సాక్షి, సిటీబ్యూరో: ‘కోవిడ్’ కలకలంతో గ్రేటర్ నగరం చిగురుటాకులా వణికిపోతోంది. నిత్యం లక్షలాది మంది జన సంచారంతో సందడిగా ఉండే మహానగర రహదారులు కరోనా ఎఫెక్ట్‌తో బోసిపోయి కనిపిస్తున్నాయి. ఆదివారం ఇంటిల్లిపాది కలిసి వినోదం, విహారానికి వెళ్లే సిటీజనులు ఈ సండే ఇళ్లకే పరిమితమయ్యారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న మాల్స్, సినిమాహాళ్లు, హోటళ్లు, బార్లు, పబ్బులు దాదాపు మూతపడ్డాయి. కరోనా నివారణ చర్యలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వ్యాపార, వాణిజ్య వర్గాలతోపాటు పౌరసమాజం చక్కగా సహకరిస్తోంది. ఆదివారం కళకళ లాడే మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లు సహా సాధారణ మార్కెట్లు జనం తాకిడిలేక వెలవెలబోయాయి. కోటి జనాభా దాటిన మహానగరంలో ఇప్పుడు కర్ఫ్యూ వాతావరణం నెలకొందంటే అతిశయోక్తి కాదు. నాంపల్లి కోళ్ల మార్కెట్ ఎప్పుడూ సందడిగా కనిపిస్తుంటుంది. కరోనా ఎఫెక్ట్‌తో మార్కెట్‌లో వ్యాపారం పూర్తిగా స్తంభించింది.
ఆదివారం రోజున కూడా మాంసం విక్రయాలు జరగలేదు. ఇక్కడి నుంచి ఇరానీ హోటల్స్‌కు చికెన్ ఎక్కువగాసరఫరా జరుగుతుంటుంది. నాన్ వెజ్ హోటల్స్‌లో వినియోగదారుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో కోడి మాంసం ధరలు అమాంతం తగ్గిపోయాయి. ఇక కరోనా వైరస్ దెబ్బకు జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. బయటి నుంచి కొనుగోలు చేసిన తినుబండారాలు స్వీకరించాలంటేనే భయపడుతున్నారు. గడచిన వారం రోజులుగా మార్కెట్లు, హోటల్స్‌లో గిరాకీ అమాంతం పడిపోయింది. కరోనా వైరస్ ఇతరులు వాడే పదార్థాలు, వస్తువులను తాకడం, తుమ్మినా, దగ్గినా వస్తుండటం మూలంగా ఛాయ్ తాగేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది. ఆదివారం నిలోఫర్ ఆసుపత్రికి సమీపంలో ఉండే ఇరానీ హోటల్స్ అన్నీ ఖాళీగా కన్పించాయి. ఇక నెహ్రూ జూలాజికల్ పార్కును సైతం మూసివేశారు. వన్యప్రాణులకు వ్యాధులు, వైరస్‌లు సోకకుండా జూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బ్లీచింగ్ పౌడర్‌తో పాటు బలవర్ధకమైన ఆహరం, మందులను అందిస్తున్నారు.
వినోదం వెలవెల..
ఆదివారం సందర్శకులతో కిట కిటలాడే ఐమాక్స్, ఎన్టీఆర్‌గార్డెన్, లుంబినీపార్క్, జలవిహార్‌లు మూసివేయడంతో ఆయా ప్రాంతాలు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. వీకెండ్స్‌లో వేల సంఖ్యలో సందర్శకులు ఐమాక్స్, లుంబినీపార్క్, ఎన్టీఆర్‌గార్డెన్‌లకు కుటుంబ సమేతంగా వచ్చి సినిమాలు చూస్తూ, పార్కుల్లో సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తారు. ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా లక్షణాలు నగరంలో వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం సినిమా థియేటర్లు, పార్క్‌లు మూసివేయాలని సూచించిన నేపథ్యంలో ఆదివారం ఐమాక్స్‌తో పాటు పార్కులు మూసివేయడంతో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సందర్శకులు గేట్లు మూసివేయడంతో నిరాశగా వెనుదిరిగి వెళ్లారు. నెక్లెస్ రోడ్డులో జలవిహార్‌ను సైతం నిర్వాహకులు మూసివేశారు. దీంతో నెక్లెస్ రోడ్డు పొడవునా రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇక కోవిడ్ వైరస్ దెబ్బకు సికింద్రాబాద్(లష్కర్) ఖాళీగా కనిపించింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. అత్యవసర పనులపై తప్ప బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. సినిమాహాళ్లు, షాపింగ్‌మాల్స్, విద్యాసంస్థలు మూసివేయడంతో సికింద్రాబాద్‌లోని రహదారులు ఆదివారం ఖాళీగా కనిపించాయి. పాఠశాలల సెలవులతో విద్యార్థులకు నష్టం జరుగుతుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆర్థికభారం మరింత పెరుగుతుందని కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. (భారత్‌లో కోవిడ్ కేసులు 107)
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment