'గ్లామర్ పోద్ది...ఎండలో ధర్నా వద్దు'
పనాజీ: గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ సమ్మె చేస్తున్న నర్సులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎండలో సమ్మె చేయొద్దు...నల్లగా అయిపోతారు.. ఆ తర్వాత పెళ్లికొడుకు దొరకడం కష్టం...ఇవీ తమ డిమాండ్ల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చిన నర్సులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు.
దాంతో నర్సులనుద్దేశించి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేసి ముఖ్యమంత్రి ఇబ్బందుల్లో పడ్డారు. కాగా సీఎం వ్యాఖ్యలపై నర్సుల అసోసియేషన్, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. నిజంగా తమ మీద అంత ప్రేమ ఉంటే తమ డిమాండ్లను పరిష్కరించేవారనీ.. బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు ఆహ్వానించదగినవి కాదని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు 33 అంబులెన్స్లను నడపడానికి అనుమతి తీసుకున్న ఓ ప్రయివేట్ సంస్థ, కేవలం పదమూడు సర్వీసులను మాత్రమే నడుపుతోందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రిని కలిసినా ఫలితం లేదని.. దాంతో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే ప్రతీ సమావేశంలోనూ ఆందోళన నిర్వహించేందుకు తాము నిర్ణయించినట్లు భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు హృదయనాధ్ శిరోద్కర్ తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారుల అవినీతిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. కాగా నర్సులపై సీఎం చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ఖండించాయి.
గోవాలోని 108 అంబులెన్స్ నిర్వహణకు సంబంధించిన నర్సులు, కొంతమంది కార్మికులు ఈ సేవలను ప్రయివేటు సంస్థకు అప్పగించడాన్ని నిరసిస్తూ గత కొన్నిరోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.