Investment decisions
-
పెట్టుబడులు ఆలస్యం అయితే ఏంటి మార్గం?
పెట్టుబడులు, రిస్క్ మేనేజ్మెంట్, మార్కెట్ అస్థిరతలు, జాగ్రత్తలపై నిపుణులు, వాల్యూ రీసెర్చ్ సీఈవో ధీరేంద్ర కుమార్ సలహాలు ఎవరైనా ఒకరు ఆలస్యంగా 35 ఏళ్ల వయసులో పెట్టుబడులు ప్రారంభిస్తే.. అప్పటి వరకు నష్టపోయిన సమయాన్ని భర్తీ చేసేది ఎలా? నేను 55 ఏళ్లకే రిటైర్ అవుదామని అనుకుంటున్నాను. ఆ సమయానికి నిధిని సిద్ధం చేసుకోవడం ఎలా? – సురేష్ మరీ అంత ఆలస్యం ఏమీ కాలేదు. మీ రిటైర్మెంట్కు ఇంకా 20 ఏళ్ల వ్యవధి మిగిలి ఉంది. 55 లేదా 60 ఏళ్లకు రిటైర్ అవుదామని అనుకుంటే పెట్టుబడులకు 20–25 ఏళ్ల వ్యవధి ఉంటుంది. ఈక్విటీలో పెట్టుబడులు మంచి ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఈ సమయం సరిపోతుంది. అంతేకాదు, మీరు అనుకున్న 55 ఏళ్లకు రిటైర్ అయినా.. ఈక్విటీ పెట్టుబడులకు రిటైర్మెంట్ లేదని గుర్తు పెట్టుకోవాలి. ఈక్విటీల్లో పెట్టుబడుల మొత్తం తీసుకెళ్లి డెట్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన విధానం కాదు. ఈక్విటీల్లో పెట్టుబడులు కొంత భాగం అలానే కొనసాగించాలి. అప్పటి వరకు సమకూర్చుకున్న ఈక్విటీ పోర్ట్‌ఫోలియో నుంచి మీకు సగటు రాబడి వచ్చినా విశ్రాంత జీవనాన్ని సాఫీగా సాగించొచ్చు. కనుక వెంటనే ఈక్విటీల్లో పెట్టుబడులు ప్రారంభించండి. ఒకటి రెండు మంచి ఫ్లెక్సీక్యాప్ (ఫోకస్డ్) ఫండ్స్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పెట్టుబడులను క్రమంగా (ఏటా) పెంచుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మ్యాజిక్ సాధ్యపడుతుందన్నది ఇన్వెస్టర్లు నమ్మే అంశం. అది జరగాలంటే మరింత పెట్టుబడి పెట్టాలన్నది గుర్తుంచుకోవాలి. తగినంత ఇన్వెస్ట్ చేయనప్పుడు మీ అవసరాలకు సరిపడా నిధిగా అది ఎలా మారుతుంది? కనుక ఇప్పటి నుంచి వీలైనంత మేర దూకుడుగా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్లడమే మార్గం. మార్కెట్లు తీవ్ర అస్థిరతలు ఎదుర్కొంటున్నాయి.. ఈ పరిస్థితులను ఇన్వెస్టర్లు అధిగమించడం ఎలా? – శ్రవణ్ మార్కెట్లలో ఇప్పుడు అస్థితరలు ఎదుర్కొంటున్నది నిజం. ఇప్పుడనే కాదు గతంలోనూ అస్థిరతలను చూశాం. భవిష్యత్తులో ఈ ఆటుపోట్లు మరింత ఎక్కువగా ఉండొచ్చు. ఈక్విటీలంటేనే అంతర్గతంగా ఆటుపోట్లతో ఉంటాయి. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. కాకపోతే ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోడం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టాలి. ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యలకు రక్షణ కల్పించుకోవాలి. అత్యవసర సందర్భాల్లో మార్కెట్లలో చేసిన పెట్టుబడులపై ఆధారపడకుండా అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడులు కనీసం ఐదు నుంచి ఏడేళ్ల కాలం వరకు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ విధమైన చర్యలు అమలు చేయాలి. అలాగే, క్రమం తప్పకుండా మార్కెట్లలో సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల పరిస్థితుల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో దిద్దుబాట్లు నిజంగా సంతోషాన్నివ్వాలి. ఎందుకంటే ప్రతికూల సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను సమకూర్చుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, మీడియాలో వచ్చే నానా రకాల సమాచారం ఇన్వెస్టర్లను నిరాశకు, అయోమయానికి, భయానికి గురి చేస్తుంది. దాంతో వారు ప్రతికూల సమయాల్లో పెట్టుబడులు చేయడానికి వెనుకాడుతుంటారు. ఇదే అతిపెద్ద తప్పు. ఆ సమయంలో తప్పకుండా సిప్‌ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోడానికి వీలుంటుంది. -
పెట్టుబడి నిర్ణయాల్లో మహిళల పాత్ర పరిమితమే
న్యూఢిల్లీ: పురుషులతో సమానంగా తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటున్న వనితలు... స్వతంత్ర పెట్టుబడి నిర్ణయాల విషయంలో మాత్రం కాస్త దూరంగానే ఉంటున్నారు. 64 శాతం మంది మగవారు పెట్టుబడులపై నిర్ణయాలు సొంతంగా తీసుకుంటుంటే, మహిళలు మాత్రం 33 శాతం మందే స్వీయ నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. డీఎస్పీ విన్వెస్టర్ పల్స్ 2019 సర్వే ద్వారా ఈ విషయాలు తెలిశాయి. ‘‘పెట్టుబడి విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్లుగా మహిళలను పెద్ద ఎత్తున విస్తరిస్తున్నారు. పారిశ్రామిక పనివారిలో ఎక్కువ భాగం మహిళలే ఉన్నా, సీనియర్ స్థాయి నిపుణులు, ఫండ్ మేనేజర్లలోనూ మహిళలు ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఉంది’’ అని డీఎస్పీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ప్రెసిడెంట్ కల్పేన్ పారిక్ తెలిపారు. ఇక స్వీయ పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే 33 శాతం మంది మగువల వెనుక వారి జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రుల ప్రోత్సాహం ప్రధానంగా ఉన్నట్టు ఈ సర్వే పేర్కొంది. తమ భర్తలు మరణించడం లేదా విడాకుల వల్ల తాము సొంతంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని 13 శాతం మంది మహిళలు చెప్పడం గమనార్హం. 30 శాతం మంతి తాము సొంతంగా పెట్టుబడికి సంబంధించి నిర్ణయాలు తీసుకోగలమని చెప్పారు. ఇకతమ పిల్ల విద్య, సొంతిల్లు, పిల్లల వివాహాలు, అప్పుల్లేని జీవితం, ఉన్నత ప్రమాణాలతో జీవించడం అనే ముఖ్యమైన లక్ష్యాల విషయంలో స్త్రీ, పురుషులు సరిసమానంగానే ఉన్నట్టు డీఎస్పీ సర్వే తెలిపింది. ఇన్వెస్ట్మెంట్ లేదా కారు లేదా ఇల్లు కొనుగోళ్ల నిర్ణయాల్లో పురుషుల ఆధిపత్యం ఉంటుంటే, బంగారం/ఆభరణాలు, రోజువారీ ఇంటి ఖర్చులు విషయంలో మహిళల పాత్ర కీలకంగా ఉంది. దేశవ్యాప్తంగా 8 పట్టణాల్లో 4,013 మంది మహిళల నుంచి అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. -
ఆఖరి నిముషంలో ఈ తప్పులొద్దు
పన్ను ఆదా కోసం... పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఎన్ఎస్సీ, పన్ను ఆదా ఎఫ్డీలు, యులిప్‌లు, ఈఎల్ఎస్ఎస్లు... వీటిల్లో ఏది అన్న ఎంపిక అంత సులభం కాదు. మార్చి 31తో పన్ను ఆదా కోసం పెట్టుబడులకు గడువు ముగిసిపోతోంది. ఈ స్వల్ప వ్యవధిలోనే పన్ను ఆదా కోసం ఎంత మేర ఇన్వెస్ట్ చేయాలి, అదే సమయంలో మీరు ఆశించే రాబడులు ఏ పథకంలో వచ్చే అవకాశం ఉంది వంటి అంశాల ఆధారంగా పెట్టుబడి సాధనాలను ఎంచుకోవడం క్లిష్టమైనదే. ప్రస్తుతానికి మీకు పన్ను ఆదా చేయాలి, అదే సమయంలో దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు తెచ్చిపెట్టాలి... అప్పుడే మీరు ఎంచుకున్న సాధనం మీకోసం పనిచేసినట్టు అవుతుంది. ఒకటికి మించిన సాధనాలు ఉన్న నేపథ్యంలో కాస్త ముందే మీ ఆదాయం, మీ రిస్క్, మీ రాబడులు, మీ లక్ష్యానికి ఉన్న కాలం ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆర్థిక ప్రణాళిక డిజైన్ చేసుకోవాలి. ముందు నుంచే ఓ పద్ధతి ప్రకారం క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలని ఆర్థిక నిపుణుల సలహా. ఇన్వెస్టర్లు ముందస్తు ప్రణాళిక లేకుండా, చివరి నిమిషాల్లో చేసే పెట్టుబడుల్లో పొరపాట్లు చేస్తుంటారు. సంపద సృష్టికి ఇవి విఘ్నాలుగా మారకుండా చూసుకోవాలంటే... వీటిని ఫాలో అయిపోతే బెటర్... ఇన్వెస్ట్మెంట్ ప్రణాళిక లేకుండా... ఆర్థిక లక్ష్యాలు, ప్రాధాన్యతలు వ్యక్తికీ, వ్యక్తికీ వేర్వేరుగా ఉంటాయి. వీటికి అనుగుణంగా పెట్టుబడి మొత్తం, అనువైన పన్ను సాధనాలను ఎంచుకోవాలి. కొన్ని పెట్టుబడులపై పన్ను ఆదా ప్రయోజనాన్ని కల్పించేది ప్రజల్ని పొదుపు, మదుపుల దిశగా ప్రోత్సహించేందుకే. ముం దు మీ ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకున్న తర్వాత, వాటిని చేరుకునేందుకు ఉపయోగపడే సాధనాలను ఎంపిక చేసు కుని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. అందుకే పెట్టుబడుల ప్రణాళిక అన్నది చాలా జాగ్రత్తగా చేసుకోవా ల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తుంటా రు. ఇందులో విఫలమైతే అంచనాలు కూడా తప్పుతాయని మరువద్దు. ఆలస్యం చేయకుండా... ఆర్థిక సంవత్సరం చివరి వరకు పన్ను ఆదా పెట్టుబడుల కోసం వేచి చూడొద్దు. ఎందుకంటే పెట్టుబడి నిర్ణయాలను ఆఖరి సమయంలో హడావుడిగా తీసుకుంటే పెద్ద తప్పులకు దారితీయవచ్చు. ‘‘గడువు సమీపిస్తున్నప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్ ఆరాటపడాల్సి వస్తుంది. సరైన సమయం లేకపోవడంతో వారు తమ లక్ష్యాలు, రిస్క్‌ను విశ్లేషించి, తగిన సాధనాన్ని ఎంచుకోవడం సాధ్యం కాదు’’ అని ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్ హెడ్ లవ్‌కుమార్ తెలిపారు. సరైన సాధనం ఎంచుకోకపోతే... మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు సరిపడని ఏ పెట్టుబడి అయినా మీ ఆర్థిక భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉంటుంది. ఇక సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా కోసం ఎంపిక చేసుకున్న సాధనంలో, గడువు తీరిన తర్వాత వచ్చే మెచ్యూరిటీ మొత్తంపై పన్ను ఉంటే అది నష్టాన్ని కలిగిస్తుంది. మీరు పొదుపు చేసిన దానితో పోలిస్తే భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. అత్యవసర నిధి జోలికెళ్లొద్దు... ఇక పన్ను ఆదా సాధనాల కోసం చేతుల్లో తగినంత లేక అత్యవసరాల కోసం పక్కన పెట్టిన నిధిని వాడుకునేవారూ ఉన్నారు. ఇలా చేస్తే గనుక ఆ తర్వాత ప్రాణావసరం ఎదురైతే చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. పన్ను ఆదా పథకాలన్నీ కూడా దీర్ఘకాలానికి ఉద్దేశించినవే. పైగా వీటిల్లో పెట్టుబడులకు మూడేళ్లు, ఆపైనే లాకిన్ పీరియడ్ కూడా ఉంటుంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో నిధుల కొరత ఏర్పడుతుంది. దీంతో రుణాలను ఆశ్రయించాల్సి రావచ్చు. ఇదే జరిగితే మీ ఆర్థిక ప్రణాళిక మరింత ఒత్తిడిలోకి వెళ్లినట్టే అవుతుంది. తొందరపాటుతో అధిక రిస్క్ ఆర్థిక సంవత్సరం చివర్లో పన్ను ఆదా చేసుకోవాలన్న తొం దర్లో మీ స్థాయికి మించిన రిస్క్ ఉండే సాధనంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి... అప్పుడు మీ పెట్టుబడిలో గణనీయ మొత్తాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మార్కె ట్ అస్థిరతల భయంతో లాకిన్ తీరిన వెంటనే పెట్టుబడులు వెనక్కి తీసుకుంటే ఇదే జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం ఒకేసారి... రిస్కీ సాధనంలో ఏక మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టడం వల్ల, క్రమానుగత పెట్టుబడులతో పోలిస్తే మరింత రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది. ఈక్విటీ మార్కెట్ ఆధారిత సాధనాల్లో ఒకేసారి కాకుండా సిప్ రూపంలో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకోవడమే సరైనది. దీనివల్ల కొనుగోలు ధర యావరేజ్ అవుతుంది. దీంతో రిస్క్ తగ్గుతుంది. ఇక సమయం లేక, ఆర్థిక సంవత్సరం చివరి మాసంలో ఉంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం తప్ప మరో పరిష్కారం లేదు. గతమూ కొలమానమే పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత పథకాలు అంతకుముందు కాలంలో ఏ విధంగా రాబడులు ఇచ్చాయన్న అధ్యయనం తప్పకుండా చేయాలి. అలా చూసినప్పుడు మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపడే పథకాలను ఎంచుకోవడం సాధ్యపడుతుంది. అంతేకాదు రిస్క్‌ను కూడా తగ్గించుకున్న వారవుతారు. అయితే, మ్యూచువల్ ఫండ్స్ పథకాల గత పనితీరు ఓ అంచనా కోసమే గానీ, వాటిపైనే పూర్తిగా ఆధారపడడం కూడా సరికాదంటున్నారు నిపుణులు. ఉదాహరణకు ఓ మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంచుకునే ముందు మార్కెట్ పతనాల్లో సంబంధిత ఫండ్ మేనేజర్ ఏ విధంగా వ్యవహరించారు, అదే సమయంలో మార్కెట్ ర్యాలీల్లో ఎంత మేర ఆల్ఫా రిటర్నులు తీసుకొచ్చారన్నది పరిశీలించడం మంచిదేనని లవ్‌కుమార్ తెలిపారు. డైవర్సిఫికేషన్ లేకుండా... ఇక పన్ను ఆదా కోసమని మొత్తం పెట్టుబడులన్నింటినీ ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేయడం కూడా సరైనది కాదు. ఉదాహరణకు సెక్షన్80సీ కింద రూ.1.5 లక్షల మొత్తాన్ని ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ ఎక్కువగా తీసుకున్నట్టు అవుతుంది. దీనికంటే ప్రతీ సాధనంలోని సదుపాయాలను పరిశీలించి భిన్న సాధనాలతో కూడిన వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఇక ఈఎల్ఎస్ఎస్ పథకాల విషయంలో గ్రోత్ ఆప్షన్‌కు బదులు డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవడం దీర్ఘకాలంలో సంపద సృష్టికి విరుద్ధమని, అలాగే, క్లోజ్ ఎండెడ్ పథకాలు కూడా సూచనీయం కాదన్నది నిపుణుల విశ్లేషణ. సమీక్ష మీ కుటుంబ సభ్యుల సంఖ్య పెరగొచ్చు... లేదా ఆదాయం పెరగొచ్చు... ఇటువంటి మార్పులకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక కూడా మారాలి. అలా కాకుండా పాత ప్రణాళికనే పాటిస్తుండడం వల్ల చాలా ఆర్థిక లక్ష్యాలకు దూరంగా ఉండిపోవాల్సి రావచ్చు. పర్యవేక్షణ పెట్టుబడులు పెట్టేయడంతో పనైపోదు. మీ పెట్టుబడులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ ఉండాలి. మీ లక్ష్యాలను చేరుకునే దిశగానే వాటి రాబడులు ఉన్నాయా అన్నది పరిశీలించాలి. వాటి పనితీరు ఆధారంగా అవసరమైతే అదనంగా పెట్టుబడి పెంచుకోవడం లేదా ఉన్న వాటిల్లో తొలగింపులు చేసుకోవాల్సి ఉంటుంది. ‘‘తప్పులను తగ్గించుకునేందుకు ఇన్వెస్టర్లు ఓపిక వహించాలి. అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉన్నా సరే. ఇతరులను అనుసరించొద్దు. భావోద్వేగాలతో కూడిన ఇన్వెస్టింగ్ నష్టాలకు దారితీస్తుంది’’ అని లవ్‌కుమార్ సూచించారు. ‘‘ఎక్కువ మంది ఈఎల్ఎస్ఎస్ పథకాల విషయంలో చేసే తప్పిదం జనవరి/ఫిబ్రవరి వరకు వేచి ఉండడమే. హెచ్ఆర్ విభాగం అడిగిన తర్వాతే పన్ను ఆదా పథకాల గురించి అన్వేషణ మొదలవుతుంది. చక్కని ప్రణాళికతో కూడిన సిప్... చివరి నిమిషాల్లో ఇబ్బందులను తప్పించడంతోపాటు మంచి రాబడులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది’’ – ప్రసన్న పాఠక్, టారస్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఫండ్ మేనేజర్ -
‘వ్యాపార’ ర్యాంకింగ్ ఇంకా మెరుగ్గానే..
న్యూఢిల్లీ: వ్యాపారానికి సానుకూల దేశాల జాబితాలో భారత్‌కు మరింత మెరుగైన ర్యాంక్ లభించి ఉండాల్సిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో గతేడాదితో పోలిస్తే 12 స్థానాలు మెరుగుపడినప్పటికీ(142 నుంచి 130కి) జైట్లీ మాత్రం దీనిపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. వ్యాపారాలకు మరింత అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు తమ ప్రభుత్వం అనేక సంస్కరణలు, విధానపరమైన చర్యలను తీసుకున్నప్పటికీ... తాజా ర్యాంకుల్లో వీటన్నింటినీ పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘వ్యాపార నిర్వహణకు సానుకూలత’ పేరుతో ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్‌లో జైట్లీ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాగా, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సెప్టెంబర్‌లో ప్రకటించిన ప్రపంచంలో అత్యంత పోటీతత్వ ఆర్థిక వ్యవస్థల జాబితాలో కూడా భారత్ ర్యాంక్ 16 స్థానాలు ఎగబాకి 55కు చేరిన సంగతి తెలిసిందే. చకచకా నిర్ణయాలు తీసుకోవడం, విధానపరమైన మార్పుల్లో వేగం, అవినీతి నిర్మూలనకు తగిన చర్యలు, అనుమతుల్లో జోరు వంటివన్నీ భారత్ ర్యాంకింగ్ మెరుగుపడేందుకు దోహదం చేస్తున్నాయని ఆర్థిక మంత్రి వివరించారు. స్థానిక చట్టాలను సరళతరం చేయాలి... పెట్టుబడి నిర్ణయాలు వేగంగా వాస్తవ రూపందాల్చేందుకు వీలుగా అవసరమైన అనుమతుల సంఖ్యను మరింతగా తగ్గించాల్సిన అవసరం ఉందని జైట్లీ చెప్పారు.. పరిశ్రమలకు అవసరమైన భూమి లభ్యత, పర్యావరణ అనుమతులు, భవన నిర్మాణ ప్లాన్ల మంజూరు వంటి విషయాల్లో తగినవిధంగా స్థానిక చట్టాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. కాగా, పెట్టుబడులకు సంబంధిత కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా హైకోర్టుల్లో ఒక వ్యాపార సంబంధ విభాగాన్ని ఏర్పాటు చేయల్సి ఉందని కూడా జైట్లీ పేర్కొన్నారు.