ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయం ఇప్పటికే ప్రారంభం
తాజాగా హైదరాబాద్ నుంచి సిబ్బంది ఫైళ్లు, సామగ్రి తరలింపు పూర్తి
ఏపీఈఆర్‌సీ కొత్త భవనం నుంచి కార్యకలాపాలు
నేటితో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో ఈఆర్‌సీ తరలింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ప్రధాన కార్యాలయం కార్యకలాపాలు శనివారం నుంచి కర్నూలులో ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ పదేళ్లు రాజధానిగా ఉంటుందనే గడువు ఆదివారంతో ముగుస్తుండడంతో ఒకరోజు ముందుగానే ఏపీఈ ఆర్‌సీ తన కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించింది. ఈఆర్సీ భవనంతోపాటు ఓ అతిథి గృహాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించడంతో పాటు రూ.23 కోట్ల నిధులు అందించింది. ఈ నిధులతో 15 వేల చదరపు అడుగుల భవన నిర్మాణం జరిగింది. మరో 5 వేల చదరపు అడుగుల్లో గెస్ట్‌హౌస్ నిర్మిస్తున్నారు. నిర్మాణం పూర్తయిన భవనాన్ని ఈనెల 23న ప్రారంభించారు. శనివారం నుంచి అందులో అధికారికంగా కార్యకలాపాలు మొదలుపెట్టారు.
పాతికేళ్ల క్రితం పుట్టిన ‘మండలి’
1999 మార్చిలో హైదరాబాద్ కేంద్రంగా ఏపీఈఆర్‌సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, మండలి మాత్రం ఇన్నాళ్లూ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తూ వచ్చింది. ఏపీఈఆర్‌సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఉండాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గతేడాది ఆగస్టు 25న నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం.. అక్కడ భవన నిర్మాణం మొదలైంది. ఏపీఈఆర్‌సీకి ఒక చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులు ఉంటారు.
వీరి తరువాత ఒక డైరెక్టర్ హోదాలో కమిషన్ సెక్రటరీ, ఆ తరువాత జాయింట్ డైరెక్టర్, ఐదుగురు డిప్యూటీ డైరెక్టర్లు, ఒక లీగల్ కన్సల్టెంట్, ఒక ఐటీ కన్సల్టెంట్, కార్యాలయ సిబ్బంది ఉంటారు. వీరంతా తమ ఆ«దీనంలోని ఫైళ్లను తరలించేందుకు సిద్ధంచేసి భద్రపరచాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో కమిషన్ ఆదేశించింది. అలాగే, ఉద్యోగులు తమ నివాసాన్ని కర్నూలుకు మార్చుకోవాలని, వసతి ఏర్పాట్లుచేసుకోవాలని సూచించింది. అందుకు స్థానికంగా ముగ్గురు డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ స్థాయి అధికారుల సహాయ సహకారాలను తీసుకోవాల్సిందిగా సూచించింది. అన్ని పనులు పూర్తవడంతో సిబ్బందితో పాటు ఫైళ్లు, సామగ్రి కర్నూలుకు తరలివెళ్లాయి.
ఏపీఈఆర్‌సీ ఏం చేస్తుందంటే..
విద్యుత్ చట్టంలోని సెక్షన్–86 ద్వారా కమిషన్‌కు పలు విధులను నిర్దేశించారు. అవి ఏమిటంటే.. ⇒
విద్యుత్ ప్రసారం, పంపిణీ, రిటైల్ సరఫరా కార్యకలాపాలు, నిర్వహణను మెరుగుపరిచి, విద్యుత్ చార్జీలను నిర్ణయించడం మండలి లక్ష్యం. ⇒
ఇంట్రా–స్టేట్ ట్రాన్స్‌మిషన్‌లో ఓపెన్ యాక్సెస్‌ను సులభతరం చేయడం, ఇంట్రా–స్టేట్ ట్రేడింగ్, పవర్ మార్కెట్ అభివృద్ధిని ప్రోత్సహించడం, విద్యుత్ అంతర్రాష్ట్ర ప్రసారం, పంపిణీ రిటైల్ సరఫరాలో పోటీ మార్కెట్ల అభివృద్ధికి అవసరమైన సాంకేతిక, సంస్థాగత మార్పులను తీసుకురావడం వంటివి చేయాలి. ⇒
రాష్ట్రంలో పంపిణీ, సరఫరా కోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ కొనుగోలు, సేకరణ ప్రక్రియను నియంత్రిస్తుంది.
⇒
రాష్ట్రంలో కార్యకలాపాలకు సంబంధించి ట్రాన్స్‌మిషన్ లైసెన్సులు, డి్రస్టిబ్యూషన్ లైసెన్సులు, విద్యుత్ వ్యాపారులుగా వ్యవహరించాలనుకునే వారికి లైసెన్స్‌లను జారీచేస్తుంది. ⇒
పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించేందుకు మొత్తం విద్యుత్ వినియోగంలో దాని శాతాన్ని నిర్ణయిస్తుంది.
⇒
డిస్కంలు, ఉత్పాదక సంస్థల మధ్యనున్న వివాదాలపై విచారణ జరిపి తీర్పుల ద్వారా పరిష్కరిస్తుంది. ⇒
వినియోగదారుల ప్రయోజనాలను పెంపొందించడంపై ప్రభుత్వానికి సలహాలివ్వడం వంటివి కమిషన్ చేస్తుంది. ⇒
అలాగే, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా విశాఖపట్నంలో ఇప్పటికే ఏపీఈఆర్‌సీ క్యాంపు కార్యాలయం గతేడాది ఆగస్టు 18న ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment