సీఎం, సీమాంధ్ర మంత్రుల డిమాండ్లు బేఖాతర్
హైదరాబాద్ యూటీ లేదు.. రెవెన్యూలో సీమాంధ్రకు వాటా లేదు
టీ బిల్లులోని అంశాలపై రాష్ట్ర అధికారులకు జీవోఎం ప్రజంటేషన్
5 లేదా ఆరేళ్లు మాత్రమే ‘ఉమ్మడి’ అప్పులు 58% సీమాంధ్రకు, 42% తెలంగాణకు
విద్యుత్ 57 శాతం తెలంగాణకు, 43 శాతం సీమాంధ్రకు భద్రాచలం తెలంగాణాకే
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రజల హక్కుల పరిరక్షణలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు ఘోరంగా వైఫల్యం చెందారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం దేవుడెరుగు కనీసం హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజలకు, వారి ఆస్తులకు రాజ్యాంగ రక్షణ కల్పించడంలో కూడా విఫలమయ్యూరు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునకు కేంద్రం సిద్ధం చేసిన ముసాయిదా బిల్లులోని అంశాలను కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికారులకు ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించింది.
విశ్వసనీయ సమాచారం మేరకు సీఎం సహా, సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు డిమాండ్ చేస్తున్న ఏ అంశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పదేళ్లకు బదులు ఐదు లేదా ఆరు సంవత్సరాలకే పరిమితం చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని మాత్రమే ఉమ్మడి రాజధానిగా పరిగణించనున్నారు. హైదరాబాద్‌లో నివసించే సీమాంధ్ర ప్రజల రక్షణకు, వారి ఆస్తుల పరిరక్షణకు రాజ్యాంగపరమైన ఎటువంటి భరోసా కల్పించడం లేదు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడానికి కూడా జీవోఎం తిరస్కరించింది. కేవలం కేంద్రమంత్రిత్వ శాఖ కార్యదర్శి కన్వీనర్‌గా సెక్యూరిటీ కౌన్సిల్‌ను మాత్రం ఏర్పాటు చేయనున్నారు. ఈ కౌన్సిల్‌లో గవర్నర్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుంటారు. హైదరాబాద్‌కు వచ్చే ఆదాయంలో సీమాంధ్రకు ఎటువంటి వాటా ఇవ్వడం లేదు. ఆస్తులు, పలు విద్యా సంస్థలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా సీమాంధ్రకు వాటా లేదు.
ఏ ప్రాంతంలోని సంస్థలు ఆ ప్రాంతానికే చెందుతాయని జీవోఎం పేర్కొంది. భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలోనే ఉంచాలని నిర్ణయించారు. గోదావరి నదీ జలాలపై కేంద్ర అదనపు కార్యదర్శిని ఆర్బిట్రేటర్‌గాను, కృష్ణా జలాలపై కేంద్ర సంయుక్త కార్యదర్శిని ఆర్బిట్రేటర్‌గాను నియమించనున్నారు. ఎక్కువ విద్యుత్ వినియోగించే తెలంగాణకు మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 57 శాతం, తక్కువ విద్యుత్ వినియోగించే సీమాంధ్రకు 43 శాతం విద్యుత్‌ను జీవోఎం కేటాయించింది. జనవరి నెలాఖరులోగా అఖిల భారత సర్వీసు అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కేడర్‌ను విభజించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేయాలని సూచించింది. అప్పులను జనాభా నిష్పత్తి ఆధారంగా 58 శాతం సీమాంధ్రకు, 42 శాతం తెలంగాణకు కేటాయించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని భవనాల విలువ ఆధారంగా సీమాంధ్రకు వాటా ఇచ్చే అంశాన్ని కూడా పొందుపరచలేదు.