
ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ (గుమ్మడి విఠల్‌రావు) గొంతు శాశ్వతంగా మూగబోయి పద్దెనిమిది నెలలయింది. దాదాపు అరవై వసంతాలకు పైగా ప్రజలతో మమేకమై.. ఎన్నో ప్రజా ఉద్యమాలకు తన మాట, పాటల ద్వారా ఊపిరి నింపిన విప్లవకారుడాయన. నక్సల్బరీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, దళిత బహుజన ఉద్యమం, సాంస్కృతిక ఉద్యమం... ఇలా అన్ని ఉద్యమాలపైనా తన ముద్ర వేశారు.
‘అమ్మా తెలంగాణమా...’,‘బండెనక బండి కట్టి...’, ‘భద్రం కొడుకో...’, ‘మదనాసుందరి’, ‘అడవి తల్లికి వందనం’ లాంటి వందలాది పాటలతో కొన్ని వేలమందిని ‘ఉద్యమం’ బాట పట్టించారు. ఆయన రాసి, పాడిన ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై’ పాటకు నంది అవార్డు (Nandi Award) వచ్చినా ఆయన తిరస్కరించారు. దేశంలో దళితుల హత్యలు, హత్యలను వ్యతిరేకిస్తూ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. అమర వీరుల కుటుంబాలకు చేయూత నిచ్చేవారు. చాలామంది సానుభూతిపరులు, పౌర –ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, దళిత బహుజన సంఘాలలో సాంస్కృతిక విప్లవం తెచ్చిన వ్యక్తి ఆయన.
1971లో బి. నరసింగరావు ప్రోత్సాహంతో గద్దర్ (Gaddar) ‘ఆపర రిక్షా’ పేరుతో తన మొదటి పాట రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు ‘గద్దర్’. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. ఆయనపై అనేక హత్యాయత్నాలు జరిగినాయి. ముఖ్యంగా 1997 ఏప్రిల్ 6న ఆయనపై ఇంట్లోకి ప్రవేశించి జరిపిన కాల్పుల్లో మరణం అంచుల దాకా వెళ్లి, ప్రాణాలతో బయటపడ్డారు. తన చివరి రోజులలో సామాజిక సమగ్రత, రాజ్యాంగ పరిరక్షణ, అణగారిన వర్గాలకు న్యాయం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అని గ్రహించి ఆ పార్టీ ఏర్పాటు చేసిన సభలలో పాల్గొన్నారు.
చదవండి: మన బ్రెయిన్ చిప్ లాకైందా?
ప్రాంతాల మధ్య అంతరాలను, వెనుకుబాటుతనాన్ని గట్టిగా వ్యతిరేకించారు. సమాజ పురోభివృద్ధికి ప్రతిబంధకాలు అవిద్య, అజ్ఞానం, మూఢ నమ్మకాలు, మతోన్మాదం, అశ్లీలత అని భావించి ప్రజలలో తన ఆట–పాటల ద్వారా చైతన్యం తీసుకొచ్చారు. 2023 జనవరిలో ‘రాయలసీమ ప్రజాసంఘాల వేదిక’లో ప్రసంగించారు. ప్రాంతీయ అసమానతలు తుదముట్టించడానికి లౌకిక ప్రజాతంత్ర ఉద్యమానికి బాసటగా నిలిచారు. తెలుగు నేలపై ప్రజాకళలు ఉన్నంత వరకు గద్దర్ పాట సజీవంగా ఉంటుంది.
– డా.జి. వెన్నెల గద్దర్
తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్
(జనవరి 31న గద్దర్ జయంతి)
Comments
Please login to add a commentAdd a comment