‘వ్యాపార’ ర్యాంకింగ్ ఇంకా మెరుగ్గానే..
న్యూఢిల్లీ: వ్యాపారానికి సానుకూల దేశాల జాబితాలో భారత్‌కు మరింత మెరుగైన ర్యాంక్ లభించి ఉండాల్సిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో గతేడాదితో పోలిస్తే 12 స్థానాలు మెరుగుపడినప్పటికీ(142 నుంచి 130కి) జైట్లీ మాత్రం దీనిపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. వ్యాపారాలకు మరింత అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు తమ ప్రభుత్వం అనేక సంస్కరణలు, విధానపరమైన చర్యలను తీసుకున్నప్పటికీ... తాజా ర్యాంకుల్లో వీటన్నింటినీ పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.
‘వ్యాపార నిర్వహణకు సానుకూలత’ పేరుతో ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌లో జైట్లీ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాగా, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సెప్టెంబర్‌లో ప్రకటించిన ప్రపంచంలో అత్యంత పోటీతత్వ ఆర్థిక వ్యవస్థల జాబితాలో కూడా భారత్ ర్యాంక్ 16 స్థానాలు ఎగబాకి 55కు చేరిన సంగతి తెలిసిందే. చకచకా నిర్ణయాలు తీసుకోవడం, విధానపరమైన మార్పుల్లో వేగం, అవినీతి నిర్మూలనకు తగిన చర్యలు, అనుమతుల్లో జోరు వంటివన్నీ భారత్ ర్యాంకింగ్ మెరుగుపడేందుకు దోహదం చేస్తున్నాయని ఆర్థిక మంత్రి వివరించారు.
స్థానిక చట్టాలను సరళతరం చేయాలి...
పెట్టుబడి నిర్ణయాలు వేగంగా వాస్తవ రూపందాల్చేందుకు వీలుగా అవసరమైన అనుమతుల సంఖ్యను మరింతగా తగ్గించాల్సిన అవసరం ఉందని జైట్లీ చెప్పారు.. పరిశ్రమలకు అవసరమైన భూమి లభ్యత, పర్యావరణ అనుమతులు, భవన నిర్మాణ ప్లాన్‌ల మంజూరు వంటి విషయాల్లో తగినవిధంగా స్థానిక చట్టాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. కాగా, పెట్టుబడులకు సంబంధిత కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా హైకోర్టుల్లో ఒక వ్యాపార సంబంధ విభాగాన్ని ఏర్పాటు చేయల్సి ఉందని కూడా జైట్లీ పేర్కొన్నారు.