Malayalis
-
గల్ఫ్ దేశాల్లో ఎందుకు మలయాళీలు ఎక్కువ?
కేరళ ప్రజలు అత్యధికంగా గల్ఫ్ దేశాల్లో ప్రవాసం ఉండే విషయం తెలిసిందే. కువైట్‌లో ఉండే విదేశీయుల్లో 80 శాతం దాకా మన దేశంలోని కేరళ నుంచి వెళ్ళినవారే. గల్ఫ్ దేశాల్లోని అవకాశాల్ని మొట్టమొదటగా గుర్తించి వాటిని అంది పుచ్చుకోవడం వల్ల వారి ఆధిపత్యం అక్కడ అనేక రంగాల్లో కొనసాగుతోంది. 1972 నుంచి 1983 మధ్య కాలంలో వచ్చిన గల్ఫ్ బూమ్‌ను మలయాళీలు బాగా వినియోగించుకున్నారు. అక్షరాస్యత ఎక్కువగా ఉండటం, సాంకేతిక నైపుణ్యం గల కోర్సులు చేయడం వల్ల చాలామంది క్లర్కులుగా, ఆర్కిటె క్టులుగా, నిర్మాణ రంగంలో సూపర్వైజర్లుగా, ఇంజినీర్లుగా మంచి అవకాశాల్ని పొందగలిగారు. మొదటితరం వారు ఆ తర్వాత తమ బంధువుల్ని, స్నేహితుల్ని తీసుకువెళ్లారు. యూఏఈలో 7,73,624 మంది, కువైట్‌లో 6,34,728 మంది, సౌదీ అరేబియాలో 4,47,440 మంది, ఖతర్‌లో 4,45,000 మంది, ఒమన్‌లో 1,34,019 మంది, బహ్రెయిన్‌లో 1,01,556 మంది మలయాళీలు ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు పంపించే విదేశీ మారకద్రవ్యం వల్ల కేరళ రాష్ట్రపు ఆర్థిక చిత్రపటం మారిపోయిందని చెప్పాలి. ప్రతి ఏటా రమారమి 60,000 కోట్ల రూపాయలు కేరళకు వస్తుంటాయి. తాము ఆ దేశాల్లో పనిచేసి సంపాదించిన ధనంలో ప్రతి ఒక్కరు కొంత వెనక్కి తమ కుటుంబాలకు పంపిస్తుంటారు. మిగతా దేశాలతో పోలిస్తే మలయాళీ ప్రజలు గల్ఫ్‌లో ఎక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నో శతాబ్దాల నుంచి అరబ్బు దేశాలతో కేరళకు సముద్ర మార్గాల ద్వారా వ్యాపారం జరగడం ప్రధాన కారణం. కేరళలో పెద్ద పరిశ్రమలు తక్కువ. పర్యావరణంపై ప్రజల చైతన్యం ఎక్కువ. ట్రేడ్ యూనియన్ల ప్రభావం వల్ల పెద్ద పెట్టుబడిదారులు రావడానికి వెనకడుగు వేస్తుంటారు. కాబట్టి మంచి సంపాదన ఎక్కడ ఉన్నా సగటు మలయాళీ ప్రవాసిగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. యువతులు కూడా దూర ప్రదేశాలు వెళుతుంటారు. కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, ఇంకా దేశంలో ఎక్కడ అవకాశాలు ఉన్నా వెళుతుంటారు. ముఖ్యంగా నర్సింగ్ వృత్తి పరంగా చూస్తే దేశ విదేశాల్లో కేరళ నర్సులకు మంచి డిమాండ్ ఉంది. దేశంలో ఏ కార్పొరేట్ ఆసుపత్రిని చూసినా అత్యంత ఎక్కువ సంఖ్యలో కేరళ నర్సులే ఉంటారు. గల్ఫ్ సంపద కేరళలో ఎంత ప్రధాన పాత్ర కలిగి ఉందంటే చాలామంది మలయాళీ కోటీశ్వరులు ఆ దేశాల్లోనే వ్యాపారం చేసి, తర్వాత మిగతా దేశాలకు తమ వ్యాపారాలను విస్తరించారు. ముథూట్ గోల్డ్ ఫైనాన్స్ గానీ, జాయ్ అలుక్కాస్ గోల్డ్ కంపెనీ గానీ గల్ఫ్ దేశాల సంపదతో విస్తరించినవే. యూసుఫ్ ఆలీ (లూలూ గ్రూప్), షంషేర్ వయలిల్ (వీపీఎస్ హెల్త్ కేర్), సన్నీ వర్కీ (జెమ్స్ ఎడ్యుకేషన్), పి.ఎన్.సి. మీనన్ (శోభ గ్రూప్) లాంటి మలయాళీ కుబేరులంతా వ్యాపారం గల్ఫ్ దేశాల్లో చేసి ఆ తర్వాత మన దేశంలో విస్తరించినవారే. ఇప్పటికీ వారి ప్రధాన కేంద్రాలు అక్కడే ఉన్నాయని చెప్పాలి. కేరళ ప్రభుత్వానికి రెవెన్యూ ద్వారా ఒక ఏడాదికి ఎంత ధనం వస్తుందో దానికి రమారమి రెండింతలు గల్ఫ్ నుంచి వస్తుంది. గల్ఫ్ నుంచి వచ్చీ పోయే ప్రయాణీకుల కోసం కేరళలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వారి బాగోగులు చూడటానికి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ ఉంది. కొచ్చి, కోజీకోడ్, మలప్పురం, కన్ననూర్ వంటి ప్రాంతాల్లో గల్ఫ్ నుంచి వచ్చే అనేక వస్తువుల్ని ధారాళంగా అమ్ముతుంటారు.గల్ఫ్ నుంచి వచ్చే ధనం వల్ల వినిమ యతత్వం బాగా పెరిగిందనే ఒక ఆరోపణ ఉన్నది. గల్ఫ్ నుంచి వచ్చిన లేదా అక్కడ పనిచేసే యువకులకు పెళ్ళి విషయంలో మంచి డిమాండ్ ఉన్నది. మరి అక్కడ విషాధ గాథలు లేవా అంటే ఉన్నాయి. స్థానికంగా ఉన్న ఆస్తి తాకట్టు పెట్టి గల్ఫ్ వెళ్ళి అనుకున్న పని దొరక్క పడరాని పాట్లు పడేవారూ ఉన్నారు. అక్కడి పత్రికల్లోనూ, టీవీ చానెళ్ళలోనూ అలాంటివారి కోసం ప్రత్యేకంగా కొంత స్పేస్ కేటాయిస్తారు. ఇటీవల వచ్చిన ‘ఆడు జీవితం’ (గోట్ లైఫ్) సినిమా అలాంటి వారి బాధల్ని చిత్రించిందన్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా కేరళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచి, లక్షలాది మధ్య తరగతి ప్రజలకు ఉపాధి చూపిన గల్ఫ్ దేశాల చమురు నిల్వలు ఇంకా చాలా కాలం ఉండాలని ఆశిద్దాం.మూర్తి కెవివిఎస్వ్యాసకర్త రచయిత, అనువాదకుడుమొబైల్: 78935 41003 -
కేరళ పునర్నిర్మాణం: సీఎం వినూత్న సూచన
తిరువనంతపురం: ప్రపంచంలోని కేరళీయులందరూ నెలజీతాన్ని విరాళమివ్వాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విజ్ఞప్తి చేశారు. తద్వారా కొత్త కేరళను పునర్నిర్మించుకోడానికి సాయపడాల్సిందిగా కోరారు. దీనికి సంబంధించి దాతలకు ఆయన వినూత్న సూచన చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు నెల వేతనం సహాయం చేయడానికి ముందుకొస్తారని తమ ప్రభుత్వం ఆశిస్తోందన్నారు. ముఖ్యంగా దాతలు నెలకు మూడు రోజుల జీతం చొప్పున పదినెలలపాటు ఆర్థిక సహాయాన్ని అందించాలనే సూచన చేశారు. దీని వల్ల దాతలకు పెద్ద భారం ఉండదని పేర్కొన్నారు. కేవలం వరద ప్రభావిత ప్రాంతాలను బాగుచేయడం మాత్రమే కాదు కేరళను పునర్నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధించడం సవాలే, కానీ సాధించి తీరాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది, ఈ నేపథ్యంలో ప్రపంచం నలుమూలలా ఉన్న మలయాళీలంతా ముందుకు రావాలని ముఖ్యమంత్రి అభిలషించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలను ఆదివారం సమీక్షించిన కేరళ సీఎం ఇప్పటివరకూ మూడు లక్షలకు పైగా ఇళ్ళు శుభ్రపరిచినట్టు చెప్పారు. దీనితోపాటు ఇళ్లకు చేరిన బాధితులకు 10వేల రూపాయల చొప్పున వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్టు వివరించారు. 1,435 సహాయక శిబిరాలలో రాష్ట్రంలో మొత్తం 4.62 లక్షల మంది ఇప్పటికీ ఉన్నారని వెల్లడించారు. వీరికి తగినంత ఆహార నిల్వలు ఉన్నాయి, అలాగే పాఠశాలలు బుధవారంనుంచి తిరిగి ప్రారంభించేందుకు యోచిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు పాఠశాలలోని అన్ని సహాయక శిబిరాలను ఇతర సమీప ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు కేరళ వరదల్లో 357మంది చనిపోగా, లక్షలాదిమంది ప్రజలలు నీడ కోల్పోయి అనాధలుగా మిగిలిలారు. దాదాపు 2వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. మరోవైపు వరద బీభత్సంనుంచి కోలుకునే పునరుద్ధరణ ప్రక్రియ వేగవంతమైంది. పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు ప్రజలు గుండె నిబ్బరంతో శ్రమిస్తున్నారు. -
వేడుకగా ఓనం
-
మలయాళీలకు ఓనం శుభాకాంక్షలు తెలిపిన మోడీ
న్యూఢిల్లీ: ఓనం పర్వదినం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ మలయాళీలకు శుభాకాంక్షలు తెలిపారు. మోడీ తన సందేశంలో మలయాళీ సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగ కేరళ యొక్క గొప్ప సంస్కృతి, వారసత్వ సంపదలను తెలియచేస్తుందన్నారు. శాంతి, సమృద్ధి, సంతోషాలతో ప్రజలు ఈ పండగ జరుపుకోవాలని మోడీ ఆకాంక్షించారు. దేశ సమగ్రతకు మలయాళీ సమాజం అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా కీర్తించారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న మలయాళీలు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. మహాబలి చక్రవర్తి ఓనం పండగ రోజు తన ప్రజలను కలుసుకునేందుకు ఆత్మ రూపంలో వస్తాడని కేరళవాసుల నమ్మకం. అతడిని తమ ఇళ్లకు ఆహ్వానించడానికే ఈ పండుగను జరుపుకుంటారు. అదికాక కేరళలో పండిన పంటలు ఈ నెలలోనే ఇండ్లకు చేరతాయి.. దాంతో ఓనం పండగను పంటల పండుగగా కూడా మలయాళీలు జరుపుకుంటారు. -
మనస్సిలాయో అంటున్న మలయాళీలు
మధురం..నగరం మలయాళీల పేరు చెప్పగానే నర్సులు, కాన్వెంట్ టీచర్లు గుర్తొస్తారు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు హైదరాబాద్‌లోని చాలా చోట్ల మలయాళీలు వేర్వేరు వృత్తుల్లో తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. నగరంలో మలయాళీల జనాభా ఏడు లక్షల వరకు ఉంది. హైదరాబాద్‌కు మలయాళీల వలస 1950 కంటే ముందే మొదలైంది. భాగ్యనగరి మలయాళీల మనసు దోచుకోవడంతో ఇక్కడ వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. లక్షల మంది ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవడం నగరంపై మమకారమే కారణం. ఇదే విషయంపై కొందరు మలయాళీలను కదిలించగా ‘హైదరాబాదీల మనసు మధురం.. మనస్సిలాయో(అర్థమయిందా?)’ అంటూ ముసిముసినవ్వులు చిందించారు.... బ్రిటిష్ హయాంలో ఉన్న ఆస్పత్రుల్లో నర్సులుగా, కాన్వెంట్ స్కూళ్లలో టీచర్లుగా మలయాళీలు పనిచేసేవారు. ఇప్పటికీ మిషనరీ పాఠశాలల్లో, కళాశాలల్లో ఉపాధ్యాయులుగా మలయాళీలే ఎక్కువగా కనిపిస్తారు. ఇక నర్సులుగా సేవలందిస్తున్న కేరళ యువతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగరంలో పదికి పైగా నర్సింగ్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో తొంబై శాతం మంది మలయాళీ అమ్మాయిలే ఉంటారు. ఇంటర్ పూర్తి కాగానే హైదరాబాద్ వచ్చి, నర్సులుగా శిక్షణ పొంది కార్పొరేట్ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేయడం కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. ఇటీవలి కాలంలో హోటల్ వ్యాపారంలోనూ మలయాళీలు తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. కేరళ వంటకాలు ఇక్కడి మలయాళీలనే కాకుండా, మిగిలిన హైదరాబాదీలనూ ఆకట్టుకుంటున్నాయి. కేరళ బియ్యంతో భాగ్యనగరి బంధం ఒకప్పుడు హైదరాబాదీలు కేరళ బియ్యానికి దాసులుగా ఉండేవారు. చూడటానికి కాస్త లావుగా ఉన్నా, కేరళ బియ్యం రుచి మరెక్కడా దొరకదనే వారు. పూర్వం కేరళ నుంచి వచ్చినప్పుడల్లా పది కిలోల బియ్యం తెచ్చుకునేవాళ్లట. ఇప్పుడా అవసరం లేదు. ఇక్కడే బోలెడన్ని రకాల బియ్యం అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కేరళ హోటళ్లలో ఫేమస్ వంటకమంటే దోశ, దాంతో పాటే కేరళీయులు ప్రత్యేకంగా తయారుచేసే కొబ్బరి చట్నీ. సాధారణంగా కేరళ వంటలంటే కొబ్బరినూనెతో చేసిన వంటకాలనే అనుకుంటారు. ఇక్కడ స్థిరపడ్డవారు క్రమంగా మామూలు నూనెకు అలవాటు పడ్డారు. ఎప్పుడైనా కేరళ నుంచి బంధువులు వస్తే తప్ప వారి ఇళ్లలో కొబ్బరినూనె వంటల ఘుమఘుమలు బయటకు రావు. మలయాళీల ఉగాది విషు మలయాళీల కొత్త సంవత్సరం ‘విషు’. మనం ఉగాది పండుగ జరుపుకుంటున్నట్లే, మలయాళీలు విషు వేడుకలను జరుపుకుంటారు. హైదరాబాద్‌లోనూ ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. రాత్రిపూట దేవాలయాలకు వెళ్లి, అక్కడే పడుకుని, తెల్లవారు జామున మూడుగంటలకు లేచి, కళ్లు మూసుకుని దేవుని ఎదుటకు వచ్చి నిలబడతారు. కొత్త ఏడాది మొదటి దర్శనం దేవుని రూపమే కావాలనేది ‘విషు’ పండుగలో ప్రత్యేకత. అలా దేవుడిని చూసే వేడుకను ‘విషుకని’ అంటారు. హైదరాబాద్‌లోని చాలా దేవాలయాలు మలయాళీల కోసం ప్రత్యేకంగా ‘విషుకని’ పూజలు నిర్వహిస్తాయి. ‘దిల్‌సుఖ్‌నగర్‌లోని అయ్యప్ప దేవాలయంలో విషుకని పూజలను ఏటా ఘనంగా నిర్వహిస్తారు. పెద్దసంఖ్యలో మలయాళీలు ఆ ఆలయానికి వస్తారు. కొత్త దుస్తులు, ఆభరణాలు ధరించి, పండ్లు, పూలు దేవుడికి సమర్పించి, వేకువ జామున మూడింటికల్లా శ్రీకృష్ణుడిని దర్శించుకోవడంతో విషు వేడుకలు మొదలవుతాయి. ఇక్కడి వారితో పాటు పండుగకు వచ్చిన వారి స్నేహితులు కూడా గుడికి వస్తారు. వీటితో పాటు దసరా, దీపావళి పండుగలను కూడా అందరితో కలసి సరదాగా సెలిబ్రేట్ చేసుకుంటారు. మంచి వాతావరణం... ‘ఇప్పడంటే అంతా మారిపోయింది గానీ, నలభయ్యేళ్ల కిందట హైదరాబాద్ నగరం స్వర్గంతో సమానం. పచ్చగా ఉండే మా కేరళలో కూడా ఇక్కడ ఉన్నంత చల్లని వాతావరణం ఉండేది కాదు. ఇక్కడ వేసవిలో సైతం ఉక్కబోత ఉండేది కాదు. మలయాళీల మనసు గెలుచుకోవడంలో హైదరాబాద్ ఎప్పుడూ ముందుంటుంది. కేరళ వెలుపల మలయాళీలు పెద్దసంఖ్యలో ఉన్న నగరం హైదరాబాద్ మాత్రమే. నర్సులు, టీచర్లనే కాదు, చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కూడా యాభయ్యేళ్ల కిందటే చాలామంది ఇక్కడకు వలస వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. బతుకమ్మను సరిపోలే ఓనం... మలయాళీల ప్రధానమైన పండుగ ఓనం. ఆగస్టులో వచ్చే ఈ పండుగను పదిరోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఓనం పండుగను తెలంగాణ పండుగ బతుకమ్మతో పోలుస్తారు. ఇంటి ముందు రంగురంగుల పూలను అలంకరించి, వాటిపై దీపాలు పెట్టి, వాటి చుట్టూ మహిళలు పాటలు పాడుతూ తిరుగుతారు. దీన్నే తిరువదిర అంటారు. ‘ఈ పండుగకు కేరళలో నాలుగు రోజులు ప్రభుత్వ సెలవు దినాలు ఉంటాయి. హైదరాబాద్‌లోనూ మేం ఓనం పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ వేడుక కోసం ప్రత్యేకంగా అసోసియేషన్స కూడా ఏర్పాటయ్యాయి. వాటి ఆధ్వర్యంలో పదిరోజుల ఓనం వేడుకలు జరుగుతాయి. ఆ సమయంలో మా కేరళ మహిళలంతా గోధుమ రంగు చీరల్లో కనిపిస్తారు. ఓనం సందర్భంగా చేసే ‘అడప్రదమన్’ పాయసం చాలా రుచిగా ఉంటుంది. మా వాళ్లతో పాటు చాలామంది హైదరాబాదీలు ఓనం పండుగను బాగా ఎంజాయ్ చేస్తారు’ అని వివరించారు మెహదీపట్నానికి చెందిన భార్గవి.