సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) పరిధిలోని స్పెషలిస్ట్ డాక్టర్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. వారికి జోనల్ కేటాయింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. 317 జీవో ప్రకారం జోనల్ కేటాయింపులు చేపట్టనున్నారు. మల్టీ జోనల్ కేడర్ పరిధిలోకి వచ్చే సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ కేడర్లో ఉన్న డాక్టర్ల నుంచి ఆప్షన్లు తీసుకోవాలని తన పరిధిలోని అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు ఇచ్చారు.
జోనల్ కేటాయింపు పూర్తయ్యాక కొన్ని ఆసుపత్రుల్లో అవసరానికి మించి ఎక్కువ మంది డాక్టర్లు ఒకేచోట పనిచేస్తున్నారు. వారిలో అనేకమందిని అవసరం ఉన్నచోటకు బదిలీ చేసేందుకుగాను డాక్టర్ల రేషనలైజేషన్(హేతుబద్ధీకరణ) ప్రక్రియ చేపడతారు. ఆ తర్వాత నర్సులు, పారామెడికల్, క్లర్క్‌లకు కూడా జోనల్ కేటాయింపు చేసి బదిలీలు చేస్తారు.
600 మంది డాక్టర్లు... 2 వేలకుపైగా నర్సులు
రాష్ట్రంలో ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని వైద్యులకు, ఇతర ఉద్యోగులకు ఇప్పటికే బదిలీలు జరిగిన విషయం విదితమే. ఏడు జోన్ల పరిధిలో డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్యసిబ్బందికి పెద్దఎత్తున జోనల్ కేటాయింపులు, బదిలీలు జరిగాయి. అప్పుడు జోనల్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని అనేకమంది ఉద్యోగులు ఆందోళన చెందారు. కానీ, ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉండటంతో వారంతా ఎక్కడికక్కడే ఉండిపోయారు. ప్రస్తుతం టీవీవీపీ పరిధిలోని జిల్లా, ఏరియా, సామాజిక ఆసుపత్రుల్లో జోనల్ కేటాయింపులు, అనంతరం బదిలీలు జరగనున్నాయి.
ఆయా ఆసుపత్రుల్లో 600కుపైగా సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఇతరులు స్పెషలిస్ట్ వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడు 2 వేలకుపైగా నర్సులు, 500కుపైగా ఉన్న పారామెడికల్ సిబ్బందికి బదిలీలు జరుగుతాయి. ముందుగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ కేడర్‌లోని డాక్టర్లు, ఆ తర్వాత నర్సులు, ఇతర ఉద్యోగులకు జోనల్ కేటాయింపులు జరిపి బదిలీలు చేస్తారు. జోనల్ కేటాయింపులు కఠినంగా కాకుండా, ఉద్యోగుల ఆప్షన్ల ప్రకారమే చేపడతారు. ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇష్టారాజ్యంగా జోనల్ మార్పులు జరిగాయని వచ్చిన విమర్శల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు.
చేనేతపై జీఎస్టీ రద్దుచేయాలి కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి లేఖ
సాక్షి, హైదరాబాద్: చేనేతపై విధించిన 5% జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు చేపట్టిన పోస్ట్ కార్డ్ ఉద్యమంలో భాగంగా ఎర్రబెల్లి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం చేనేతను ప్రోత్సాహకాలిచ్చి ఆదుకుంటుంటే, కేంద్రం మాత్రం జీఎస్టీతో వారి నడ్డి విరుస్తోందన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత ప్రజలు ఎక్కువగా ఆధార పడిన చేనేత రంగంపై జీఎస్టీ విధించడం అన్యాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment