గంగానదిలో మృతదేహాలు : యూపీ, బిహార్‌ మధ్య చిచ్చు | More Bodies In Bihar, Dumped By Ambulances Floating CorpsesCount 71 | Sakshi
Sakshi News home page

గంగానదిలో మృతదేహాలు : యూపీ, బిహార్‌ మధ్య చిచ్చు

Published Tue, May 11 2021 8:21 PM | Last Updated on Tue, May 11 2021 9:14 PM

 More Bodies In Bihar, Dumped By Ambulances Floating CorpsesCount 71 - Sakshi

లక్నో: పవిత్ర గంగా నదిలో తేలుతున్న మృతదేహాలు కలవరం పుట్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందినవిగా భావిస్తున్న మృతేదేహాలు ఈ రోజు మరిన్ని బయట పడటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. గంగానదిలో ఒడ్డుకు కొట్టుకొస్తున్న శవాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఒకవైపు భయంకరంగా విస్తురిస్తున్న  కరోనా, మరోవైపు రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు సమీపంలో గంగా నదిలో శవాలు తేలుతూ కనిపించడంతో  ప్రజలు  మరింత వణికిపోతున్నారు.

సోమవారం బిహార్‌ జిల్లా బక్సర్ వద్ద గంగానదిలో డజన్లకొద్దీ మృతదేహాలు తెలియాడగా, బక్సర్ నుండి 55 కి.మీ. దూరంలో మంగళవారం ఉత్తరప్రదేశ్, ఘాజీపూర్ సమీపంలో నదిలో మృతదేహాలు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవన్నీ ఉత్తరప్రదేశ్‌కు చెందినవేనని బిహార్ అధికారులు వాదిస్తున్నారు. అంబులెన్స్ డ్రైవర్లు వీటిని విసిరిపారేసినట్టు ఆరోపిస్తున్నారు.  దీనిపై శేఖర్‌ సుమన్‌, బాలీవుడ్‌ నటి  ఊర్మిళ మటోండ్కర్‌  కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్‌ అవుతుండటంతో కోవిడ్ బాధితులు, కుటుంబాలకు లభిస్తున్న గౌరవంపై  దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

యూపీ సరిహద్దు సమీపంలో బిహార్‌లోని సరన్‌లో ఉన్న జైప్రభా సేతు అనే వంతెనపైనుంచి అంబులెన్స్‌ల నుంచి కోవిడ్ బాధితుల మృతదేహాలను డ్రైవర్లు నదిలోకి విసిరివేస్తున్నారని బిహార్ బిజెపి ఎంపీ జనార్థన్ సింగ్ సిగ్రివాల్ ఆరోపించారు. దీనిపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా సరన్ జిల్లా యంత్రాంగాన్ని కోరినట్లు తెలిపారు. అయితే ఇరు రాష్ట్రాలు వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.  యూపీ, బిహార్‌ రెండు రాష్ట్రాలకు చెందిన మృతదేహాలను తీసుకొచ్చి గంగానదిలో వేస్తున్నారని స్థానికుడు అరవింద్ సింగ్ ఆరోపించారు.

కోవిడ్ బాధితులవిగా చెబుతున్న కుళ్ళిపోయిన కొన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకున్న బిహార్‌ పోలీసులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. పూర్తిగా కుళ్ళిపోయినందున, మరణానికి కారణాలను ఇంకా గుర్తించలేదని అధికారులు తెలిపారు. శవాలను గుర్తించేందుకు వీలుగా డీఎన్‌ఏలను భద్రపరిచామని చెప్పారు. అయితే మృతదేహాలను దహనం చేయడానికి కట్టెలకు అధిక ధరలు వసూలు చేస్తున్నందు వల్లే మృతదేహాలను స్థానిక ప్రజలు నదిలోకి విసిరేస్తున్నారన్న వాదనలను బక్సర్ జిల్లా మేజిస్ట్రేట్ అమన్ సమీర్ తోసిపుచ్చారు. శశ్మానాల్లో తగినంత కట్టెలు ఉన్నాయనీ, ప్రతి రోజు సగటున ఆరు నుండి ఎనిమిది మృతదేహాలు దహనం చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలపై  అప్రమత్తంగా ఉండాలని అటూ యూపీ అధికారులను, తమ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామని, మృతదేహాలను నదిలోకి విసిరేయకుండా స్థానికులకు అవగాహన కల్పించాలని కోరామని  కూడా తెలిపారు.

మరోవైపు ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారని మంత్రి సంజయ్ కుమార్ ఝా అన్నారు. మృతదేహాలు యూపీ నుంచి బిహార్‌లో తేలుతున్నాయన్నారు. అటు కరోనాతో చనిపోయిన వారికి, ఇటు పవిత్ర గంగానదికి కూడా తగిన గౌరవం లభించాలని సీఎం భావిస్తున్నారన్నారు. అలాగే ఈ డెడ్‌బాడీస్‌ దాదాపు నాలుగైదు రోజులనాటివని పోస్టుమార్టం నివేదికలో తమ వైద్యులు ధృవీకరించారని తెలిపారు. 

చదవండి: బీ, ఏబీ బ్లడ్‌ గ్రూపుల వారికే కరోనా ముప్పు ఎక్కువ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement