hungerstrike
-
లక్ష్మణ్ అరెస్ట్.. నిమ్స్‌కు తరలింపు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి నిమ్స్‌కు తరలించారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం పట్ల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా లక్ష్మణ్ దీక్ష చేపట్టారని తెలిపారు. శాంతియుత వాతావరణంలో దీక్ష చేస్తున్న లక్ష్మణ్‌ని అరెస్ట్ చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద నిరసన చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రగతి భవన్ ముట్టడితో సహా రేపటి అన్ని కార్యక్రమాలు యధాతథంగా కొనసాగుతాయని మురళీధర్ రావు స్పష్టం చేశారు. -
గుళ్లు కూల్చినందుకు క్షమించండి
స్వామీజీలను కలిసిన మంత్రి మాణిక్యాలరావు సాక్షి, అమరావతి : విజయవాడ నగరంలో కూల్చిన మూడు ఆలయాలకు రాజీవ్‌గాంధీ పార్క్‌లో స్థలం కేటాయిస్తున్నట్లు దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా టీడీపీ ప్రభుత్వం ఇటీవల నగరంలోని ఆలయాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ స్వామీజీలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయాలను పునర్మించటం, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పుష్కరాల ప్రత్యేకాధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామీజీల డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇవ్వటంతోపాటు పుష్కరాలు ప్రారంభానికి ముందే కూలగొట్టిన ఆలయాలను పునర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే నెలరోజులు గడిచినా ఇచ్చిన హామీలు నెరవేరకపోవటంతో శ్రీఅభయాంజనేయస్వామి ఆలయ ధర్మకర్త, స్వామీజీ శ్రీ జమునాదాస్, çశృంగేరి పీఠాధిపతి సచ్చిదానంద తీర్థస్వామి అలంకార్ సెంటర్లో నిరాహారదీక్ష చేపట్టారు. వీరితోపాటు ఎల్లాప్రగడ విజయలక్ష్మి, బెహరా చందన్ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. నిరసనను విరమింపజేసేందుకు దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాలరావు శుక్రవారం దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. శ్రీరామాలయం, శ్రీఅభయాంజనేయస్వామి, శనేశ్వరాలయాల నిర్మాణానికి నగరంలోని రాజీవ్‌గాంధీ పార్క్‌లో స్థలం కేటాయించనున్నట్లు స్వామీజీలకు హామీ ఇచ్చారు. అదే విధంగా ఆలయాల కూల్చివేతకు ప్రభుత్వం తరుపున క్షమాపణలు కోరారు. ఇకపై ఆలయాలను తొలగించాల్సి వస్తే స్వామీజీలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం నిరసన చేస్తున్న స్వామీజీలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. -
'గ్లామర్ పోద్ది...ఎండలో ధర్నా వద్దు'
పనాజీ: గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ సమ్మె చేస్తున్న నర్సులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎండలో సమ్మె చేయొద్దు...నల్లగా అయిపోతారు.. ఆ తర్వాత పెళ్లికొడుకు దొరకడం కష్టం...ఇవీ తమ డిమాండ్ల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చిన నర్సులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు. దాంతో నర్సులనుద్దేశించి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేసి ముఖ్యమంత్రి ఇబ్బందుల్లో పడ్డారు. కాగా సీఎం వ్యాఖ్యలపై నర్సుల అసోసియేషన్, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. నిజంగా తమ మీద అంత ప్రేమ ఉంటే తమ డిమాండ్లను పరిష్కరించేవారనీ.. బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు ఆహ్వానించదగినవి కాదని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 33 అంబులెన్స్‌లను నడపడానికి అనుమతి తీసుకున్న ఓ ప్రయివేట్ సంస్థ, కేవలం పదమూడు సర్వీసులను మాత్రమే నడుపుతోందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రిని కలిసినా ఫలితం లేదని.. దాంతో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే ప్రతీ సమావేశంలోనూ ఆందోళన నిర్వహించేందుకు తాము నిర్ణయించినట్లు భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు హృదయనాధ్ శిరోద్కర్ తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారుల అవినీతిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. కాగా నర్సులపై సీఎం చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ఖండించాయి. గోవాలోని 108 అంబులెన్స్ నిర్వహణకు సంబంధించిన నర్సులు, కొంతమంది కార్మికులు ఈ సేవలను ప్రయివేటు సంస్థకు అప్పగించడాన్ని నిరసిస్తూ గత కొన్నిరోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.