విశ్లేషణ
డిసెంబర్ 21, 22 తేదీలలో రెండు రోజుల పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ వెళ్లనున్నారు. 43 ఏళ్లలో భారత ప్రధాని కువైట్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. విశ్వసనీయమైన చమురు సరఫరాదారు అయిన కువైట్‌లో 21 శాతం జనాభాతో అతిపెద్ద విదేశీ సమూహంగా భారతీయులు ఉంటున్నారు. భారత్‌లో కువైటీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను ఆకర్షించడం, అనూహ్య పరిస్థితులలో ఉపయోగపడటానికి భారత్‌లో కువైటీ చమురును వ్యూహాత్మకంగా నిల్వ చేయడం, కువైట్ ఆధునికీకరణలో భారత కంపెనీలకు భాగస్వామ్యం కల్పించడం, రక్షణ, భద్రత లాంటి అంశాలు చర్చకు రానున్నాయి.
స్థిరమైన, బాగా వృద్ధి చెందుతున్న ద్వైపాక్షిక సంబంధాల పట్ల ఉన్నత స్థాయి శ్రద్ధ అనేది దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాలలో ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. 1981లో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కువైట్‌ను సందర్శించిన 43 ఏళ్ల తరువాత, 2013లో కువైట్ ప్రధానమంత్రి భారతదేశ పర్యటనకు వచ్చిన 11 ఏళ్ల తరువాత మొదటిసారిగా భారతదేశం నుండి కువైట్‌కు ప్రధాని స్థాయి పర్యటన జరగడానికి గల కారణం ఇదే అయి ఉండవచ్చు.
అతిపెద్ద విదేశీ సమూహంగా భారతీయులు
కువైట్‌తో భారతదేశ సంబంధాలు రెండు దేశాలు స్వాతంత్య్రం పొందడానికి ముందు నుండీ ఉన్నాయి. బస్రా నగరం పేరుతో ప్రసిద్ధి చెందిన బస్రా ముత్యాలను సాహసవంతులైన కువైట్ డైవర్లు సేకరించి బస్రా పోర్టు నుండి భారత్‌కు తెచ్చేవారు. వీటిని రాజవంశీ యులు, సంపన్నులు ఆభరణాల రూపంలో ధరించేవారు. వారి తిరుగు ప్రయాణంలో దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, ఆహార పదా ర్థాలు, ఇతర ఉత్పత్తులను తమ పడవల్లో తీసుకువెళ్లేవారు. శిలాజ ఇంధన వనరులను గుర్తించడానికి ముందు, గల్ఫ్ ప్రాంతంలో నిపుణులైన కువైట్ వ్యాపారస్తులకు భారత్‌తో వాణిజ్యం అనేది సంపదకు ముఖ్య వనరుగా ఉండేది.
ఈ సంబంధాలు కేవలం వాణిజ్యం వరకు పరిమితం కాలేదు. బొంబాయిని సందర్శించాలనే ఆకాంక్ష వారిలో ఉండేది. కువైట్‌కు చెందిన అమీర్ ఒకరు వర్షాకాలంలో గడపడానికి తనకు బాగా నచ్చిన బొంబాయి నగరంలోని మెరైన్ డ్రైవ్‌లో విలాసవంతమైన ఆస్తిని కొనుగోలు చేశారు. ఆ ఆస్తి ఇప్పటికీ ఉంది. ఇరు దేశాలకు చెందిన ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందువల్ల, 1961లో కువైట్ స్వతంత్ర దేశంగా మారిన ప్పుడు, దానితో మొదటగా దౌత్య సంబంధాలు నెలకొల్పుకున్న దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది.
1970ల దశకం నుండి శిలాజ ఇంధనాల ద్వారా భారీగా ఆదాయం రావడంతో, తమ సాంకేతికత, విద్య, రక్షణ, భద్రత, పెట్టుబడులు, వినోదం కోసం పశ్చిమ దేశాలపై కువైట్ ఆధార పడసాగింది. భారత్‌తో సంబంధాలు కొనసాగినప్పటికీ, వాటి ప్రాధాన్యత అదే విధంగా కొనసాగలేదు. కానీ గత రెండు దశా బ్దాలుగా భారత్‌లో వేగంగా జరిగిన ఆర్థికాభివృద్ధి, సాంకేతికత– రక్షణ రంగాలలో పెరిగిన సామర్థ్యం, ప్రాంతీయ బలం కారణంగా భారత్, కువైట్ మధ్య సంబంధాలు గణనీయంగా పెరిగాయి.
ద్వైపాక్షిక వాణిజ్యం 10 బిలియన్ అమెరికన్ డాలర్లను దాటింది. కువైట్‌లో పది లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులు నివసి స్తున్నారు. అతి పెద్ద విదేశీ సమూహంగా కువైట్ జనాభాలో 21 శాతంగా ఉన్నారు. ఆ దేశం కార్మిక శక్తిలో 30 శాతంగా ఉన్నారు. భారత్ చమురు దిగుమతి చేసుకునే మొదటి ఆరు దేశాలలో కువైట్ ఒకటి. విశ్వసనీయమైన సరఫరాదారుగా కువైట్ నిలిచింది. ఇండి యాలో కువైట్ సంస్థాగత పెట్టుబడులు 15 బిలియన్ అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంటాయని అంచనా.
రెండు బిలియన్ డాలర్ల ఎగుమతులు
ఇండియాతో దీర్ఘ కాలంగా వ్యాపార సంబంధాలు నెరుపుతున్న అల్ ఘనిమ్, అల్ షాయా వంటి వ్యాపార సంస్థలు ఇక్కడి తయారీ, సేవల రంగంలో పెట్టుబడులు పెట్టాయి. అదేవిధంగా భారత్‌కు చెందిన ఎల్ అండ్ టి, శాపూర్‌జీ పల్లోంజి, కల్పతరు, కేఈసీ, ఇఐఎల్, మేఘా, అశోక్ లేల్యాండ్, విప్రో, టాటా, టీసీఐఎల్, కిర్లోస్కర్ వంటి సంస్థలు కువైట్ మౌలిక వసతులు, అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నాయి.
ఆర్థిక, సంబంధిత రంగంలో ఎల్‌ఐసీ, న్యూ ఇండియా ఎస్యూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ వంటి సంస్థలు అనేక సంవత్సరాలుగా కువైట్‌లో క్రియాశీల కార్యకలాపాలు నిర్వహి స్తున్నాయి. 2023–24లో మొదటిసారిగా కువైట్‌కు భారతీయ ఎగుమతులు 34 శాతం పెరిగి 2 బిలియన్ అమెరికన్ డాలర్లను దాటాయి. ప్రవాస భారతీయుల నుండి భారత్‌కు వస్తున్న రెమి టెన్సులు ఇప్పుడు 5 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఉంటాయని అంచనా. కువైట్‌లో భారతీయ ఉత్పత్తులు, బ్రాండ్లకు ప్రాధాన్యం పెరుగుతోంది.
కానీ ఇంకా ఎంతో సాధించవచ్చు. ఇదొకసారి చూడండి: 18,000 చదరపు కిలోమీటర్ల కంటే తక్కువ భౌగోళిక వైశాల్యం కలిగిన కువైట్ (వైశాల్యంలో అనేక భారతీయ జిల్లాలు దానికంటే పెద్దవి) 105 బిలియన్ బ్యారెల్స్ కంటే ఎక్కువ చమురు నిక్షేపాలు కలిగి ఉండి ప్రపంచంలోనే 6వ స్థానంలో ఉంది. దాని సావరిన్ ఫండ్లో సుమారుగా ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్లు ఉన్నాయి. భారత నాణ్యమైన ఉత్పత్తులు, సేవలకు అత్యధిక తలసరి ఆదాయ దేశంగా కువైట్ ఒక లాభసాటి మార్కెట్. పైగా రానున్న పదేళ్లలో మౌలిక సదుపాయాలపై 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళిక ఉన్నందున భారతీయ సంస్థలకు గొప్ప అవకాశం. అంతే కాకుండా, భారతదేశంలో విలాస వంతమైన పర్యాటకం, పోర్ట్ ఫోలియో పెట్టుబడులకు సంపన్న కువైటీలు ఒక మంచి వనరుగా ఉండగలరు.
సంబంధాలు మరో స్థాయికి...
విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ 2024 ఆగస్ట్‌లో కువైట్‌ను సందర్శించారు. సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లో కువైట్ యువ రాజు, ప్రధాని మోదీ భేటీ జరిగింది. కువైట్ విదేశాంగ మంత్రి ఈ నెల ఆరంభంలో భారత్ వచ్చారు. ఇప్పుడు మోదీ కువైట్ పర్యటనతో సంబంధాలు మరో స్థాయికి చేరడానికి సిద్ధంగా ఉన్నాయి.
పర్యటనను ఫలవంతం చేయటానికి అనేక ముందస్తు చర్యలు ఇప్పటికే చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, రక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆహార భద్రత, వ్యవసాయం, ఉప దౌత్య అంశాలపై పనిచేసే ఏడు కొత్త జాయింట్ వర్కింగ్ గ్రూపు (జేడబ్ల్యూజీ)లకు ఇరువురు విదేశీ మంత్రులు ఆమోదించారు. చమురు, కార్మికులు, ఆరోగ్యంపై ఇదివరకే ఉన్న జేడబ్ల్యూజీలతో కలిసి పనిచేస్తూ విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకు వెళ్ళడానికి ఈ కొత్త గ్రూపులు సహాయపడతాయి.
భారత్‌లో కువైటీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను ఆకర్షించడం, అనూహ్య పరిస్థితులలో ఉపయోగపడటానికి భారత్‌లో కువైటీ చమురును వ్యూహాత్మకంగా నిల్వ చేయడం, భారతీయ పెట్రో కెమికల్స్ రంగంలో కువైట్ పాల్గొనడం, కువైట్ ఆధునికీకరణ ప్రణాళికలలో ప్రపంచ స్థాయి సామర్థ్యాలు కలిగిన భారతీయ మౌలిక సదుపాయాల కంపెనీలు ఎక్కువగా పాలుపంచుకునే విధంగా మార్గం సుగమం చేయడం లాంటివి ఈ సంబంధాల నుంచి ఆశిస్తున్న ఫలితాలు. కువైట్‌లో భారతీయ కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, వారి సమస్య లను వేగంగా పరిష్కరించడం మరో ముఖ్యమైన అంశం.
రక్షణ, భద్రతా సమస్యలు కూడా చర్చించాల్సి ఉంది. భారత్, కువైట్ పరస్పర సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ, భారతీయ నౌకాదళానికి చెందిన నౌకలు క్రమం తప్పకుండా కువైట్ పోర్ట్‌ను సందర్శిస్తున్నప్పటికీ, రక్షణ, భద్రత సహకారంపై మరింత శ్రద్ధ, సంప్రదింపులు అవసరం. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాల కారణంగా, ఈ ప్రాంతంలో ఆందోళన భావన నెలకొంది. జీసీసీ (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) అధ్యక్ష స్థానంలో కువైట్ ఉన్నందున, భారత సౌహార్ధత, దౌత్య సంబంధాల సహకారంతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చు.
సతీశ్ సి. మెహతా
వ్యాసకర్త కువైట్‌కు భారత మాజీ రాయబారి
Comments
Please login to add a commentAdd a comment