హైదరాబాద్‌ టాలెంట్‌ హబ్‌! | Hyderabad Talent Hub | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ టాలెంట్‌ హబ్‌!

Published Thu, May 30 2024 4:55 AM | Last Updated on Thu, May 30 2024 5:49 AM

Hyderabad Talent Hub

నైపుణ్యం, విభిన్న ప్రతిభకు కేంద్రంగా మన నగరం

ఈ లిస్టులో నవీ ముంబై, పుణే నగరాలు కూడా..

సులభతర వ్యాపారాలకు వీలు

కేపీఎంజీ టాలెంట్‌ ఫీజిబిలిటీ నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని కీలక నగరాల్లో హైదరా బాద్‌ డైనమిక్‌ టాలెంట్‌ హబ్‌గా నిలిచింది. హైదరా బాద్‌తో పాటు నవీ ముంబై, పుణే కూడా మంచి నైపుణ్యం, విభిన్న ప్రతిభకు కేంద్రాలుగా అభివృద్ధి చెందాయని ప్రముఖ కేపీఎంజీ సంస్థ తమ టాలెంట్‌ ఫీజబులిటీ నివేదికలో వెల్లడించింది. క్లిష్టమైన నైపుణ్యాలు, విభిన్న ప్రతిభను కోరుకునే రిక్రూటర్ల డిమాండ్లను తీర్చే విధంగా ఈ హబ్‌లు ఎదిగాయని తెలిపింది. 

ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలు వివిధ పరిశ్రమలకు అవసరమైన ప్రతిభను ఆకర్షిస్తున్నాయని పేర్కొంది. జీవన నాణ్యత, ప్రయాణ సమయం, భద్రత, కనెక్టివిటీ, ఆరోగ్య సంరక్షణ, మెరుగైన గాలి నాణ్యత అంశాల్లో ఈ మూడు నగరాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయని వివరించింది. 

చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో జీవన వ్యయ సూచికలు తక్కువగా ఉన్నాయని.. బెంగళూరు, గుర్గావ్, పుణే నగరాలు స్థానికంగా అధిక కొనుగోలు శక్తిని అందిస్తున్నాయని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో దేశంలోని 10 రంగాలకు చెందిన 40కిపైగా కంపెనీలు, హెచ్‌ఆర్‌ ప్రతినిధులు, నియామక బృందాలతో కలసి ఈ అధ్యయనం చేసినట్టు తెలిపింది.

సులభతర వ్యాపారానికి వీలు..
నవీ ముంబై, హైదరాబాద్, చెన్నై నగరాల్లో వాణిజ్య లీజు ధరలు అందుబాటులో ఉన్నాయని.. ఇది సులభతర వ్యాపారానికి వీలు కల్పిస్తుందని కేపీఎంజీ నివేదిక పేర్కొంది. దీనితో ఈ నగరాల్లో కార్యకలాపాలపై సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపింది. అయితే పన్ను రాయితీలు, సరళీకృత విధానాలు, ఇతర అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రతిభ, ప్రభుత్వ మద్దతు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, జీవన నాణ్యత, వ్యయాలు వంటి అంశాలు సంస్థల ఏర్పాటుకు, అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడానికి కీలకమని పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement