విశ్లేషణ
కేరళ ప్రజలు అత్యధికంగా గల్ఫ్ దేశాల్లో ప్రవాసం ఉండే విషయం తెలిసిందే. కువైట్‌లో ఉండే విదేశీయుల్లో 80 శాతం దాకా మన దేశంలోని కేరళ నుంచి వెళ్ళినవారే. గల్ఫ్ దేశాల్లోని అవకాశాల్ని మొట్టమొదటగా గుర్తించి వాటిని అంది పుచ్చుకోవడం వల్ల వారి ఆధిపత్యం అక్కడ అనేక రంగాల్లో కొనసాగుతోంది. 1972 నుంచి 1983 మధ్య కాలంలో వచ్చిన గల్ఫ్ బూమ్‌ను మలయాళీలు బాగా వినియోగించుకున్నారు.
అక్షరాస్యత ఎక్కువగా ఉండటం, సాంకేతిక నైపుణ్యం గల కోర్సులు చేయడం వల్ల చాలామంది క్లర్కులుగా, ఆర్కిటె క్టులుగా, నిర్మాణ రంగంలో సూపర్‌వైజర్లుగా, ఇంజినీర్లుగా మంచి అవకాశాల్ని పొందగలిగారు. మొదటితరం వారు ఆ తర్వాత తమ బంధువుల్ని, స్నేహితుల్ని తీసుకువెళ్లారు.
యూఏఈలో 7,73,624 మంది, కువైట్‌లో 6,34,728 మంది, సౌదీ అరేబియాలో 4,47,440 మంది, ఖతర్‌లో 4,45,000 మంది, ఒమన్‌లో 1,34,019 మంది, బహ్రెయిన్‌లో 1,01,556 మంది మలయాళీలు ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు పంపించే విదేశీ మారకద్రవ్యం వల్ల కేరళ రాష్ట్రపు ఆర్థిక చిత్రపటం మారిపోయిందని చెప్పాలి. ప్రతి ఏటా రమారమి 60,000 కోట్ల రూపాయలు కేరళకు వస్తుంటాయి. తాము ఆ దేశాల్లో పనిచేసి సంపాదించిన ధనంలో ప్రతి ఒక్కరు కొంత వెనక్కి తమ కుటుంబాలకు పంపిస్తుంటారు.
మిగతా దేశాలతో పోలిస్తే మలయాళీ ప్రజలు గల్ఫ్‌లో ఎక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నో శతాబ్దాల నుంచి అరబ్బు దేశాలతో కేరళకు సముద్ర మార్గాల ద్వారా వ్యాపారం జరగడం ప్రధాన కారణం. కేరళలో పెద్ద పరిశ్రమలు తక్కువ. పర్యావరణంపై ప్రజల చైతన్యం ఎక్కువ. ట్రేడ్ యూనియన్ల ప్రభావం వల్ల పెద్ద పెట్టుబడిదారులు రావడానికి వెనకడుగు వేస్తుంటారు.
కాబట్టి మంచి సంపాదన ఎక్కడ ఉన్నా సగటు మలయాళీ ప్రవాసిగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. యువతులు కూడా దూర ప్రదేశాలు వెళుతుంటారు. కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, ఇంకా దేశంలో ఎక్కడ అవకాశాలు ఉన్నా వెళుతుంటారు. ముఖ్యంగా నర్సింగ్ వృత్తి పరంగా చూస్తే దేశ విదేశాల్లో కేరళ నర్సులకు మంచి డిమాండ్ ఉంది. దేశంలో ఏ కార్పొరేట్ ఆసుపత్రిని చూసినా అత్యంత ఎక్కువ సంఖ్యలో కేరళ నర్సులే ఉంటారు.
గల్ఫ్ సంపద కేరళలో ఎంత ప్రధాన పాత్ర కలిగి ఉందంటే చాలామంది మలయాళీ కోటీశ్వరులు ఆ దేశాల్లోనే వ్యాపారం చేసి, తర్వాత మిగతా దేశాలకు తమ వ్యాపారాలను విస్తరించారు. ముథూట్ గోల్డ్ ఫైనాన్స్ గానీ, జాయ్ అలుక్కాస్ గోల్డ్ కంపెనీ గానీ గల్ఫ్ దేశాల సంపదతో విస్తరించినవే.
యూసుఫ్ ఆలీ (లూలూ గ్రూప్), షంషేర్ వయలిల్ (వీపీఎస్ హెల్త్ కేర్), సన్నీ వర్కీ (జెమ్స్ ఎడ్యుకేషన్), పి.ఎన్.సి. మీనన్ (శోభ గ్రూప్) లాంటి మలయాళీ కుబేరులంతా వ్యాపారం గల్ఫ్ దేశాల్లో చేసి ఆ తర్వాత మన దేశంలో విస్తరించినవారే. ఇప్పటికీ వారి ప్రధాన కేంద్రాలు అక్కడే ఉన్నాయని చెప్పాలి.
కేరళ ప్రభుత్వానికి రెవెన్యూ ద్వారా ఒక ఏడాదికి ఎంత ధనం వస్తుందో దానికి రమారమి రెండింతలు గల్ఫ్ నుంచి వస్తుంది. గల్ఫ్ నుంచి వచ్చీ పోయే ప్రయాణీకుల కోసం కేరళలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వారి బాగోగులు చూడటానికి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ ఉంది. కొచ్చి, కోజీకోడ్, మలప్పురం, కన్ననూర్ వంటి ప్రాంతాల్లో గల్ఫ్ నుంచి వచ్చే అనేక వస్తువుల్ని ధారాళంగా అమ్ముతుంటారు.
గల్ఫ్ నుంచి వచ్చే ధనం వల్ల వినిమ యతత్వం బాగా పెరిగిందనే ఒక ఆరోపణ ఉన్నది. గల్ఫ్ నుంచి వచ్చిన లేదా అక్కడ పనిచేసే యువకులకు పెళ్ళి విషయంలో మంచి డిమాండ్ ఉన్నది. మరి అక్కడ విషాధ గాథలు లేవా అంటే ఉన్నాయి. స్థానికంగా ఉన్న ఆస్తి తాకట్టు పెట్టి గల్ఫ్ వెళ్ళి అనుకున్న పని దొరక్క పడరాని పాట్లు పడేవారూ ఉన్నారు.
అక్కడి పత్రికల్లోనూ, టీవీ చానెళ్ళలోనూ అలాంటివారి కోసం ప్రత్యేకంగా కొంత స్పేస్ కేటాయిస్తారు. ఇటీవల వచ్చిన ‘ఆడు జీవితం’ (గోట్ లైఫ్) సినిమా అలాంటి వారి బాధల్ని చిత్రించిందన్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా కేరళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచి, లక్షలాది మధ్య తరగతి ప్రజలకు ఉపాధి చూపిన గల్ఫ్ దేశాల చమురు నిల్వలు ఇంకా చాలా కాలం ఉండాలని ఆశిద్దాం.
మూర్తి కెవివిఎస్
వ్యాసకర్త రచయిత, అనువాదకుడు
మొబైల్: 78935 41003
Comments
Please login to add a commentAdd a comment