ఉమ్మడి రాజధాని ఒక కుట్ర: గద్దర్
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఇరు ప్రాంతాల్లో విద్యార్ధులు, ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ప్రజాగాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. సామాజిక తెలంగాణ సాధనకు మేధావులు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫోరం ఫర్ సోషల్ ఛేంజ్ ఆధ్వర్యంలో ‘జయహో తెలంగాణ’ పేరిట ఓయూలో 1980 నుంచి చదివిన పూర్వ విద్యార్ధుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ ఉమ్మడి రాజధాని ఒక కుట్ర అని విమర్శించారు. మా పాలన, మా భూములు, మా హక్కులు, మా వనరులు మాకు కావాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంత అభివృద్ధిపై మనం కూడా ఆలోచిస్తున్న సంగతి వారికి ఆలస్యంగానైనా తెలుస్తుందన్నారు. తెలంగాణ సాధనలో ఓయూ విద్యార్ధుల కృషి మరువలేనిదన్నారు. ఇప్పుడు ఓయూ స్థితి అధ్వానంగా ఉందని, యూనివర్శిటి గ్రాంట్స్‌ను తగ్గించటం బాధాకరమన్నారు.
సభకు అధ్యక్షత వహించిన అల్లం నారాయణ మాట్లాడుతూ ఓయూ విద్యార్ధుల పోరాటం చారిత్రాత్మకమైందన్నారు. కార్యక్రమంలో టీఎన్‌జీవో అధ్యక్షులు దేవీప్రసాద్, రచయిత భూమన్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్, విరసం నేత రత్నమాల, ముత్యంరెడ్డి, ఓయూ పూర్వ విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.