సాక్షి, నిజామాబాద్ అర్బన్: జిల్లా ఆస్పత్రిలో సోమవారం కలకలం రేగింది. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఓ వ్యక్తిని ఐసోలేషన్ వార్డుకు తరలిస్తుండగా సదరు వ్యక్తి పరారు కావడంతో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. అసలేం జరిగిందంటే.. జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు (35) ఇటీవల మహారాష్ట్రలోని తమ బంధువుల పెళ్లికి వెళ్లాడు. తిరిగి వచ్చినప్పటి నుంచి జ్వరం, జలుబు, దగ్గుతో బాధ పడుతున్న అతడు.. సోమవారం జిల్లా ఆస్పత్రికి వచ్చాడు. మూడో అంతస్తులో పరీక్షించిన వైద్యులు జ్వరం, జలుబు, దగ్గు ఉండడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు వద్దకు తీసుకెళ్లారు. (సూపర్ హీరోకి కరోనా ఎఫెక్ట్)
కరోనా లక్షణాలు ఉన్నాయని, అతడ్ని ఐసోలేషన్ వార్డుకు పంపించాలని సూపరింటెండెంట్ సూచించారు. దీంతో అతడ్ని ఐసోలేషన్ వార్డుకు తీసుకెళ్తుండగా.. ఈ విషయం మా బంధువులకు చెప్తానని పక్కకు వెళ్లిన సదరు వ్యక్తి అక్కడి నుంచి అటే పరారయ్యాడు. ఇది గమనించిన ఆస్పత్రి సిబ్బంది అతడి కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో ఆస్పత్రి అధికారులు, సిబ్బంది హైరానా పడ్డారు. మరోవైపు ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేశ్వరరావును వివరణ కోరగా.. ఇలాంటి ఘటన జరగలేదని తెలపడం గమనార్హం. (‘కోవిడ్’ కల్లోలం: సిటీ షట్ డౌన్!)
Comments
Please login to add a commentAdd a comment