తిరువనంతపురం: ప్రపంచంలోని కేరళీయులందరూ నెలజీతాన్ని విరాళమివ్వాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విజ్ఞప్తి చేశారు. తద్వారా కొత్త కేరళను పునర్నిర్మించుకోడానికి సాయపడాల్సిందిగా కోరారు. దీనికి సంబంధించి దాతలకు ఆయన వినూత్న సూచన చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు నెల వేతనం సహాయం చేయడానికి ముందుకొస్తారని తమ ప్రభుత్వం ఆశిస్తోందన్నారు. ముఖ్యంగా దాతలు నెలకు మూడు రోజుల జీతం చొప్పున పదినెలలపాటు ఆర్థిక సహాయాన్ని అందించాలనే సూచన చేశారు. దీని వల్ల దాతలకు పెద్ద భారం ఉండదని పేర్కొన్నారు. కేవలం వరద ప్రభావిత ప్రాంతాలను బాగుచేయడం మాత్రమే కాదు కేరళను పునర్నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధించడం సవాలే, కానీ సాధించి తీరాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది, ఈ నేపథ్యంలో ప్రపంచం నలుమూలలా ఉన్న మలయాళీలంతా ముందుకు రావాలని ముఖ్యమంత్రి అభిలషించారు.
సహాయ, పునరావాస కార్యక్రమాలను ఆదివారం సమీక్షించిన కేరళ సీఎం ఇప‍్పటివరకూ మూడు లక్షలకు పైగా ఇళ్ళు శుభ్రపరిచినట్టు చెప్పారు. దీనితోపాటు ఇళ్లకు చేరిన బాధితులకు 10వేల రూపాయల చొప్పున వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్టు వివరించారు. 1,435 సహాయక శిబిరాలలో రాష్ట్రంలో మొత్తం 4.62 లక్షల మంది ఇప్పటికీ ఉన్నారని వెల్లడించారు. వీరికి తగినంత ఆహార నిల్వలు ఉన్నాయి, అలాగే పాఠశాలలు బుధవారంనుంచి తిరిగి ప్రారంభించేందుకు యోచిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు పాఠశాలలోని అన్ని సహాయక శిబిరాలను ఇతర సమీప ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
మరోవైపు కేరళ వరదల్లో 357మంది చనిపోగా, లక్షలాదిమంది ప్రజలలు నీడ కోల్పోయి అనాధలుగా మిగిలిలారు. దాదాపు 2వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. మరోవైపు వరద బీభత్సంనుంచి కోలుకునే పునరుద్ధరణ ప్రక్రియ వేగవంతమైంది. పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు ప్రజలు గుండె నిబ్బరంతో శ్రమిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment