మనస్సిలాయో అంటున్న మలయాళీలు
మధురం..నగరం
మలయాళీల పేరు చెప్పగానే నర్సులు, కాన్వెంట్ టీచర్లు గుర్తొస్తారు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు హైదరాబాద్‌లోని చాలా చోట్ల మలయాళీలు వేర్వేరు వృత్తుల్లో తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. నగరంలో మలయాళీల జనాభా ఏడు లక్షల వరకు ఉంది. హైదరాబాద్‌కు మలయాళీల వలస 1950 కంటే ముందే మొదలైంది. భాగ్యనగరి మలయాళీల మనసు దోచుకోవడంతో ఇక్కడ వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. లక్షల మంది ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవడం నగరంపై మమకారమే కారణం. ఇదే విషయంపై
కొందరు మలయాళీలను కదిలించగా ‘హైదరాబాదీల మనసు మధురం.. మనస్సిలాయో(అర్థమయిందా?)’ అంటూ ముసిముసినవ్వులు చిందించారు....
బ్రిటిష్ హయాంలో ఉన్న ఆస్పత్రుల్లో నర్సులుగా, కాన్వెంట్ స్కూళ్లలో టీచర్లుగా మలయాళీలు పనిచేసేవారు. ఇప్పటికీ మిషనరీ పాఠశాలల్లో, కళాశాలల్లో ఉపాధ్యాయులుగా మలయాళీలే ఎక్కువగా కనిపిస్తారు. ఇక నర్సులుగా సేవలందిస్తున్న కేరళ యువతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగరంలో పదికి పైగా నర్సింగ్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో తొంబై శాతం మంది మలయాళీ అమ్మాయిలే ఉంటారు. ఇంటర్ పూర్తి కాగానే హైదరాబాద్ వచ్చి, నర్సులుగా శిక్షణ పొంది కార్పొరేట్ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేయడం కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. ఇటీవలి కాలంలో హోటల్ వ్యాపారంలోనూ మలయాళీలు తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. కేరళ వంటకాలు ఇక్కడి మలయాళీలనే కాకుండా, మిగిలిన హైదరాబాదీలనూ ఆకట్టుకుంటున్నాయి.
కేరళ బియ్యంతో భాగ్యనగరి బంధం
ఒకప్పుడు హైదరాబాదీలు కేరళ బియ్యానికి దాసులుగా ఉండేవారు. చూడటానికి కాస్త లావుగా ఉన్నా, కేరళ బియ్యం రుచి మరెక్కడా దొరకదనే వారు. పూర్వం కేరళ నుంచి వచ్చినప్పుడల్లా పది కిలోల బియ్యం తెచ్చుకునేవాళ్లట. ఇప్పుడా అవసరం లేదు. ఇక్కడే బోలెడన్ని రకాల బియ్యం అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కేరళ హోటళ్లలో ఫేమస్ వంటకమంటే దోశ, దాంతో పాటే కేరళీయులు ప్రత్యేకంగా తయారుచేసే కొబ్బరి చట్నీ. సాధారణంగా కేరళ వంటలంటే కొబ్బరినూనెతో చేసిన వంటకాలనే అనుకుంటారు. ఇక్కడ స్థిరపడ్డవారు క్రమంగా మామూలు నూనెకు అలవాటు పడ్డారు. ఎప్పుడైనా కేరళ నుంచి బంధువులు వస్తే తప్ప వారి ఇళ్లలో కొబ్బరినూనె వంటల ఘుమఘుమలు బయటకు రావు.
మలయాళీల ఉగాది విషు
మలయాళీల కొత్త సంవత్సరం ‘విషు’. మనం ఉగాది పండుగ జరుపుకుంటున్నట్లే, మలయాళీలు విషు వేడుకలను జరుపుకుంటారు. హైదరాబాద్‌లోనూ ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. రాత్రిపూట దేవాలయాలకు వెళ్లి, అక్కడే పడుకుని, తెల్లవారు జామున మూడుగంటలకు లేచి, కళ్లు మూసుకుని దేవుని ఎదుటకు వచ్చి నిలబడతారు. కొత్త ఏడాది మొదటి దర్శనం దేవుని రూపమే కావాలనేది ‘విషు’ పండుగలో ప్రత్యేకత. అలా దేవుడిని చూసే వేడుకను ‘విషుకని’ అంటారు. హైదరాబాద్‌లోని చాలా దేవాలయాలు మలయాళీల కోసం ప్రత్యేకంగా ‘విషుకని’ పూజలు నిర్వహిస్తాయి.
‘దిల్‌సుఖ్‌నగర్‌లోని అయ్యప్ప దేవాలయంలో విషుకని పూజలను ఏటా ఘనంగా నిర్వహిస్తారు. పెద్దసంఖ్యలో మలయాళీలు ఆ ఆలయానికి వస్తారు. కొత్త దుస్తులు, ఆభరణాలు ధరించి, పండ్లు, పూలు దేవుడికి సమర్పించి, వేకువ జామున మూడింటికల్లా శ్రీకృష్ణుడిని దర్శించుకోవడంతో విషు వేడుకలు మొదలవుతాయి. ఇక్కడి వారితో పాటు పండుగకు వచ్చిన వారి స్నేహితులు కూడా గుడికి వస్తారు. వీటితో పాటు దసరా, దీపావళి పండుగలను కూడా అందరితో కలసి సరదాగా సెలిబ్రేట్ చేసుకుంటారు.
మంచి వాతావరణం...
‘ఇప్పడంటే అంతా మారిపోయింది గానీ, నలభయ్యేళ్ల కిందట హైదరాబాద్ నగరం స్వర్గంతో సమానం. పచ్చగా ఉండే మా కేరళలో కూడా ఇక్కడ ఉన్నంత చల్లని వాతావరణం ఉండేది కాదు. ఇక్కడ వేసవిలో సైతం ఉక్కబోత ఉండేది కాదు. మలయాళీల మనసు గెలుచుకోవడంలో హైదరాబాద్ ఎప్పుడూ ముందుంటుంది. కేరళ వెలుపల మలయాళీలు పెద్దసంఖ్యలో ఉన్న నగరం హైదరాబాద్ మాత్రమే. నర్సులు, టీచర్లనే కాదు, చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కూడా యాభయ్యేళ్ల కిందటే చాలామంది ఇక్కడకు వలస వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
బతుకమ్మను సరిపోలే ఓనం...
మలయాళీల ప్రధానమైన పండుగ ఓనం. ఆగస్టులో వచ్చే ఈ పండుగను పదిరోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఓనం పండుగను తెలంగాణ పండుగ బతుకమ్మతో పోలుస్తారు. ఇంటి ముందు రంగురంగుల పూలను అలంకరించి, వాటిపై దీపాలు పెట్టి, వాటి చుట్టూ మహిళలు పాటలు పాడుతూ తిరుగుతారు. దీన్నే తిరువదిర అంటారు. ‘ఈ పండుగకు కేరళలో నాలుగు రోజులు ప్రభుత్వ సెలవు దినాలు ఉంటాయి. హైదరాబాద్‌లోనూ మేం ఓనం పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ వేడుక కోసం ప్రత్యేకంగా అసోసియేషన్‌స కూడా ఏర్పాటయ్యాయి. వాటి ఆధ్వర్యంలో పదిరోజుల ఓనం వేడుకలు జరుగుతాయి. ఆ సమయంలో మా కేరళ మహిళలంతా గోధుమ రంగు చీరల్లో కనిపిస్తారు. ఓనం సందర్భంగా చేసే ‘అడప్రదమన్’ పాయసం చాలా రుచిగా ఉంటుంది. మా వాళ్లతో పాటు చాలామంది హైదరాబాదీలు ఓనం పండుగను బాగా ఎంజాయ్ చేస్తారు’ అని వివరించారు మెహదీపట్నానికి చెందిన భార్గవి.