common capital hyderabad
-
కర్నూలు నుంచి ‘ఏపీఈఆర్సీ’ కార్యకలాపాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రధాన కార్యాలయం కార్యకలాపాలు శనివారం నుంచి కర్నూలులో ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ పదేళ్లు రాజధానిగా ఉంటుందనే గడువు ఆదివారంతో ముగుస్తుండడంతో ఒకరోజు ముందుగానే ఏపీఈ ఆర్సీ తన కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించింది. ఈఆర్సీ భవనంతోపాటు ఓ అతిథి గృహాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించడంతో పాటు రూ.23 కోట్ల నిధులు అందించింది. ఈ నిధులతో 15 వేల చదరపు అడుగుల భవన నిర్మాణం జరిగింది. మరో 5 వేల చదరపు అడుగుల్లో గెస్ట్‌హౌస్ నిర్మిస్తున్నారు. నిర్మాణం పూర్తయిన భవనాన్ని ఈనెల 23న ప్రారంభించారు. శనివారం నుంచి అందులో అధికారికంగా కార్యకలాపాలు మొదలుపెట్టారు. పాతికేళ్ల క్రితం పుట్టిన ‘మండలి’1999 మార్చిలో హైదరాబాద్ కేంద్రంగా ఏపీఈఆర్సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, మండలి మాత్రం ఇన్నాళ్లూ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తూ వచ్చింది. ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఉండాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గతేడాది ఆగస్టు 25న నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం.. అక్కడ భవన నిర్మాణం మొదలైంది. ఏపీఈఆర్సీకి ఒక చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులు ఉంటారు.వీరి తరువాత ఒక డైరెక్టర్ హోదాలో కమిషన్ సెక్రటరీ, ఆ తరువాత జాయింట్ డైరెక్టర్, ఐదుగురు డిప్యూటీ డైరెక్టర్లు, ఒక లీగల్ కన్సల్టెంట్, ఒక ఐటీ కన్సల్టెంట్, కార్యాలయ సిబ్బంది ఉంటారు. వీరంతా తమ ఆ«దీనంలోని ఫైళ్లను తరలించేందుకు సిద్ధంచేసి భద్రపరచాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో కమిషన్ ఆదేశించింది. అలాగే, ఉద్యోగులు తమ నివాసాన్ని కర్నూలుకు మార్చుకోవాలని, వసతి ఏర్పాట్లుచేసుకోవాలని సూచించింది. అందుకు స్థానికంగా ముగ్గురు డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ స్థాయి అధికారుల సహాయ సహకారాలను తీసుకోవాల్సిందిగా సూచించింది. అన్ని పనులు పూర్తవడంతో సిబ్బందితో పాటు ఫైళ్లు, సామగ్రి కర్నూలుకు తరలివెళ్లాయి.ఏపీఈఆర్సీ ఏం చేస్తుందంటే..విద్యుత్ చట్టంలోని సెక్షన్–86 ద్వారా కమిషన్‌కు పలు విధులను నిర్దేశించారు. అవి ఏమిటంటే.. ⇒ విద్యుత్ ప్రసారం, పంపిణీ, రిటైల్ సరఫరా కార్యకలాపాలు, నిర్వహణను మెరుగుపరిచి, విద్యుత్ చార్జీలను నిర్ణయించడం మండలి లక్ష్యం. ⇒ ఇంట్రా–స్టేట్ ట్రాన్స్‌మిషన్‌లో ఓపెన్ యాక్సెస్‌ను సులభతరం చేయడం, ఇంట్రా–స్టేట్ ట్రేడింగ్, పవర్ మార్కెట్ అభివృద్ధిని ప్రోత్సహించడం, విద్యుత్ అంతర్రాష్ట్ర ప్రసారం, పంపిణీ రిటైల్ సరఫరాలో పోటీ మార్కెట్ల అభివృద్ధికి అవసరమైన సాంకేతిక, సంస్థాగత మార్పులను తీసుకురావడం వంటివి చేయాలి. ⇒ రాష్ట్రంలో పంపిణీ, సరఫరా కోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ కొనుగోలు, సేకరణ ప్రక్రియను నియంత్రిస్తుంది. ⇒ రాష్ట్రంలో కార్యకలాపాలకు సంబంధించి ట్రాన్స్మిషన్ లైసెన్సులు, డి్రస్టిబ్యూషన్ లైసెన్సులు, విద్యుత్ వ్యాపారులుగా వ్యవహరించాలనుకునే వారికి లైసెన్స్‌లను జారీచేస్తుంది. ⇒ పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించేందుకు మొత్తం విద్యుత్ వినియోగంలో దాని శాతాన్ని నిర్ణయిస్తుంది. ⇒ డిస్కంలు, ఉత్పాదక సంస్థల మధ్యనున్న వివాదాలపై విచారణ జరిపి తీర్పుల ద్వారా పరిష్కరిస్తుంది. ⇒ వినియోగదారుల ప్రయోజనాలను పెంపొందించడంపై ప్రభుత్వానికి సలహాలివ్వడం వంటివి కమిషన్ చేస్తుంది. ⇒ అలాగే, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా విశాఖపట్నంలో ఇప్పటికే ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం గతేడాది ఆగస్టు 18న ప్రారంభమైంది. -
ఏపీకి హైదరాబాద్ అసలు ఎంత దూరం?
ఏపీ, తెలంగాణల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇక కొనసాగే అవకాశం లేనట్లేనా! బై బై చెప్పిసినట్లేనా! పంజాబ్, హర్యానాలకు చండీఘడ్ దశాబ్దాల తరబడి ఉమ్మడి రాజధానిగా ఉంటోంది. కానీ హైదరాబాద్‌ను మాత్రం ఏపీ ప్రజలు పదేళ్లకే వదలుకోకతప్పదన్న అభిప్రాయం కలుగుతోంది. ఏపీ మాత్రం మరో పదేళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరుకుంటోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు సిద్ధపడడం లేదు. ఇప్పటికీ హైదరాబాద్‌లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలను స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీకి ఇంతవరకు కేటాయించిన లేక్ వ్యూ అతిథి గృహం వంటి భవనాలను తెలంగాణ తీసేసుకుంటుందన్నమాట.అలాగే తెలంగాణలోని వైద్య కాలేజీలలో ఉన్న అన్ రిజర్వుడ్ కోటా సీట్లను ఇకపై కేవలం తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇదే రూల్ ఏపీకి కూడా వర్తిస్తుంది. విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల కోసం పదిహేను శాతం సీట్లను ఉంచారు. వాటికి ఎవరైనా పోటీపడవచ్చు. ఏపీ విద్యార్థులకు దక్కకుండా అన్నీ సీట్లను తెలంగాణకే ఇవ్వాలని ఆయన అంటున్నారు. నిజానికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ సాంకేతికంగా కొనసాగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక విభజన అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. దీనిపై చొరవ చూపవలసిన కేంద్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా సమావేశాలు జరుపుతూ కాలయాపన చేసింది తప్ప, చిత్తశుద్ధితో నిర్ణయాలు చేయలేకపోయింది. దానికి కారణం రాజకీయాలే అని చెప్పాలి.తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు రెండిటికి రాజకీయ ప్రయోజనాలున్నాయి. ఇక్కడ మొన్నటివరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్తో పాటు ఈ రెండు పార్టీలు కూడా బలంగా ఉన్నాయి. అందువల్ల తెలంగాణ యాంగిల్లోనే వీరు ఆలోచిస్తున్నారు తప్ప ఏపీని పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. పొరపాటున తెలంగాణ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుని ఏపీతో తగాదా లేకుండా చేసుకుంది అనుకోండి.. వెంటనే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు తెలంగాణకు అన్యాయం జరిగిందని రాజకీయం చేస్తున్నాయి. ఉదాహరణకు కృష్ణా నది జలాలపై ఎంత రగడ చేశారో చూడండి. రాయలసీమకు వరద జలాలను తరలించినా, తెలంగాణకు నష్టం జరుగుతున్నట్లుగా వివిధ పార్టీలు విమర్శలు చేశాయి. చివరికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద సీఆర్పీఎఫ్తో కాపలా పెట్టవలసి వస్తోంది. ఆరు నెలల క్రితం ఏపీ ప్రభుత్వం బలవంతంగా తనకు రావల్సిన నీటి కోటాను తీసుకువెళ్లింది కనుక సరిపోయిందికానీ, లేకుంటే ఏపీకి నీళ్లు రావడమే కష్టం అయ్యేదేమో! నదీజలాల యాజమాన్య బోర్డులున్నా.. వాటికున్న అధికారాలు అంతంతమాత్రమేనని చెప్పాలి. ఈ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి ఏపీ సిద్ధపడినా, తెలంగాణ వెనుకడుగు వేస్తోంది. దానికి కారణం రాజకీయ విమర్శలు వస్తాయన్న భయంతోనే. పైగా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలు మొత్తం తమకే కేటాయించాలన్నంతగా డిమాండ్ పెట్టింది. ట్రిబ్యునల్ నదిలో 811 టీఎమ్సీల నీరు పారుతుందని అంచనా వేస్తే, తెలంగాణ ప్రభుత్వం 798 టీఎమ్సీల నీరు తమకే అవసరం అని చెబుతోంది. ఒకపక్క నదిలో వరదలు తగ్గుతున్నాయి. ఇంకో పక్క రెండు రాష్ట్రాలు తమ వాస్తవ అవసరాల ప్రాతిపదికన కాకుండా రాజకీయాల దృష్టితో బేసిస్ నీటి వాటాను కోరుతున్నాయి. ఉమ్మడి ఏపీ విభజన సమయంలో ఏపీకి రాజధాని లేదు కనుక హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా వాడుకోవచ్చని నిర్ణయించారు. ఆ టైమ్‌లో కొందరు ఎంపీలు చండీఘడ్ మాదిరి సుదీర్ఘకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు. 2014 లో విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కూడా అదే తీరులో హైదరాబాద్‌లో ఉన్నారు. సచివాలయ భవనాలకు వందల కోట్లు వెచ్చించారు. ఎవరైనా అడిగితే హైదరాబాద్ రాజధానిగా చాలాకాలం ఉంటుందని అనేవారు. కానీ ఆయన ఓటుకు నోటు కేసులో పట్టుబడడంతో టీఆర్ఎస్తో రాజీలో భాగంగా హైదరాబాద్‌ను వదలి ఏపీకి వెళ్లిపోయారు. దాంతో మొత్తం పరిస్థితి తలకిందులైంది.ఏపీ ప్రజలు దీనివల్ల బాగా నష్టపోయారు. ఆ కేసు సమయంలో చంద్రబాబు ఏకంగా హైదరాబాద్‌లో కేసులు పెట్టే అధికారం తమకు కూడా ఉంటుందన్నంతవరకు వివాదాస్పదంగా మాట్లాడారు. ఆయన రాత్రికి రాత్రే పెట్టె, బెడ సర్దుకుని వెళ్లడంతో సచివాలయ భవనాలన్నీ వృధా అయిపోయాయి. ఆ బిల్డింగ్లు పాడైపోతున్నందున తమకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరితే ప్రస్తుత ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ వాడుతున్న ఇతర భవనాలను స్వాధీనం చేయాలని కోరుతోంది. దీనివల్ల హైదరాబాద్‌లో ఏపీకి స్టేక్ లేకుండా పోతుంది. హైదరాబాద్ ఉమ్మడి ఏపీ ప్రజలు అంతా కలిసి అభివృద్ది చేసుకున్న నగరం. కానీ ఇప్పుడు ఒక ప్రాంతానికే పరిమితం అవడం వల్ల ఏపీ ప్రజలకు నష్టం జరగవచ్చు. విభజన సమయంలో మాబోటి వాళ్లం ఏపీకి హైదరాబాద్‌లో విద్య, ఉపాధి, నివాస అవకాశాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా చట్టం ఉండాలని సూచించినా, రాజకీయ పార్టీలు పట్టించుకోలేదు. దాని ఫలితంగా విద్యపరంగాకానీ, ఉపాధి అవకాశాలలో కానీ మున్ముందు ఏపీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణకు నష్టం చేయాలని, ఇక్కడ ప్రజలకు అన్యాయం జరగాలని ఎవరూ కోరడం లేదు. కానీ ఏపీకి న్యాయం జరగాలన్నదే అందరి అభిప్రాయం. హైదరాబాద్‌లో కానీ, ఇతరత్రా కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. ఉదాహరణకు ఆర్టీసీ ఆస్తులు రెండురాష్ట్రాలకు వర్తిస్తాయి. ఆ ఆస్తుల విభజన ఇంకా జరగలేదు. అలాగే ఇతర సంస్థల ఆస్తులు కూడా పెండింగులోనే ఉన్నాయి. బ్యాంకులలో కూడా ఉమ్మడి ఖాతాలలో డబ్బు ఉంది. దానిపై వివాదం వస్తే ఏపీ తెలుగు అకాడమీ సుప్రింకోర్టువరకు వెళ్లి తన వాటాను సాధించుకుంది.అలాగే ఇతర సంస్థల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను పంచవలసి ఉంటుంది. మొత్తం సుమారు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఏపీకి రావాలన్నది ఒక అంచనా. అది తేలలేదు. ప్రభుత్వరంగ సంస్థల విషయం పరిష్కారం కాలేదు. ఉద్యోగుల విభజనపై విద్యుత్ బోర్డు వంటి సంస్థలలో ఏళ్ల తరబడి కోర్టులలో కేసులు సాగాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగకపోతే, ఏపీకి హైదరాబాద్ పూర్తిగా పరాయిదైపోతుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ అందుకు అనుగుణంగా వ్యవహరిస్తుందా అనే సందేహం ఉంది. దానికి కారణం హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని నిర్ణయిస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు పెద్ద దుమారం లేవదీస్తాయి. దానివల్ల బీజేపీకి తెలంగాణలో నష్టం జరుగుతుందన్న భయం ఉంటుంది. అలాగే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా ఈ విషయంలో నోరు మెదపకపోవచ్చు. ఎందుకంటే వారికి తెలంగాణలో అధికారం ఉంది. ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా రావడం లేదు కనుక. పైగా ఈ రెండు పార్టీలకు ఏపీలో ఉన్న ఓట్లు ఒకశాతం లోపే. ఏపీ లోని పార్టీలు దీనిపై ఎంతవరకు డిమాండ్ చేస్తాయో చూడాలి.అధికార వైఎస్సార్సీపీ దీనిపై కేంద్రానికి ఇప్పటికే లేఖ రాసిందని సమాచారం. ప్రతిపక్ష టీడీపీ దీనిపై నోరు మెదిపే అవకాశం తక్కువే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని బతిమలాడుకుని మళ్లీ టీడీపీ ఎన్డీఏలో చేరింది. అందువల్ల బీజేపీకి అసంతృప్తి కలిగించే ప్రత్యేక హోదాతో సహా ఏ డిమాండ్లు ఏవీ టీడీపీ పెట్టదు. కాంగ్రెస్, బీజేపీల ఏపీ శాఖలు కూడా దీనిపై నోరెత్తకపోవచ్చు. ఈ పరిస్థితి తెలంగాణకు అడ్వాంటేజ్‌గా మారుతుంది. ఏపీకి నష్టం కలిగినా ఏమి చేయలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని చెప్పకతప్పదు. కానీ ధర్మంగా అయితే మరో పదేళ్లు లేదా విభజన సమస్యలు పరిష్కారం అయ్యేవరకైనా ఉమ్మడి రాజధానిగా కొనసాగించడం అవశ్యం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
'ప్రతి విషయంలోనూ తెలంగాణ గిల్లికజ్జాలు'
విజయవాడ: తెలంగాణ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. విజయవాడలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి విషయంలోనూ ఏపీ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం గిల్లికజ్జాలు పెట్టుకుంటోందంటూ ఆయన విమర్శించారు. సెక్షన్ -8 పై అధికారాలన్నీ గవర్నర్ వేనని, హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ పెత్తనమెంటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని ఆయన అన్నారు. మా ఆత్మగౌరవానికి ఇబ్బంది కలిగితే రాజీపడే ప్రసక్తే లేదని చంద్రబాబు పేర్కొన్నారు. -
ఉమ్మడి రాజధాని ఒక కుట్ర: గద్దర్
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఇరు ప్రాంతాల్లో విద్యార్ధులు, ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ప్రజాగాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. సామాజిక తెలంగాణ సాధనకు మేధావులు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫోరం ఫర్ సోషల్ ఛేంజ్ ఆధ్వర్యంలో ‘జయహో తెలంగాణ’ పేరిట ఓయూలో 1980 నుంచి చదివిన పూర్వ విద్యార్ధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ ఉమ్మడి రాజధాని ఒక కుట్ర అని విమర్శించారు. మా పాలన, మా భూములు, మా హక్కులు, మా వనరులు మాకు కావాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంత అభివృద్ధిపై మనం కూడా ఆలోచిస్తున్న సంగతి వారికి ఆలస్యంగానైనా తెలుస్తుందన్నారు. తెలంగాణ సాధనలో ఓయూ విద్యార్ధుల కృషి మరువలేనిదన్నారు. ఇప్పుడు ఓయూ స్థితి అధ్వానంగా ఉందని, యూనివర్శిటి గ్రాంట్స్‌ను తగ్గించటం బాధాకరమన్నారు. సభకు అధ్యక్షత వహించిన అల్లం నారాయణ మాట్లాడుతూ ఓయూ విద్యార్ధుల పోరాటం చారిత్రాత్మకమైందన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్షులు దేవీప్రసాద్, రచయిత భూమన్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్, విరసం నేత రత్నమాల, ముత్యంరెడ్డి, ఓయూ పూర్వ విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఆంక్షల్లేని తెలంగాణ ఇవ్వండి:టీపీఎఫ్
చిక్కడపల్లి,కవాడిగూడ,ఉస్మానియాయూనివర్సిటీ,న్యూస్‌లైన్: ఆంక్షల్లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, తెలంగాణ ఏర్పాటుకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధం ఏమిటని తెలంగాణ ప్రజాఫ్రంట్ నేతలు ప్రశ్నించారు. యూపీఏ,ఎన్డీఏ, టీఆర్ఎస్లు రాజకీయ లబ్ధికోసం తెలంగాణను ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షు డు వేదకుమార్ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు, పోల వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఫ్రంట్ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధ ర్నా జరిగింది. ఈసందర్భంగా వేదకుమార్ మాట్లాడారు. ‘తెలంగాణ ఏర్పాటు కోసం ఉన్న 12 ఆంక్షలను ఎత్తివేయాలి. మానవవిధ్వంసం చేసే పోల వరం ప్రాజెక్టును వెంటనే నిలిపేయాలి. హైకోర్టు తెలంగాణేకే ఉండాలి. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశం. గవర్నర్ పెత్తనాన్ని తొలగించాలి. ఎలాంటి ఆంక్షల్లేని,సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని’డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి నలమాస కృష్ణ, కార్యదర్శి చిక్కుడు ప్రభాకర్, అల్లం పద్మ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో హల్చల్ : షరతుల్లేకుండా తెలంగాణ ఇవ్వాలని, సీమాంధ్రనేతలు కుట్రలు ఇక సాగవంటూ..ప్రజాఫ్రంట్ నేతలు ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఆందోళన నిర్విహ ం చారు. బ్యానర్లు,ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా వారు సీమాంధ్ర పాలకుల్లారా ఖబడ్దార్, ఖబడ్దార్ అంటూ నినాదాలు చేస్తుండడంతో వారిని అక్కడ్నుంచి తరలించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద : పోలవరం ప్రాజెక్టుకు, తెలంగాణ ఏర్పాటుకు లింకెందుకని విరసం నేత వరవరరావు కేంద్రాన్ని ప్రశ్నించారు. బంద్‌కు మద్దతుగా విరసం ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. దీనికి ఆయన హాజరై మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఎందుకు నిర్మాణం చేయాలని, ఆదివాసీ గ్రామాలనే ఎందుకు ముంచాలని ప్రశ్నించారు. ధర్నా చేపట్టిన విరసం నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తరలించారు. ఓయూలో : ప్రజాసంఘాల పిలుపు మేరకు ఓయూలో బంద్ సంపూర్ణంగా జరిగింది. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు కళాశాలలను, కార్యాలయాలను మూసివేయించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్సీసీ గేటు వరకు ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. -
సీఎం, సీమాంధ్ర మంత్రుల డిమాండ్లు బేఖాతర్
హైదరాబాద్ యూటీ లేదు.. రెవెన్యూలో సీమాంధ్రకు వాటా లేదు టీ బిల్లులోని అంశాలపై రాష్ట్ర అధికారులకు జీవోఎం ప్రజంటేషన్ 5 లేదా ఆరేళ్లు మాత్రమే ‘ఉమ్మడి’ అప్పులు 58% సీమాంధ్రకు, 42% తెలంగాణకు విద్యుత్ 57 శాతం తెలంగాణకు, 43 శాతం సీమాంధ్రకు భద్రాచలం తెలంగాణాకే సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రజల హక్కుల పరిరక్షణలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు ఘోరంగా వైఫల్యం చెందారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం దేవుడెరుగు కనీసం హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజలకు, వారి ఆస్తులకు రాజ్యాంగ రక్షణ కల్పించడంలో కూడా విఫలమయ్యూరు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునకు కేంద్రం సిద్ధం చేసిన ముసాయిదా బిల్లులోని అంశాలను కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికారులకు ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించింది. విశ్వసనీయ సమాచారం మేరకు సీఎం సహా, సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు డిమాండ్ చేస్తున్న ఏ అంశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పదేళ్లకు బదులు ఐదు లేదా ఆరు సంవత్సరాలకే పరిమితం చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని మాత్రమే ఉమ్మడి రాజధానిగా పరిగణించనున్నారు. హైదరాబాద్‌లో నివసించే సీమాంధ్ర ప్రజల రక్షణకు, వారి ఆస్తుల పరిరక్షణకు రాజ్యాంగపరమైన ఎటువంటి భరోసా కల్పించడం లేదు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడానికి కూడా జీవోఎం తిరస్కరించింది. కేవలం కేంద్రమంత్రిత్వ శాఖ కార్యదర్శి కన్వీనర్‌గా సెక్యూరిటీ కౌన్సిల్‌ను మాత్రం ఏర్పాటు చేయనున్నారు. ఈ కౌన్సిల్లో గవర్నర్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుంటారు. హైదరాబాద్‌కు వచ్చే ఆదాయంలో సీమాంధ్రకు ఎటువంటి వాటా ఇవ్వడం లేదు. ఆస్తులు, పలు విద్యా సంస్థలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా సీమాంధ్రకు వాటా లేదు. ఏ ప్రాంతంలోని సంస్థలు ఆ ప్రాంతానికే చెందుతాయని జీవోఎం పేర్కొంది. భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలోనే ఉంచాలని నిర్ణయించారు. గోదావరి నదీ జలాలపై కేంద్ర అదనపు కార్యదర్శిని ఆర్బిట్రేటర్‌గాను, కృష్ణా జలాలపై కేంద్ర సంయుక్త కార్యదర్శిని ఆర్బిట్రేటర్‌గాను నియమించనున్నారు. ఎక్కువ విద్యుత్ వినియోగించే తెలంగాణకు మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 57 శాతం, తక్కువ విద్యుత్ వినియోగించే సీమాంధ్రకు 43 శాతం విద్యుత్‌ను జీవోఎం కేటాయించింది. జనవరి నెలాఖరులోగా అఖిల భారత సర్వీసు అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కేడర్‌ను విభజించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేయాలని సూచించింది. అప్పులను జనాభా నిష్పత్తి ఆధారంగా 58 శాతం సీమాంధ్రకు, 42 శాతం తెలంగాణకు కేటాయించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని భవనాల విలువ ఆధారంగా సీమాంధ్రకు వాటా ఇచ్చే అంశాన్ని కూడా పొందుపరచలేదు.