మాతృదేశానికి తిరిగి వచ్చిన వలస కార్మికులకు ‘పరివర్తన న్యాయవ్యవస్థ’ (ట్రాన్సిషనల్ జస్టిస్ మెకానిజం)ను అత్యవసరంగా ఏర్పాటు చేయాలని మూలస్థాన దేశాలు, గమ్యస్థాన దేశాలకు పిలుపునిస్తూ అంత ర్జాతీయ పౌరసమాజ సంస్థలు, ప్రపంచ కార్మిక సంఘాల మహా కూటమి ఇటీవల ప్రకటన విడుదల చేశాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుండి భారత్‌కు వాపస్ వచ్చినవారు, రావాలనుకునే వారికి ఇందులోని విషయాలు వర్తిస్తాయి.
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా 19.5 కోట్ల ఉద్యోగాలు తుడిచిపెట్టుకు పోతాయని అంతర్జా్జతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అంచనా వేసింది. గల్ఫ్ మధ్యప్రాచ్య ప్రాంతంలో 50 లక్షల మంది వలస కార్మికులు ఉద్యోగాలు కోల్పోతారని అంచనా. కరోనా ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి 3 లక్షల మందికి పైగా వలస కార్మికులను ఆసియా దేశాలకు తిరిగి పంపించారు. రాబోయే నెలల్లో ఈ సంఖ్య విపరీతంగా పెరగనుంది. విదేశాల్లోని తమ కార్మికులు అధిక సంఖ్యలో తిరిగి వస్తారని భారత్, నేపాల్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు ఊహిస్తున్నాయి.
కార్మికులు వలస వెళ్లిన దేశాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరికి వేతనాలు తగ్గించడం, అసలు చెల్లించకపోవడం, వేతనం చెల్లించని సెలవు (అన్ పెయిడ్ లీవ్)పై వెళ్లాలని ఆదేశించడం జరిగింది. కార్మికులు తక్కువ పని, అసలే పనిలేక పోవడం లాంటి స్థితిలో ఉన్నారు. చాలామంది ఈ పరిస్థితుల్లో ‘వాపస్ వచ్చే హక్కు’ (రైట్ టు రిటన్)ను ఉపయోగించుకునే సందిగ్ధతలో ఉన్నారు. మరికొందరు ఎలాంటి సేవలు, మద్దతు లభించకుండా ‘క్వారంటైన్’ లలో చిక్కుకుపోయి ప్రమాదకర పరిస్థితుల్లో నివసిస్తున్నారు. ప్రవాసీ కార్మికుల దుస్థితి గురించి ఆలోచించకుండా, వాపస్ వెళ్లడం అనివార్యం అనేలాగా వ్యవహరిస్తూ గమ్యస్థాన (కార్మికులను స్వీకరించే), మూలస్థాన (కార్మికులను పంపే) దేశాలు కార్మికులను స్వదేశానికి పంపే ప్రక్రియలను ప్రారంభించాయి. వాళ్లు ఖాళీ చేతులతో వాపస్ వచ్చి, రిక్రూట్‌మెంట్ ఖర్చుల కోసం చేసిన పాత అప్పులు తీర్చలేక రుణ బానిసత్వంలో మగ్గే అవకాశమున్నది. సరైన నియంత్రణ లేనందువల్ల కార్మికులను సామూహికంగా స్వదేశాలకు తిరిగిపంపే కార్యక్రమాలను యజమానులు తమకు అనుకూలంగా ఉపయోగించుకొనే అవకాశముంది. ఇదే అదనుగా కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం, ఇవ్వాల్సిన పరిహారం, వేతనాలు, ప్రయోజనాలు చెల్లించకపోవడం జరగవచ్చు. స్వదేశాలకు వాపస్ వస్తున్న కార్మికుల మానవ హక్కులు, కార్మిక హక్కులను కాపాడటానికి కంపెనీ యాజమాన్యాలు తగిన శ్రద్ధ వహిస్తున్నాయా అని నిర్ధారించుకోవాలి.
‘వేతన దొంగతనం’ (వేజ్ థెఫ్ట్) లక్షలాది డాలర్ల మేర కార్మికులకు నష్టం కలుగజేస్తుంది. కార్మికులు సాధారణ స్థితికి చేరుకోవడానికి ప్రభుత్వాలు, బ్యాంకులు సహాయ కేంద్రం (హెల్ప్ లైన్) ఏర్పాటు చేసినప్పటికీ వ్యాపార సంస్థలు, యాజమాన్యాలు జవాబుదారీతనం నుంచి మినహాయించబడి ప్రయోజనం పొందుతున్నాయి. లాక్‌డౌన్ సమయంలో న్యాయస్థానాలు, ఇతర కార్మిక వివాద పరిష్కార యంత్రాంగాలు కూడా మూసి వేయబడ్డాయి. సరైన పరిష్కార విధానం లేకుండా గమ్యస్థాన దేశాలు, మూల స్థాన దేశాలు కార్మికులను స్వదేశానికి వాపస్ పంపే ప్రక్రియలను ఆదరా బాదరాగా చేపట్టాయి. అందువల్ల పేరుకు పోయిన సమస్యలను ప్రస్తుతమున్న వివాద పరిష్కార యంత్రాంగాలు పట్టించుకోకపోవడం జరుగుతున్నది. ఈ విషయంలో మైగ్రెంట్ ఫోరం ఇన్ ఏషియా, లాయర్స్ బియాండ్ బార్డర్స్ నెట్‌వర్క్, క్రాస్ రీజినల్ సెంటర్ ఫర్ మైగ్రెంట్స్ అండ్ రెఫ్యూజీస్, సౌత్ ఏషియా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్, సాలిడారిటీ సెంటర్ అనే సంస్థలు ఈ కింది లక్ష్యాలతో పరివర్తన న్యాయవ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చాయి.
1. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి స్వదేశానికి తిరిగివచ్చిన కార్మికుల మనోవేదన, వాదనలు, కార్మిక వివాదాలను పరివర్తన న్యాయవ్యవస్థ పరిష్కరిస్తుంది. యంత్రాంగాన్ని సమర్థవంతంగా సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది.
2. స్వదేశానికి వాపస్ వచ్చిన కార్మికులందరూ చట్టబద్ధమైన పరిహారం పొందడం కోసం ‘న్యాయం పొందే సౌలభ్యం’(యాక్సెస్ టు జస్టిస్) కల్పించడానికి ప్రాధాన్యమివ్వాలి.
3. కార్మిక వివాదాలకు సంబంధించిన కేసులు వీలైనంత త్వరగా పరిష్కరించాలి. వలసదారులు వాపస్ వచ్చిన తర్వాత తమ కేసులను కొనసాగించడానికి భద్రతా విధానాలు ఉండాలి. న్యాయసలహా పొందే సౌలభ్యం, మద్దతు, ‘పవర్ ఆఫ్ అటార్నీ’ విధానాలు సులభతరం చేయడం, వ్యక్తి సాక్ష్యం, ట్రిబ్యునల్ లేదా ఫిర్యాదు వ్యవస్థ ముందు హాజరు కావడం వంటి అవసరాలను తగ్గించడం చాలా ముఖ్యమైనవి.
4. యాజమాన్యాలు, వ్యాపార సంస్థలు ‘పేరోల్’ (జీతాలు తీసుకొను ఉద్యోగుల జాబితా), ఉద్యోగుల రికార్డులను కలిగివుండేలా ప్రభుత్వాలు చూడాలి. పని గంటలతో సహా అన్ని ఉపాధి రికార్డుల ప్రతులను కార్మికులు తమతో తీసుకెళ్లడానికి అనుమతించాలి.
కోవిడ్–19 కారణంగా స్వదేశానికి తిరిగివచ్చిన కార్మికుల విషయంలో మనం ‘బిల్డ్ బ్యాక్ బెటర్’ (తిరిగి బాగా నిర్మాణం) చేయాలంటే వలస కారిడార్లలో సంవత్స రాలుగా కొనసాగుతున్న ‘వేతన దొంగతనం’ సమస్యపై చూసీచూడనట్టు ఉండలేము. కరోనా మహమ్మారికి ముందు నెలలు, సంవత్సరాలుగా బకాయి ఉన్న వేతనాలను యాజమాన్యాలు ఎగవేతకు పాల్పడుతున్న పరిస్థితికి కార్మికులు రాజీపడాల్సి వస్తున్నది. తమ వీసా, నివాస హోదాను సరిగా నమోదు చేయక ఎలాంటి పత్రాలూ లేని స్థితి (అన్ డాక్యుమెంటెడ్)లోకి నెట్టివేస్తారనే భయంతో ఫిర్యాదు చేయకుండా ఉంటున్నారు. కార్మికులను పంపేందుకు ‘మూలస్థాన’ దేశాలు కొత్త మార్కెట్లను అన్వేషిస్తూనే ఉన్నప్పటికీ, కార్మికులను స్వీకరించే ‘గమ్యస్థాన’ దేశాలు చౌకగా దోపిడీకి గురయ్యే కార్మికుల కోసం చూస్తున్నాయి.
ప్రభుత్వాలు తగిన శ్రద్ధ లేకుండా వలస కార్మికులను స్వదేశానికి రప్పించడం జరుగుతున్నది. దీనివల్ల వలస దారులపై హింసకు పాల్పడే యజమానులను, నేరస్తులను బహిష్కరించడానికి, చట్టబద్ధమైన పరిహారాలు, ఫిర్యా దులకు సంబంధించిన అన్ని రికార్డులను తుడిచిపెట్టడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రతి కార్మికుడు కూడా రాబోయే తరాల మంచి భవిష్యత్తుకు మూలం అవుతాడు. కోవిడ్–19 మహమ్మారి కాలం నడుస్తున్నందున వలసదారుడి ప్రయాణ పట్టుదల, కల అణచివేయబడవద్దు. ఈ సమయంలో పరిష్కరించకపోతే, వలస నుంచి అభివృద్ధికి అనుసంధానించే నమూనాలను ఎప్పటికైనా విడదీసే ప్రమాదమున్నది. వలస కార్మికుల జీవితాల కథలు రాబోయే సంవత్సరాల్లో ఈ సామూహిక అన్యాయానికి సాక్ష్యమిస్తాయి.
మంద భీంరెడ్డి
వ్యాసకర్త గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు, ఫోన్: 98494 22622
Comments
Please login to add a commentAdd a comment