సాక్షి, చెన్నై: ఆస్పత్రిలో విధులకు రాకుండా వీడియో కాల్ ద్వారా నర్సుల సాయంతో ఓ గర్భిణికి డాక్టర్ ప్రసవం చేయించే ప్రయత్నం చేశాడు. శిశువు మరణించడం, తల్లి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆగమేఘాలపై పెద్దాస్పత్రికి తరలించారు. మధురాంతకంలో ఈ ఘటన మంగళవారం పెద్ద వివాదానికి దారి తీసింది. వివరాలు.. మదురాంతకం సునాంబేడు అండార్ కుప్పం గ్రామానికి చెందిన మురళి(36) ఎలక్ట్రిషియన్. ఆయన భార్య పుష్ప (33) రెండోసారి గర్భం దాల్చింది. అప్పటి నుంచి వీరు ఇల్లిడు గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించుకుంటూ వస్తున్నారు.
పురిటి నొప్పులు రావడంతో పుష్పను సోమవారం సాయంత్రం ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో అక్కడ వైద్యులు లేరు. ఉన్న ముగ్గురు నర్సులో ఆమెను అడ్మిట్ చేశారు. గంట తర్వాత క్రమంగా నొప్పులు అధికం కావడంతో ప్రసవం చేయడానికి నర్సులు సిద్ధమయ్యారు. అయితే, బిడ్డ తల బయటకు రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో వైద్యుడిని సంప్రదించగా వీడియో కాల్ సాయంతో ప్రసవం చేసే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. రక్తస్రావం అధికం కావడంతో 108 ద్వారా పుష్ప, శిశువును మధురాంతకం ఆస్పత్రికి తరలించారు.
అయితే, మార్గం మధ్యలో శిశువు మరణించింది. పుష్ప పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో శిశువు మరణించిన సమాచారం అందించడం, వీడియో కాల్ ద్వారా నర్సులు ప్రసవం చేసిన వ్యవహారం వెలుగులోకి రావడంతో పుష్ప బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం మధురాంతకం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగడంతో పోలీసులు రంగంలోకి దిగి సముదాయించారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది.
చదవండి: ‘చిన్న చిన్న తప్పులు చేశాను’..అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని
Comments
Please login to add a commentAdd a comment