కాంట్రాక్టు నర్సుల ఆకలి కేకలు!
Published Tue, Aug 9 2016 5:58 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
సాక్షి, విశాఖపట్నం: కాంట్రాక్టు నర్సుల కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. నెలా, రెండు నెలలు కాదు.. ఏకంగా ఆరు నెలల నుంచి జీతాల కోసం అర్రులు చాస్తున్నారు. సర్కారు కనికరించకపోవడంతో పూట గడవడానికి అప్పులు చేసుకుని విధి నిర్వహణ చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగమే అయినా నెల నెలా జీతం వస్తుందన్న ఆశతో ఈ కొలువుల్లో చేరారు. అప్పట్నుంచి ప్రభుత్వం వీరితో సేవలు వినియోగించుకోవడమే తప్ప జీతాల ఊసెత్తడం లేదు. ఫలితంగా పిల్లా పాపలతో కొందరు, తల్లిదండ్రులతో మరికొందరు ఊరు గాని ఊరొచ్చి మహానగరంలో నానా అవస్థలు పడుతున్నారు.
ప్రభుత్వానికి పట్టదు!
నెలనెలా వచ్చే జీతం నాలుగు రోజులు లేటయితేనే అల్లాడిపోతుంటారు. అలాంటిది ఐదారు నెలలు రాకపోతే ఎలా బతుకుతారు? ఈ ఆలోచనే ప్రభుత్వానికి రావడం లేదు. గత మార్చిలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు పద్ధతిలో సుమారు వెయ్యి నర్సు ఖాళీలను భర్తీ చేసింది. ఒక్కొక్కరికి నెలకు రూ.15 వేల జీతంగా నిర్ణయించింది. ఇలా విశాఖలో 205 నర్సులు నియమితులయ్యారు. వీరిలో కింగ్ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్)లో 160, విక్టోరియా గవర్నమెంట్ ఆస్పత్రి (ఘోషా), 25, ప్రభుత్వ మానసిక వైద్యశాల (మెంటల్ ఆస్పత్రి)లో 20 మంది వరకు విధులు నిర్వíß స్తున్నారు. తొలి నెల జీతం రాకపోవడంతో వచ్చే నెలలో వస్తుందని సరిపెట్టుకున్నారు. ఆ మరుసటి నెలలోనూ అలాగే సర్దుబాటు చేసుకున్నారు. ఇలా నెలలు గడుస్తున్నా జీతాలు రావడం లేదు. తమ పై అధికారులను అడుగుతున్నా వారి వద్దా సమాధానం లేదు. ఇప్పటిదాకా విశాఖలో కాంట్రాక్టు నర్సులకు రూ.2 కోట్ల వరకు జీతాల బకాయి రావలసి ఉంది.
ఎన్ని అవస్థలో...
విశాఖలాంటి మహానగరంలో అరకొర జీతాలతో బతుకులీడ్చడమంటే మాటలు కాదు. నర్సులు గా చేరిన వారిలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. వారిలో కొందరు అవివాహితులు, మరికొందరు వివాహితలు.. పెళ్లి కాని అమ్మాయిలకు రక్షణగా తల్లిదండ్రులో లేక ఆత్మీయ బంధువులో వెంట వచ్చి నగరంలో అద్దె ఇళ్లలో ఉంటున్నారు. పెళ్లయిన వారయితే భర్త, పిల్లలతో తరలి వచ్చి కాపురం ఉంటున్నారు. ఐదారు నెలలుగా వీరికి జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతోంది. పుట్టిన చోట వడ్డీకి అప్పులు చేసి నెట్టుకొస్తున్నారు. అసలే పిల్లల చదువులకు పెట్టుబడులు పెట్టే సమయం కావడంతో వీరి అవస్థలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే అసలు, వడ్డీలు తడిసి మోపెడయి కూర్చున్నాయి. అసలే కాంట్రాక్టు ఉద్యోగాలు.. జీతాల కోసం గట్టిగా గొంతెత్తితే ఎక్కడ ఉద్యోగాలు ఊడిపోతాయోనన్న భయం వీరిని వెంటాడుతోంది. ‘వీరి పరిస్థితి చూసి చాలా బాధగా ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చి విధులు నిర్వహిస్తున్న వారు మరింత ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థలపై ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లాం. జీతాలు చెల్లింపుపై డీఎంఈకి మరోసారి లేఖ రాస్తాం.’ అని ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం అధ్యక్షురాలు బి.భాగ్యలక్ష్మి ‘సాక్షి’కి చెప్పారు. మరోవైపు ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు కూడా ప్రభుత్వానికి వినతి పత్రాలు పంపుతున్నారు. ఇలావుండగా సంబంధిత సూపరింటెండెంట్లు మార్చి, ఏప్రిల్ నెలల జీతాలైనా ఇచ్చేందుకు అనుమతించాలని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టరేట్‌ను కోరారు. అనంతరం వాటిని ట్రెజరీకి పంపారు. కొన్నాళ్లుగా అవి రకరకాల కొర్రీలతో మోక్షానికి నోచ లేదు. ప్రస్తుతానికి మార్చి, ఏప్రిల్ జీతాలు చెల్లిస్తే.. త్వరలో మొదటి, రెండో క్వార్టర్ల వేతనాలు చెల్లింపులకు మార్గం సుగమమవుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. మొత్తమ్మీద తమ జీతాల కోసం ఈ కాంట్రాక్టు నర్సులు రోజులు లెక్కపెడుతున్నారు.
Advertisement
Advertisement