అమ్మో! మళ్లీ వెళ్లం! | Nurses, 187 other Indians reach home from Iraq | Sakshi
Sakshi News home page

అమ్మో! మళ్లీ వెళ్లం!

Published Sat, Jul 5 2014 8:45 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM

ఇరాక్లో ఉగ్రవాదుల చెర నుంచి క్షేమంగా కొచ్చి చేరుకున్న భారతీయ నర్సులు

ఇరాక్లో ఉగ్రవాదుల చెర నుంచి క్షేమంగా కొచ్చి చేరుకున్న భారతీయ నర్సులు

కొచ్చి/హైదరాబాద్:  ఇరాక్‌లో గత నెల రోజులుగా తీవ్ర భయాందోళనల మధ్య, క్షణమొక యుగంగా మత్యుభయంతో గడిపిన 183 మంది భారతీయులు  శనివారం క్షేమంగా తిరిగి వచ్చారు. మరో 200 మంది ప్రత్యేక విమానంలో వస్తున్నారు. కొచ్చి వచ్చిన వారిలో 46 మంది భారతీయ నర్సులతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని వివిధ ప్రాంతాలకు చెందిన 78 మంది నిర్మాణ కార్మికులు ఉన్నారు.  భారత ప్రభుత్వం, ఇరాక్‌లోని భారతీయ దౌత్యాధికారులు చేసిన కృషి ఫలించి సున్ని మిలిటెంట్ల చెర నుంచి విడుదలై ఎయిర్ ఇండియాకు చెందిన ప్రత్యేక విమానంలో వారు కొచ్చి చేరుకున్నారు. అదే విమానంలో కిర్కుక్‌లో చిక్కుకుపోయిన ఇతర భారతీయులు, ముగ్గురు భారత ప్రభుత్వ అధికారులు కూడా ఇండియా వచ్చారు.

కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికారు. తమ రాష్ట్రానికి చెందిన నర్సులను క్షేమంగా తీసుకొచ్చేందుకు కృషి చేసిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, ఇరాక్‌లోని భారతీయ ఎంబసీ అధికారులకు  చాందీ కృతజ్ఞతలు తెలిపారు. నర్సులంతా క్షేమంగా చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. చెమర్చిన కళ్లతో తమవారిని హత్తుకుని భావోద్వేగభరితులయ్యారు. ఏడాది వయసున్న కూతురిని వదిలేసి ఇరాక్ వెళ్లిన మరీనా అనే నర్సు రెండేళ్ల కూతురుని చూసుకుని కన్నీటిపర్యంతమైంది.  దాదాపు నెల రోజుల క్రితం ఇరాక్‌లో ప్రారంభమైన సున్నీల తిరుగుబాటు కారణంగా తిక్రిత్‌లోని ఒక ఆసుపత్రిలో చిక్కుకుపోయిన నర్సులను మిలిటెంట్లు మొదట మొసుల్‌కు తీసుకెళ్లి, అనంతరం నాటకీయ పరిణామాల మధ్య శుక్రవారం క్షేమంగా విడిచిపెట్టిన విషయం తెలిసిందే.
 
అమ్మో! మళ్లీ వెళ్లం!

 ఇరాక్‌కు మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదని ఆ దేశం నుంచి తిరిగొచ్చిన నర్సులు స్పష్టం చేశారు. మరోసారి తమ ప్రాణాలను పణంగా పెట్టబోమన్నారు. బాంబు పేలుళ్ల శబ్దాలు తమ చెవులలో ఇంకా గింగురుమంటూనే ఉన్నాయన్నారు. కాల్పులు, బాంబు పేలుళ్ల శబ్దాలతో వణికిపోతూ నిద్రలేని రాత్రులు గడిపామని కవలలైన సోనా, వీణలు వివరించారు. స్వదేశానికి తిరిగిరావడం పునర్జన్మలా ఉందన్నారు. తిక్రుత్ నుంచి బస్సుల్లో బయల్దేరిన తరువాత పలుమార్లు మిలిటెంట్లు గమ్యాన్ని మార్చారని, వారివద్ద ఉన్న ఆయుధాలు చూసి ప్రాణాలపై ఆశలు వదులుకున్నామన్నారు. ‘మీరంతా మా చెల్లెళ్లలాంటి వారు. మీకెలాంటి హాని చేయం అని మిలిటెంట్లు మాతో చెప్పారు. అయినా వారి మాటలను మేం నమ్మలేదు’ అని కొట్టాయంకు చెందిన నర్సు సాండ్రా సెబాస్టియన్ తెలిపారు. అయితే, మిలిటెంట్లు తమతో మర్యాదగానే ప్రవర్తించారని చెప్పారు. తాము తిక్రిత్‌లోని ప్రభుత్వాసుపత్రిలో పనిచేశామని,  గత నాలుగు నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదన్నారు.

‘వారిని టెర్రటిస్టులనలేమని, వారంతా స్థానిక ప్రభుత్వంలో భాగమే’నని మరో నర్సు సుని మోల్ చాకొ చెప్పారు.  క్షేమంగా తిరిగొచ్చినందుకు సంతోషంగానే ఉన్నా భవిష్యత్తును తలచుకుంటే భయంగా ఉందని పలువురు నర్సులు వాపోయారు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని ఇరాక్ వెళ్లామని, ఇప్పుడు వాటిని తీర్చడమెలాగా అనే బెంగ పట్టుకుందన్నారు.


కాగా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన భారతీయ పారిశ్రామిక వేత్త బీఆర్ శెట్టీ ఇరాక్‌ నుంచి తిరిగొచ్చిన నర్సులందరికీ ఉద్యోగం కల్పిస్తానని కేరళ వార్తపత్రికల్లో ఒక ప్రకటన ఇచ్చారు. ఆయనకు యూఏఈ, ఇండియా, నేపాల్, భూటాన్‌ల్లో ఆసుపత్రులున్నాయి.

ఇదిలా ఉండగా, మరో 200 మంది భారతీయులు ఈ రాత్రికి ఇరాక్ ఎయిర్వేస్కు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సైయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు.   మరో 48 గంటలలో 400 మంది భారతీయులు కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ చేరుకుంటారని చెప్పారు. సోమవారం నాటికి దాదాపు 1200 మంది భారతీయులు ప్రభుత్వ ఖర్చులపై భారత్ చేరుకుంటున్నట్లు ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement