుతం స్టాక్ మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నందున ఈక్విటీ ఫండ్స్‌లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది పన్ను ప్రయోజనాలను పొందే విధంగా ఇన్వెస్ట్ చేయడానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది కాబట్టి, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఆరు సమాన భాగాలుగా విభజించి ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయమని సూచిస్తున్నారు. కాని ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇలా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ప్రతి నెలా ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని కొత్త పెట్టుబడి కింద భావించి అక్కడ నుంచి వైదొలగడానికి మూడు సంవత్సరాలు వేచి చూడాలి.
 - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం
 
లాభనష్టాలు
మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యల్ప కాలపరిమితి ఉన్న అన్ని రకాల ట్యాక్స్ సేవింగ్స్ పత్రాల (ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టల్ సేవింగ్స్, బీమా, పీపీఎఫ్ తదితరాలు)తో పోలిస్తే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ముందు వరుసలో నిలబడతాయి. స్థిరాదాయాన్ని ఇచ్చే బ్యాంకు డిపాజిట్లలో కనీసం ఐదేళ్లు వేచి ఉండాల్సి ఉంటే, బీమా, పీపీఎఫ్ వంటి వాటిల్లో కనీసం 10 నుంచి 15 ఏళ్లు ఆగాల్సి ఉంటుంది. వీటిలో కాకుండా ఈక్విటీ లింక్డ్ టాక్స్ సేవింగ్స్ స్కీమ్స్‌లో  ఇన్వెస్ట్ చేసినా, రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పథకాల్లో ఉన్న ప్రధానమైన లోపం ఏమిటంటే రాబడిపై హామీ లేకపోగా నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ నష్టాలు వచ్చినప్పుడు భయపడి వైదొలగకుండా వేచి చూస్తే నష్టాలను భర్తీ చేసుకోవచ్చంటున్నారు మార్కెట్ నిపుణులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement