కరోనా వైరస్ ప్రేరేపించిన రివర్స్ మైగ్రేషన్ కారణంగా గ్రామీణ భారతం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి మన ఆర్థిక, పాలనావిధాన ప్రక్రియలు, ఆచరణలు, విధానాలు పూర్తిగా పరివర్తన చెందాల్సి ఉంది. పైగా, కార్మికులకు జీవించే హక్కు, ఆహార హక్కు, భద్రత హక్కు, వీటన్నింటికంటే శ్రమను గౌరవించే హక్కుకు హామీ ఇచ్చే కార్మిక జనాభా హక్కుల చార్టర్ మనకిప్పుడు ఎంతైనా అవసరం. భారత రాజకీయ నాయకత్వం, ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంతవరకు కరోనా వైరస్ అనంతర దశలో అలాంటి చార్టరే మార్గదర్శక సూత్రంగా ఉండాలి. దీన్ని గుర్తించడంలో విఫలమైతే సమాజంలో ఉపద్రవం తప్పదు.
కోవిడ్–19 ప్రాణాంతక వ్యాధి తొలి దశలో జాతి మొత్తంగా చూసిన అత్యంత విషాదకరమైన ఘటన ఏదంటే, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు భారీ స్థాయిలో వలసపోతున్న భయానకమైన దృశ్యాలే. వీరు నగర భారత అసంఘటిత ఆర్థికవ్యవస్థకు చెందిన అదృశ్య చోదకులు. ఈ వ్యాసం పనిస్థలాల నుంచి వలస కూలీల నిష్క్రమణకు సంబంధించినది. ముందుగా వలసలు అంటే ఎవరు అనేది అర్థం చేసుకుందాం. సాధారణంగా తమ జన్మస్థలం నుంచి లేక తమ నివాస స్థలం నుంచి బయటకు వెళ్లేవారు అనే ప్రాతిపదికన వలస ప్రజలను నిర్వచిస్తుంటాం. గత దశాబ్దం పొడవునా రాష్ట్రాలు దాటి కొత్త అభివృద్ధి కేంద్రాలకు ప్రత్యేకించి చిన్న, మధ్యస్థాయి పట్టణాలకు మనుషులు పయనమై పోవడం వల్ల వలస అనే చట్రం అర్థం మార్చుకుంది.
ఇలా భారీస్థాయిలో జనాభా వలస పోవడం ఎక్కడ జరుగుతోంది, వలస ప్రజలు ఎక్కువగా ఎక్కడ మొదలై ఎక్కడికి వెళుతున్నారు. వారి నివాస స్థానం, వారి గమ్య స్థానం ఏది అనేది చర్చనీయాంశంగా ఉంటోంది. వలస కార్మికులు ప్రధానంగా మహానగరాల్లో భవన నిర్మాణ స్థలాల్లో పనిచేస్తుంటారు. పట్టణాల శివారు ప్రాంతాల్లో ఇటుకబట్టీల్లో పనిచేస్తుంటారు. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేస్తుంటారు. పైగా చెరకు పండించే ప్రాంతాలు, ముక్కారు పంటలు పండించే ప్రాంతాల్లో కూడా వీరు కనిపిస్తారు. ఇవి కాకుండా చిన్న చిన్న రోడ్డు పక్క వ్యాపారం చేసేచోట, సేవలు అందించే చోట కూడా వీరు పనిచేస్తుంటారు.
దేశం మొత్తంమీద ఉత్తరప్రదేశ్, బిహార్‌ల నుంచి భారీగా వలసలు జరుగుతుంటాయని, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, జమ్ము కశ్మీర్, పశ్చిమ బెంగాల్ తర్వాత స్థానాల్లో ఉంటాయని క్షేత్రస్థాయి అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక వలసప్రజలను భారీ ఎత్తున స్వాగతిస్తున్న రాష్ట్రాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజ రాత్, ఏపీ, కేరళ తొలి స్థానాల్లో ఉంటున్నాయి. భారత్‌లో వలస ప్రజల గురించి అందుబాటులో ఉన్న డేటా పూర్తి వైవిధ్యభరితమైన వాస్తవికతను ప్రదర్శిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోపల వివిధ ప్రాతాలకు 45 కోట్లమంది వలసపోతున్నారని, ఇది 2001 జనాభా లెక్కల కంటే 30 శాతం ఎక్కువగా ఉంటోందని తెలుస్తోంది.
దేశం లోపల భారీఎత్తున సాగుతున్న ఈ వలసకు కారణాలు ఏంటి? అమితమైన బాధ, కడగండ్ల బారినపడటం లేక అవకాశాలు వెదుక్కుంటూ పోవడం వల్ల వలస వెళుతున్నారా? లభ్యమవుతున్న సహజ కారణాలు, పంచుకున్న అనుభవాలను పరిశీలించినట్లయితే వలసలు ప్రారంభమవుతున్న రాష్ట్రాలు తక్కువ సామాజిక, ఆర్థికాభివృద్ధిని నమోదు చేస్తున్నాయని, చాలావరకు దేశంలో వలసలనేవి జీవనం గడపడంకోసం, మనుగడకోసం పోరాటంలో భాగంగా జరుగుతుంటాయని తెలుస్తుంది. జీవితంలో బాధలనుంచి బయటపడటానికే మన దేశంలో ఎక్కువగా వలసలు జరుగుతుంటాయి. వలసలు ప్రారంభమయ్యే, చేరుకునే ప్రాంతాల్లోని పని అవకాశాలు, మనుగడ పరిస్థితుల ప్రాతిపదికనే వలసల వ్యూహాలు ఆధారపడి ఉంటాయి.
వలసపోయిన వారు తిరిగి తమ నివాస ప్రాంతాలకు చేరుకోవడం ఏ స్థాయిలో జరుగుతోందో పరిశీలిద్దాం. లేబర్ ఫోర్స్ సర్వే (2017–18) కాలానికి గాను 23 కోట్ల 80 లక్షలమంది కార్మికులు స్వయం ఉపాధి విభాగంలో పనిచేస్తున్నారని, మరో 11 కోట్ల 20 లక్షల మంది తాత్కాలిక కార్మికుల విభాగంలో పనిచేస్తున్నారని తెలిసింది. శాశ్వత వర్కర్లుగా ఉంటున్న లేదా మూడేళ్లకు మించి ఒప్పందంలో భాగంగా పనిచేస్తున్న వారు కోటీ 90 లక్షలమంది మాత్రమే. వీరిని మాత్రమే శాశ్వత ఉద్యోగులు అని పిలుస్తున్నారు. ఇకపోతే క్రమబద్ధమైన ఉపాధి రంగంలో ఉంటూనే తాత్కాలిక ఉపాధిరంగంలో పనిచేస్తున్న 4 కోట్ల 90 లక్షలమంది కార్మికులను ఈ విభాగం నుంచి తప్పించారు.
ఆరో ఆర్థిక జనగణన 2015–16 ప్రకారం (కేంద్ర పాలితప్రాంతాలు మినహా), దేశంలో 2 కోట్ల 40 లక్షల పైబడిన వ్యాపార సంస్థలు 21 కోట్ల 16 లక్షలమంది కార్మికులను నియమించాయి. ఇక కార్మికుల సంఖ్య రీత్యా చూస్తే, 17.2 కోట్లమంది కార్మికులు (79.85 శాతం) తొమ్మిది మంది కంటే తక్కువ సంఖ్యలో కార్మికులను కలిగి ఉన్న సంస్థల్లో పనిచేస్తున్నారు. ఇకపోతే 10 మందికి మించి 49 మందికి మించని కార్మికులు ఉన్న వ్యాపార సంస్థల్లో 2 కోట్ల మంది పనిచేస్తున్నారు. వందమందికంటే ఎక్కువ కార్మికులను కలిగి ఉన్న వ్యాపార సంస్థల్లో కోటీ 70 లక్షల మంది (8 శాతం) మాత్రమే పనిచేస్తున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. భారీ సంస్థలను మినహాయిస్తే, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో పనిచేస్తున్న వారు స్థూల దేశీయ ఉత్పత్తిలో 6.11 శాతానికి దోహదం చేస్తున్నారు.
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా మంత్రిత్వ శాఖ 2010 మార్చి 20న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, కాంట్రాక్టు, తాత్కాలిక కార్మికులతో సహా ఏ విభాగానికి సంబంధించిన ఉద్యోగులను, కార్మికులను తొలగించరాదని, వారి వేతనాల్లో కోత విధించరాదని ఆదేశించింది. ఈ సర్క్యులర్ ప్రకారం లే ఆఫ్‌లు ప్రకటించకుండా తమ వద్ద పనిచేస్తున్న కార్మికులకు సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు వేతనాలు చెల్లించవలసి వస్తే అది పలు ఆర్థిక అవరోధాలకు సాక్షీభూతమై నిలుస్తుంది. అదనపు వేతన ఖర్చులను భరించాల్సి వస్తున్న కారణంగా ఈ విభాగంలోని అనేక యూనిట్లు దివాలా తీయక తప్పదు.
ఈ భారీ ఖర్చును భరించే శక్తి చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలకు ఉండదు. అందుచేతనే దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్.. కోట్లాది మంది వలస కార్మికుల జీవితాలను బాగు చేయలేనంతగా దెబ్బ తీయడమే కాకుండా, ఉత్పత్తి నుంచి పంపిణీ, వినియోగం వరకు అన్ని విభాగాల్లో, రంగాల్లో కార్యకలాపాలను స్తంభింపజేసింది. నగరాల నుంచి భారీస్థాయిలో వలసకార్మికులు తిరుగుముఖం పట్టడం అనేది స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో అతిపెద్ద మానవ విషాదాల్లో ఒకటిగా నిలిచింది. గత వందేళ్లకాలంలో కోవిడ్–19 ప్రాణాంతక వైరస్ కలిగిస్తున్న ఉత్పాతాన్ని ఇటీవలి మానవచరిత్రలో ఎవరూ చూసి ఉండలేదు. 1918లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన ఫ్లూ వ్యాధిని మాత్రమే దీనికి సరిసమానంగా భావించవచ్చు కానీ ఆనాడు ఆ వ్యాధికి గురైన బాధితులు దాదాపుగా ఇప్పుడు బతికి ఉండలేదు.
కోవిడ్–19 నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పునరుద్దరణ క్రమం అనేది సుదీర్ఘ ప్రక్రియను అనుసరిస్తుంది. తమ నివాస ప్రాంతాల్లో పనులు దొరకని, పట్టణ ప్రాంతాల్లో అవకాశాల కోసం చూస్తున్న వలస కార్మికులకు ఇది బాధాకరమైన ప్రక్రియగానే ఉండబోతుంది. భారత నగరీకరణకు చెందిన చెల్లాచెదురు స్వభావం కానీ, లాక్ డౌన్‌ని పాక్షికంగా దశలవారీగా ఎత్తివేసిన పరిస్థితులు కానీ కాంట్రాక్టర్ కీలకంగా ఉండే కార్మికుల సప్లయ్ చైన్స్‌ని తిరిగి కొలిక్కి తీసుకురావడానికి కాస్త ఎక్కువ సమయాన్నే తీసుకునేలా ఉన్నాయి. కార్మికులు తిరిగి వస్తున్నందున అనియత రంగ కార్మిక మార్కెట్ కూడా మార్పు చెందనుంది. పైగా వలస కార్మికులను భారీగా ఇముడ్చుకునే నిర్మాణం రంగం వంటి కొన్ని రంగాలు త్వరలో పుంజుకోవడం సాధ్యపడదు.
రాష్ట్రాలు దాటిపోయే వలస కార్మికులపై ఇప్పుడు తమ నివాస ప్రాంతాలకు సమీపంలో ఉండే పట్టణాలు, నగరాలనుంచి ఒత్తిడి పెరుగుతోంది కానీ ఇవి వారికి పెద్దగా అవకాశాలు కల్పించలేవు. అధిక జనాభా ఖాళీగా ఉండటం, కారుచౌకగా శ్రామికులు అందుబాటులో ఉండటం అనేవి కార్మికుల సామూహిక బేరసారాలు, భద్రత, పని హక్కువంటి అంశాలపై విధ్వంసకర ఫర్యవసానాలకు దారి తీస్తాయి. ఇప్పటికే తమ నివాస ప్రాంతాలకు వెళ్లిపోయిన వలస కార్మికులు పని దొరకబుచ్చుకునే సామర్థ్యం తీవ్రంగా దెబ్బతినిపోయి ఉన్న పరిస్థితుల్లో, వీరి చుట్టూ అల్లుకున్న సామాజిక బాంధవ్యాలు మానవ మనుగడను సంక్షోభంలోకి నెట్టివేస్తాయి. ఇలా రివర్స్ మైగ్రేషన్ కలిగిస్తున్న ప్రభావం ఇప్పటికే వ్యవసాయ క్షేత్రాలపై వాటి అనుబంధ కార్యకలాపాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తోంది.
మరి దీనికి పరిష్కారం ఏమిటి? కరోనా వైరస్ ప్రేరేపించిన రివర్స్ మైగ్రేషన్ కారణంగా గ్రామీణ భారతం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి మన ఆర్థిక, పాలనావిధాన ప్రక్రియలు, ఆచరణలు, విధానాలు పూర్తిగా పరివర్తన చెందాల్సి ఉంది. పైగా, కార్మికులకు జీవించే హక్కు, ఆహార హక్కు, భద్రత హక్కు, వీట న్నింటికంటే శ్రమను గౌరవించే హక్కుకు హామీ ఇచ్చే కార్మిక జనాభా హక్కుల చార్టర్ అవసరం మనకిప్పుడు ఎంతైనా అవసరం. భారత రాజకీయ నాయకత్వం, ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంతవరకు కరోనా వైరస్ అనంతర దశలో అలాంటి చార్టరే మార్గదర్శక సూత్రంగా ఉండాలి. దీన్ని గుర్తించడంలో విఫలమైతే సమాజంలో ఉపద్రవం తప్పదు.
-దిలీప్ దత్తా, డైరెక్టర్, సీఈఓ,
సాయంతన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, కోల్‌కతా
Comments
Please login to add a commentAdd a comment