భవిష్యత్ బంగారమే | good time comes for Vegetable farmers | Sakshi
Sakshi News home page

భవిష్యత్ బంగారమే

Published Sun, Nov 16 2014 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM

good time comes for Vegetable farmers

గజ్వేల్: ఆరుగాలం కష్టపడే కూరగాయల రైతులకు ఇక మంచిరోజులు రాబోతున్నాయి. జిల్లాను ‘వెజిటబుల్ జోన్’గా మార్చాలని ప్రభుత్వం మూడేళ్ల కిందట నిర్ణయించినా, అమలులో నిర్లక్ష్యం అలుముకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు  సరికొత్త పథకానికి రూపకల్పన చేసింది.

నాబార్డ్ అధ్వర్యంలో చేపట్టనున్న ఈ పథకానికి ఈనెల 11న జరిగిన జిల్లా కన్సల్టెంట్ కమిటీ (డీసీసీ) సమావేశంలో కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. తెలంగాణలోనే పెలైట్ ప్రాజెక్ట్‌గా సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ పథకం ద్వారా రైతులకు ‘పందిరి’ విధానంలో కూరగాయల సాగుకు సుమారు 50 శాతం సబ్సిడీపై రుణాలను అందించడమే కాకుండా మార్కెటింగ్ అవకాశాలు కల్పించనున్నారు.

కార్పొరేట్ కంపెనీల రాకతో పెరిగిన సాగు
ఒకప్పుడు కూరగాయలు పండించాలంటే రైతులు జంకే పరిస్థితి. ఆరుగాలం శ్రమించి పండించిన ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకెళ్తే కనీసం రవాణా చార్జీలు సైతం గిట్టుబాటుకాని దుస్థితి.  దీంతో కూరగాయల సాగు తగ్గింది. అయితేఆరేళ్లలో పరిస్థితులు కాస్త మారాయి. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా అవసరాలకు కూరగాయలను అందించేందుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టాయి. ఈ క్రమంలో కూరగాయలను సాగుచేస్తున్న ప్రాంతాలపై దృష్టిసారించి ఇక్కడ రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ప్రారంభించాయి.

ఇందులో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గంలో వంటిమామిడి గ్రామాన్ని కేంద్రంగా ఎంచుకుని ఇక్కడ రిలయన్స్‌ఫ్రెష్, హెరిటేజ్, స్పెన్సర్, ఐటీసీ లాంటి సంస్థలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతో కూరగాయల సాగు ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లాలో ప్రస్తుతం 35 వేల ఎకరాల్లో కూరగాయలు, మరో 15ఎకరాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయి. పందిరి విధానంలో బీర, కాకర, పొట్లకాయ, సొరకాయ, దొండతోపాటు సాధారణ విధానాల్లో టమాటా, ఆలుగడ్డ, బీర్నీస్, మిర్చి, బెండ తదితర రకాలతోపాటు ఆకుకూరలను జిల్లా రైతులు సాగు చేస్తున్నారు.

విన్నవించినా.. పట్టించుకోలేదు
గజ్వేల్ నుంచి హైదరాబాద్‌కే కాకుండా రాష్ట్రీయ మార్కెట్‌లకు కూడా కూరగాయలు ఎగుమతవుతుండటం ఈ ప్రాంతం ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించింది. అందువల్లే మూడేళ్ల కిందట అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో పర్యటించిన సందర్భంలోనూ వెజిటబుల్ జోన్‌గా మార్చి మరింత చేయూతనివ్వాలని, దీని ద్వారా కూరగాయల సాగు అభివృద్ధి చెందుతుందని రైతుల నుంచి వినతులు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలోనే జిల్లాలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, తొగుట, నంగునూరు, సిద్దిపేట, దుబ్బాక, చిన్నకోడూరు, చేగుంట, దౌల్తాబాద్, శివ్వంపేట, నర్సాపూర్, జిన్నారం, సంగారెడ్డితో పాటు మరో నాలుగు మండలాలను వెజిటబుల్ జోన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ నిర్ణయం పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు.

కొత్తసర్కార్..సరికొత్త పథకం
కూరగాయల రైతుల ఇబ్బందులపై దృష్టిసారించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘నాబార్డ్’ అధ్వర్యంలో ఈ పథకానికి రూప కల్పన చేస్తోంది. ఈ నెల 11న జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా అధ్యక్షతన జరిగిన డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ కమిటీ(డీసీసీ) సమావేశంలో ఈ పథకానికి ఆమోదముద్ర వేశారు. తొలిదశలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి పెలైట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు.

నియోజకవర్గంలోని సుమారు నాలుగు గ్రామాల్లో ప్రప్రథమంగా 200 మంది వరకు కూరగాయల రైతులను ఎంపిక చేసి వారికి ‘పందిరి’ విధానంలో కూరగాయల సాగుకు ఒక్కో యూనిట్‌కు రూ.2 లక్షల బ్యాంకు రుణం అందిస్తారు. సుమారు 50 శాతం వరకు సబ్సీడీ రైతుకు వర్తించేలా చేస్తున్నారు. అంతటితో సరిపెట్టకుండా రైతుకు మార్కెటింగ్ సౌకర్యాలను సైతం కల్పించనున్నారు. గజ్వేల్‌లో పథకాన్ని విజయవంతంగా అమలుచేసిన తర్వాత జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు వర్తింపజేయనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement