ఏపీ, తెలంగాణల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇక కొనసాగే అవకాశం లేనట్లేనా! బై బై చెప్పిసినట్లేనా! పంజాబ్, హర్యానాలకు చండీఘడ్ దశాబ్దాల తరబడి ఉమ్మడి రాజధానిగా ఉంటోంది. కానీ హైదరాబాద్‌ను మాత్రం ఏపీ ప్రజలు పదేళ్లకే వదలుకోకతప్పదన్న అభిప్రాయం కలుగుతోంది. ఏపీ మాత్రం మరో పదేళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరుకుంటోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు సిద్ధపడడం లేదు. ఇప్పటికీ హైదరాబాద్‌లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలను స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీకి ఇంతవరకు కేటాయించిన లేక్ వ్యూ అతిథి గృహం వంటి భవనాలను తెలంగాణ తీసేసుకుంటుందన్నమాట.
అలాగే తెలంగాణలోని వైద్య కాలేజీలలో ఉన్న అన్ రిజర్వుడ్ కోటా సీట్లను ఇకపై కేవలం తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇదే రూల్ ఏపీకి కూడా వర్తిస్తుంది. విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల కోసం పదిహేను శాతం సీట్లను ఉంచారు. వాటికి ఎవరైనా పోటీపడవచ్చు. ఏపీ విద్యార్థులకు దక్కకుండా అన్నీ సీట్లను తెలంగాణకే ఇవ్వాలని ఆయన అంటున్నారు. నిజానికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ సాంకేతికంగా కొనసాగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక విభజన అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. దీనిపై చొరవ చూపవలసిన కేంద్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా సమావేశాలు జరుపుతూ కాలయాపన చేసింది తప్ప, చిత్తశుద్ధితో నిర్ణయాలు చేయలేకపోయింది. దానికి కారణం రాజకీయాలే అని చెప్పాలి.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు రెండిటికి రాజకీయ ప్రయోజనాలున్నాయి. ఇక్కడ మొన్నటివరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌తో పాటు ఈ రెండు పార్టీలు కూడా బలంగా ఉన్నాయి. అందువల్ల తెలంగాణ యాంగిల్‌లోనే వీరు ఆలోచిస్తున్నారు తప్ప ఏపీని పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. పొరపాటున తెలంగాణ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుని ఏపీతో తగాదా లేకుండా చేసుకుంది అనుకోండి.. వెంటనే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు తెలంగాణకు అన్యాయం జరిగిందని రాజకీయం చేస్తున్నాయి.
ఉదాహరణకు కృష్ణా నది జలాలపై ఎంత రగడ చేశారో చూడండి. రాయలసీమకు వరద జలాలను తరలించినా, తెలంగాణకు నష్టం జరుగుతున్నట్లుగా వివిధ పార్టీలు విమర్శలు చేశాయి. చివరికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద సీఆర్‌పీఎఫ్‌తో కాపలా పెట్టవలసి వస్తోంది. ఆరు నెలల క్రితం ఏపీ ప్రభుత్వం బలవంతంగా తనకు రావల్సిన నీటి కోటాను తీసుకువెళ్లింది కనుక సరిపోయిందికానీ, లేకుంటే ఏపీకి నీళ్లు రావడమే కష్టం అయ్యేదేమో! నదీజలాల యాజమాన్య బోర్డులున్నా.. వాటికున్న అధికారాలు అంతంతమాత్రమేనని చెప్పాలి. ఈ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి ఏపీ సిద్ధపడినా, తెలంగాణ వెనుకడుగు వేస్తోంది. దానికి కారణం రాజకీయ విమర్శలు వస్తాయన్న భయంతోనే. పైగా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలు మొత్తం తమకే కేటాయించాలన్నంతగా డిమాండ్ పెట్టింది. ట్రిబ్యునల్ నదిలో 811 టీఎమ్‌సీల నీరు పారుతుందని అంచనా వేస్తే, తెలంగాణ ప్రభుత్వం 798 టీఎమ్‌సీల నీరు తమకే అవసరం అని చెబుతోంది. ఒకపక్క నదిలో వరదలు తగ్గుతున్నాయి. ఇంకో పక్క రెండు రాష్ట్రాలు తమ వాస్తవ అవసరాల ప్రాతిపదికన కాకుండా రాజకీయాల దృష్టితో బేసిస్ నీటి వాటాను కోరుతున్నాయి.
ఉమ్మడి ఏపీ విభజన సమయంలో ఏపీకి రాజధాని లేదు కనుక హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా వాడుకోవచ్చని నిర్ణయించారు. ఆ టైమ్‌లో కొందరు ఎంపీలు చండీఘడ్ మాదిరి సుదీర్ఘకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు. 2014 లో విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కూడా అదే తీరులో హైదరాబాద్‌లో ఉన్నారు. సచివాలయ భవనాలకు వందల కోట్లు వెచ్చించారు. ఎవరైనా అడిగితే హైదరాబాద్ రాజధానిగా చాలాకాలం ఉంటుందని అనేవారు. కానీ ఆయన ఓటుకు నోటు కేసులో పట్టుబడడంతో టీఆర్ఎస్‌తో రాజీలో భాగంగా హైదరాబాద్‌ను వదలి ఏపీకి వెళ్లిపోయారు. దాంతో మొత్తం పరిస్థితి తలకిందులైంది.
ఏపీ ప్రజలు దీనివల్ల బాగా నష్టపోయారు. ఆ కేసు సమయంలో చంద్రబాబు ఏకంగా హైదరాబాద్‌లో కేసులు పెట్టే అధికారం తమకు కూడా ఉంటుందన్నంతవరకు వివాదాస్పదంగా మాట్లాడారు. ఆయన రాత్రికి రాత్రే పెట్టె, బెడ సర్దుకుని వెళ్లడంతో సచివాలయ భవనాలన్నీ వృధా అయిపోయాయి. ఆ బిల్డింగ్‌లు పాడైపోతున్నందున తమకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరితే ప్రస్తుత ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ వాడుతున్న ఇతర భవనాలను స్వాధీనం చేయాలని కోరుతోంది. దీనివల్ల హైదరాబాద్‌లో ఏపీకి స్టేక్ లేకుండా పోతుంది.
హైదరాబాద్ ఉమ్మడి ఏపీ ప్రజలు అంతా కలిసి అభివృద్ది చేసుకున్న నగరం. కానీ ఇప్పుడు ఒక ప్రాంతానికే పరిమితం అవడం వల్ల ఏపీ ప్రజలకు నష్టం జరగవచ్చు. విభజన సమయంలో మాబోటి వాళ్లం ఏపీకి హైదరాబాద్‌లో విద్య, ఉపాధి, నివాస అవకాశాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా చట్టం ఉండాలని సూచించినా, రాజకీయ పార్టీలు పట్టించుకోలేదు. దాని ఫలితంగా విద్యపరంగాకానీ, ఉపాధి అవకాశాలలో కానీ మున్ముందు ఏపీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది.
తెలంగాణకు నష్టం చేయాలని, ఇక్కడ ప్రజలకు అన్యాయం జరగాలని ఎవరూ కోరడం లేదు. కానీ ఏపీకి న్యాయం జరగాలన్నదే అందరి అభిప్రాయం. హైదరాబాద్‌లో కానీ, ఇతరత్రా కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. ఉదాహరణకు ఆర్టీసీ ఆస్తులు రెండురాష్ట్రాలకు వర్తిస్తాయి. ఆ ఆస్తుల విభజన ఇంకా జరగలేదు. అలాగే ఇతర సంస్థల ఆస్తులు కూడా పెండింగులోనే ఉన్నాయి. బ్యాంకులలో కూడా ఉమ్మడి ఖాతాలలో డబ్బు ఉంది. దానిపై వివాదం వస్తే ఏపీ తెలుగు అకాడమీ సుప్రింకోర్టువరకు వెళ్లి తన వాటాను సాధించుకుంది.
అలాగే ఇతర సంస్థల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను పంచవలసి ఉంటుంది. మొత్తం సుమారు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఏపీకి రావాలన్నది ఒక అంచనా. అది తేలలేదు. ప్రభుత్వరంగ సంస్థల విషయం పరిష్కారం కాలేదు. ఉద్యోగుల విభజనపై విద్యుత్ బోర్డు వంటి సంస్థలలో ఏళ్ల తరబడి కోర్టులలో కేసులు సాగాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగకపోతే, ఏపీకి హైదరాబాద్ పూర్తిగా పరాయిదైపోతుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ అందుకు అనుగుణంగా వ్యవహరిస్తుందా అనే సందేహం ఉంది. దానికి కారణం హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని నిర్ణయిస్తే బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు పెద్ద దుమారం లేవదీస్తాయి. దానివల్ల బీజేపీకి తెలంగాణలో నష్టం జరుగుతుందన్న భయం ఉంటుంది. అలాగే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా ఈ విషయంలో నోరు మెదపకపోవచ్చు. ఎందుకంటే వారికి తెలంగాణలో అధికారం ఉంది. ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా రావడం లేదు కనుక. పైగా ఈ రెండు పార్టీలకు ఏపీలో ఉన్న ఓట్లు ఒకశాతం లోపే. ఏపీ లోని పార్టీలు దీనిపై ఎంతవరకు డిమాండ్ చేస్తాయో చూడాలి.
అధికార వైఎస్సార్‌సీపీ దీనిపై కేంద్రానికి ఇప్పటికే లేఖ రాసిందని సమాచారం. ప్రతిపక్ష టీడీపీ దీనిపై నోరు మెదిపే అవకాశం తక్కువే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని బతిమలాడుకుని మళ్లీ టీడీపీ ఎన్‌డీఏలో చేరింది. అందువల్ల బీజేపీకి అసంతృప్తి కలిగించే ప్రత్యేక హోదాతో సహా ఏ డిమాండ్లు ఏవీ టీడీపీ పెట్టదు. కాంగ్రెస్, బీజేపీల ఏపీ శాఖలు కూడా దీనిపై నోరెత్తకపోవచ్చు. ఈ పరిస్థితి తెలంగాణకు అడ్వాంటేజ్‌గా మారుతుంది. ఏపీకి నష్టం కలిగినా ఏమి చేయలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని చెప్పకతప్పదు. కానీ ధర్మంగా అయితే మరో పదేళ్లు లేదా విభజన సమస్యలు పరిష్కారం అయ్యేవరకైనా ఉమ్మడి రాజధానిగా కొనసాగించడం అవశ్యం.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment