అరటిపండుతోంది! | Cagantipadulo own part of the farmers market | Sakshi
Sakshi News home page

అరటిపండుతోంది!

Published Tue, Dec 17 2013 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM

Cagantipadulo own part of the farmers market

అ‘ధర’హో
 = చాగంటిపాడులో సొంత మార్కెట్‌కు రైతుల శ్రీకారం
 = గిట్టుబాటు ధరే లక్ష్యం  లాభాలతో ఆనందం

 
 చాగంటిపాడు అరటి మార్కెట్ రైతులకు లాభాల పంట పండిస్తోంది. స్వయంగా రైతులే ఏర్పాటుచేసుకున్న ఈ మార్కెట్‌లో  న్యాయబద్ధమైన ధర లభిస్తోంది. మార్కెట్ మాయాజాలం, అడ్డూఅదుపూ లేని కమీషన్ల భారం, తడిసిమోపెడవుతున్న రవాణాఖర్చుల బారినుంచి వారిని అరటి మార్కెట్ ఆదుకుంటోంది. వారు పండించిన పంటకు కనీస మద్దతు ధర లభిస్తుండడంతో అరటి రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
 
తోట్లవల్లూరు, న్యూస్‌లైన్ : వాణిజ్య పంటల్లో ప్రధానమైన అరటిని లంక, మెట్ట భూముల్లో విస్తారంగా సాగుచేస్తున్నారు. తోట్లవల్లూరు, వల్లూరుపాలెం, రొయ్యూరు, భద్రిరాజుపాలెం, చాగంటిపా డు, కళ్లంవారిపాలెం, దేవరపల్లి, పొట్టిదిబ్బలంక ప్రాంతాల్లో అరటి సాగవుతోంది. ఉద్యానశాఖ అంచనా ప్రకారం  700 నుంచి 800 ఎకరాల్లో అరటిని పండిస్తున్నారు.
 
మద్దతు ధర కోసం..  

అరటి రైతులు మార్కెట్ మాయాజాలానికి బలవుతున్నారు. ఓ వైపు సాగు ఖర్చులు, ప్రకృతి విపత్తుల కారణంగా ఎదురయ్యే నష్టాలతో అల్లాడుతున్న రైతులకు మార్కెట్‌లో లభించే ధర గిట్టుబాటు కావడం లేదు. వచ్చే అరకొర ధరలో  కమీషన్, రవాణా ఖర్చులు పోగా మిగిలేది అంతంతమాత్రమే. దీన్నుంచి బయటపడేందుకు చాగంటిపాడు రైతులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాబార్డు సహకారంతో  గ్రామంలోని ఔత్సాహిక రైతులు రైతుక్లబ్‌గా ఏర్పడి రెండు నెలల కిందట అరటి మార్కెట్‌ను ప్రారంభించారు. వారి పంటకు వారే ధర నిర్ణయించుకోవడం విశేషం.
 
ముమ్మరంగా కొనుగోళ్లు..

రైతుల ఆధ్వర్యంలో ప్రారంభమైన మార్కెట్‌లో అరటి కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తోట్లవల్లూరు, భద్రిరాజుపాలెం, దేవరపల్లి, కళ్లంవారిపాలెం, వల్లూరుపాలెం, ఐలూరు, ఐనపూరు, పెనమకూరు గ్రామాల రైతులు  పం టను మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. ప్రతి సోమ, గురువారం  వేలంపాటలు  నిర్వహిస్తున్నారు. వారానికి సగటున  1800కు పైగా గెలలు వస్తున్నాయి. చల్లపల్లి, అవనిగడ్డ, నూజివీడు, ఆగిరిపల్లి, ఉయ్యూరు, కంకిపాడు, పామర్రు, గుంటూరు జిల్లా నుంచి వ్యాపారులు అరటి కొనుగోలు కోసం వస్తున్నారు. రవాణావ్యయం, కమీషన్ ఖర్చులు   తగ్గడంతో కనీస మద్దతు ధర లభిస్తోంది. ఒక్కో గెలకు  రూ. 15 నుంచి రూ. 20 వరకు బయటి మార్కెట్‌ల కంటే అదనంగా నగదు లభిస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
 న్యాయమైన ధర కోసమే..
 వ్యాపారుల మాయాజాలం కారణంగా అరటికి బయట మార్కెట్లలో సరైన ధర లభించడం లేదు.  రైతులకు మేలు చేయాలనే సదుద్దేశంతో  మార్కెట్‌ను ప్రారంభించాం. రైతులు, వ్యాపారుల సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్నాం.
 - కొల్లి కేశవచంద్రమోహనరెడ్డి,  చీఫ్ కోఆర్డినేటర్, రైతుక్లబ్, చాగంటిపాడు
 
 ఎంతో ఉపయుక్తం..
 చాగంటిపాడులో అరటి మార్కెట్ ఏర్పాటుచేయడం వల్ల రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంది. వ్యాపారుల మోసాల  నుంచి రైతులను రక్షించడంతోపాటు రవాణా వ్యయం బాగా కలిసివస్తోంది. దీంతో కొంతవరకు మెరుగైన ధర లభిస్తోంది. మార్కెట్ ఏర్పాటులో రైతుక్లబ్ తీసుకున్న చొరవ అభినందనీయం.
 - కలకోట వెంకటరామిరెడ్డి, రైతు, చాగంటిపాడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement